Telugu Global
Andhra Pradesh

వాలంటీర్ల రాజీనామాలు.. ఈనాడు సరికొత్త డ్రామా

వాలంటీర్ల రాజీనామాలపై ఎమ్మెల్యేల ఒత్తిడి అనేది ఈనాడు కుట్ర, ఆ ఒత్తిడి పనిచేయలేదు అని చెప్పడం కూడా ఈనాడు కుతంత్రమే.

వాలంటీర్ల రాజీనామాలు.. ఈనాడు సరికొత్త డ్రామా
X

వాలంటీర్లంతా రాజీనామా చేస్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు వారిపై ఒత్తిడి తెస్తున్నారు, డబ్బులు ఎరవేస్తున్నారంటూ ఆమధ్య ఎల్లో మీడియా చేసిన హడావిడి చూశాం. రాజీనామాలు చేసిన వాలంటీర్లంతా వైసీపీకి ప్రచారం చేస్తున్నారని కూడా బురదజల్లే ప్రయత్నం చేశారు. కానీ ఈనాడు ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. వాలంటీర్లపై పాజిటివ్ స్టోరీలు ఇస్తూ వారిని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తంది. ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నా.. వాలంటీర్లు రాజీనామాలు చేయట్లేదని అంటోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 2.56 లక్షలకుపైగా ఉన్న వాలంటీర్లలో ఇప్పటివరకు 7,963 మంది (3.11 శాతం) మాత్రమే రాజీనామాలు చేశారనేది ఈనాడు కథనం సారాంశం. అంటే ఇక్కడ ఎమ్మెల్యేల ఒత్తిడి పనిచేయలేదని తనదైన శైలిలో వివరణ ఇచ్చింది సదరు పత్రిక. ఎమ్మెల్యేలు నిజంగానే ఒత్తిడి చేస్తే వాలంటీర్లంతా రాజీనామాలు చేస్తారు కదా..? ఈ చిన్న లాజిక్ ఈనాడు ఎందుకు మిస్సయిందో అర్థం కావట్లేదు. అంటే ఒత్తిడి అనేది ఈనాడు కుట్ర, ఆ ఒత్తిడి పనిచేయలేదు అని చెప్పడం కూడా ఈనాడు కుతంత్రమే.

అసలు ఎమ్మెల్యేలు ఎక్కడా వాలంటీర్లను రాజీనామాలు చేయాలని చెప్పలేదని వైసీపీ చెబుతోంది. అలాగని బలవంతంగా ఆ పోస్టుల్లో ఉండాలని కూడా వారు సూచించట్లేదు. స్వచ్ఛందంగా రాజీనామాలు చేస్తున్నవారు విధులనుంచి తప్పుకుంటున్నారు, మిగతా వాళ్లు సైలెంట్ గా ఉంటున్నారు. నిజంగానే వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా పెట్టుకోవాలని వైసీపీ నేతలు భావిస్తే, వారితో రాజీనామాలు చేయించేవారు. అలా జరగలేదు కాబట్టి ఎల్లో మీడియా విష ప్రచారంలో నిజం ఏమాత్రం లేదని తేలిపోయింది.

వాలంటీర్ల విషయంలో మొదటి నుంచీ టీడీపీ వణికిపోతోంది. అసలు వాలంటీర్ పోస్ట్ లు అవసరం లేదని ఓసారి, తాము అధికారంలోకి వస్తే వారి ఆదాయాన్ని మరింత పెంచుతామని మరోసారి.. పరస్పర విరుద్ధమైన మాటలతో చంద్రబాబు పరువు పోగొట్టుకున్నారు. వాలంటీర్లకు తాము వ్యతిరేకం కాదంటారు, అదే సమయంలో వారిపై అభాండాలు వేస్తారు. పవన్ కల్యాణ్ కూడా ఈ విషయంలో ఇరుకున పడ్డారు. ఎన్నికల వేళ ఇప్పుడు ఎల్లో మీడియా రివర్స్ గేమ్ మొదలైంది.

First Published:  8 April 2024 3:59 AM GMT
Next Story