Telugu Global
Andhra Pradesh

పురందేశ్వరి వెయిటింగ్ పీరియడ్ అయిపోయిందా?

చంద్రబాబు వైఫ‌ల్యాన్ని, టీడీపీ హయాంలో జరిగిన అప్పులు, అవినీతి, అరాచకాల్లో దేన్నీ పురందేశ్వరి ప్రశ్నించటంలేదు. అప్పట్లో జరిగిన పరిణమాలకు కూడా ఆమె ఇప్పుడు జగన్నే నిందిస్తున్నారు.

పురందేశ్వరి వెయిటింగ్ పీరియడ్ అయిపోయిందా?
X

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విషయంలో మంత్రులు, అధికార పార్టీ నేతలు కాస్త సంయమనమే పాటించారు. ఆమె బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి ప్రభుత్వంపై ఆరోపణలతో దాడులు చేస్తునే ఉన్నారు. అవి కూడా తప్పుడు ఆరోపణలే. వారం పాటు పురందేశ్వరి ఆరోపణలు, విమర్శలకు మంత్రుల నుండి ఎలాంటి ఎటాక్ జరగలేదు. ఆమె ఎప్పుడైతే తన ఆరోపణలు, విమర్శలతో వైసీపీ ప్రభుత్వంపై రెచ్చిపోతున్నారో.. మంత్రుల్లో ఒక్కొక్కళ్ళు ఎదురుదాడి మొదలుపెట్టారు.

ఆమె ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు ఎలా ఉన్నాయంటే అచ్చంగా చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణల్లాగే ఉన్నాయి. అప్పుల విషయం, ఇండ్ల నిర్మాణం, విభజన హామీల విషయం, పోలవరం ప్రాజెక్టు ఇలా ఏ అంశం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తు మాట్లాడుతున్నారు. అందుకనే ఇక లాభంలేదని మంత్రులు కూడా రివర్సు ఎటాక్ మొదలుపెట్టేశారు. అమర్నాథ్‌, అంబటి రాంబాబు, రోజా గట్టిగా పురందేశ్వరిని వాయించేస్తున్నారు.

పురందేశ్వరి బీజేపీ అధ్య‌క్షురాలిగా మాట్లాడుతున్నారా లేకపోతే టీడీపీ తరపున మాట్లాడుతున్నారా స్పష్టంగా చెప్పాలని రోజా వాయించేశారు. ఎందుకంటే పురందేశ్వరి ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా ఉండటంలేదు. రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయినా, పోలవరం ప్రాజెక్టు వివాదాల్లో కూరుకుపోతున్నా, డెవలప్మెంట్ లేకపోయినా ముందు ఆరోపించాల్సింది చంద్రబాబు పరిపాలననే. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబే కాబట్టి. అయితే దగ్గర బంధువు అవుతారనో లేకపోతే భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే అవసరం వస్తే అప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయనో పురందేశ్వరి ముందు జాగ్రత్త పడుతున్నట్లున్నారు.

ఇందులో భాగంగానే చంద్రబాబు వైఫ‌ల్యాన్ని, టీడీపీ హయాంలో జరిగిన అప్పులు, అవినీతి, అరాచకాల్లో దేన్నీ ప్రశ్నించటంలేదు. అప్పట్లో జరిగిన పరిణమాలకు కూడా ఆమె ఇప్పుడు జగన్నే నిందిస్తున్నారు. అందుకనే పురందేశ్వరికి వెయిటింగ్ పీరియడ్ అయిపోయిందని చెప్పి మంత్రులు రివర్సు మొదలుపెట్టారు. మంత్రుల వరస చూస్తుంటే పురందేశ్వరి ప్రభుత్వం గురించి మాట్లాడినపుడల్లా టీడీపీతో కలిపి పురందేశ్వరిని వాయించేసేట్లుగానే కనిపిస్తోంది. మంత్రుల ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు+పురందేశ్వరి ఒకటే అని జనాలకు, బీజేపీ అగ్రనేతలకు చాటిచెప్పటమే.

First Published:  30 July 2023 6:22 AM GMT
Next Story