Telugu Global
Andhra Pradesh

కాపులు సంకటంలో పడ్డారా?

గతంలో ఎప్పుడూ లేని విధంగా కాపు నేతల్లో అలజడి మొదలైంది. దానికి కారణం ఎవరంటే పవన్ అనే చెప్పాలి. యాత్రలో భాగంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపైన పరోక్షంగా నోటికొచ్చింది మాట్లాడారు.

కాపులు సంకటంలో పడ్డారా?
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర వల్ల ఏ పార్టీకి ఎంతవరకు ఉపయోగం? వైసీపీకి ఎంతవరకు నష్టమో తెలియ‌దు. ఎందుకంటే లాభనష్టాలు ఎన్నికలు జరిగితే కానీ తెలియ‌దు. కానీ అంతకన్నా ముందే కాపు సామాజికవర్గం సంకటంలో పడబోతున్నది మాత్రం వాస్తవం. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాపు నేతల్లో అలజడి మొదలైంది. దానికి కారణం ఎవరంటే పవన్ అనే చెప్పాలి. యాత్రలో భాగంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపైన పరోక్షంగా నోటికొచ్చింది మాట్లాడారు.

దానికి స్పందించిన ముద్రగడ డైరెక్టుగానే పవన్ను లేఖ రూపంలో అండి అండి అంటూనే దుమ్ముదులిపేశారు. ముద్రగడ లేఖ దెబ్బకు పవన్ మద్దతుదారుడు చేగొండి హరిరామజోగయ్య సీన్లోకి ఎంటరై ముద్రగడ మీద ఆరోపణలు చేస్తు లేఖ విడుదల చేశారు. దీనివల్ల ఏమైందంటే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకవైపు ముద్రగడ మరోవైపు జోగయ్య మోహరించారు. వీళ్ళిద్దరి వల్ల మిగిలిన కాపు నేతలకు సమస్యలు మొదలయ్యాయి. ముద్రగడకు మద్దతుగా నిలవాలా? లేకపోతే పవన్ వెంట ఉండాలా? అన్నది పెద్ద సమస్యగా మారింది.

ఇప్పుడు ఇదే విషయం కాపు సామాజికవర్గంలోని ప్రముఖుల మధ్య సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాపు ఉద్యమనేతగా, మిస్టర్ క్లీన్‌గా ముద్రగడకు మంచి ఇమేజ్ ఉంది. అయితే ఈయనతో ఇమడటం కష్టం. ఒకపట్టాన అందరితో కలవలేకపోవటం ముద్రగడకు పెద్ద మైనస్. ఇదే సమయంలో పవన్‌కు ఉన్న ఇమేజ్ ఏమిటో కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన అవసరంలేదు.

అలాగే జోగయ్య ఇమేజ్‌ గురించి కూడా అందరికీ తెలుసు. పవన్ కోసం కాపుల మద్దతు కూడగట్టేందుకు జోగయ్య ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. కాపు ప్రముఖుల్లో ఒక్క‌రూ కూడా జనసేనలో చేరకపోవటమే దీనికి నిదర్శనం. పైగా ప్రముఖులు లేదా కాపు ప్రముఖులను పార్టీలో చేర్చుకోవటం పవన్‌కు ఇష్టంలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకనే ఇప్పుడు ముద్రగడ-పవన్‌ల రూపంలో కాపు నేతల మధ్య చీలిక రాబోతోంది. మంచికో చెడుకో కాపుల్లో పై ఇద్దరిలో ఎవరికి మద్దతుగా నిలబడాలో నిర్ణయించుకోవాల్సిన అనివార్యత ఏర్పడబోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

First Published:  22 Jun 2023 6:19 AM GMT
Next Story