Telugu Global
Andhra Pradesh

కాపు కత్తితో దూసుకువస్తున్న బీజేపీ..!

జనరల్‌గా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ గేమ్‌ప్లాన్‌ ఇలాగే ఉంటోంది. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అనేది బీజేపీ నినాదం.

కాపు కత్తితో దూసుకువస్తున్న బీజేపీ..!
X

చంద్రబాబు నాయుడికి చేదువార్త..!

పవన్‌ కళ్యాణ్‌కి పొలిటికల్‌ షాక్‌ !!

ఇది అమిత్‌ షా సాహసం. నరేంద్రమోడీ నిర్ణయం. ‘ఆంధ్రప్రదేశ్‌కి కాపు ముఖ్యమంత్రి’ ఇదీ బీజేపీ తాజా నినాదం. ఈ స్లోగన్‌తో ఎన్నికల్లో దూసుకుపోవాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. బీజేపీతో మంతనాలు జరిపిన చంద్రబాబుకీ, బీజేపీని బతిమలాడుకుంటున్న పవన్‌ కళ్యాణ్‌కీ ఇది కోలుకోలేని దెబ్బ. వాస్తవానికి ఈ కాపు నినాదంలో కొత్తదనం ఏమీ లేదు. బాగా పాత వైఖరే..! ఆంధ్రలోని బీజేపీ నాయకులుగా కాపులే ఉన్నారు గతంలో, సోము వీర్రాజు, కన్నాలక్ష్మీనారాయణ, ఆ మాటకొస్తే పవన్‌ కళ్యాణ్‌ అంతా కాపులే! బీజేపీకి విధేయంగా ఉన్నవాళ్లే..! కాపు నాయకుడ్ని తప్పించి, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరిని ఆంధ్ర బీజేపీ నాయకురాలిగా ప్రకటించినప్పుడు, అది చంద్రబాబు అతి తెలివేమో అని అనుమానించారు కొందరు. బీజేపీ మాత్రం తొణక్కుండా ఉంది.

చిత్తూరు జిల్లా కమ్మ నాయకుడూ, కృష్ణా జిల్లాకి చెందిన ఎన్టీ రామారావు గారి కమ్మని అల్లుడూ, రాజకీయాల్లో రాటుతేలినవాడూ అయిన చంద్రబాబుకి ‘విశ్రాంతి’ ఇవ్వాలని బీజేపీ కేంద్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. శక్తిమంతమైన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి కొడుకూ, కడప జిల్లా రాజకీయ నిప్పుల మీది నుంచి నడిచివచ్చినవాడూ, జనాకర్షణ గల యువ రెడ్డి నాయకుడూ అయిన జగన్‌ని పక్కన పెట్టాలనే బీజేపీ ఆలోచన.

జనరల్‌గా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ గేమ్‌ప్లాన్‌ ఇలాగే ఉంటోంది. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి అనేది బీజేపీ నినాదం. జయలలిత, చంద్రబాబు లాంటి పాతుకుపోయిన సీనియర్లని తప్పించి, కొత్త నాయకులకూ, కింది కులాల వారికీ అవకాశం ఇవ్వడమే ఒక పాలసీగా బీజేపీ పెట్టుకుంది. ఆ విధానమే ఇప్పుడు బాబు, పవన్‌ జంటకి ముచ్చెమటలు పట్టిస్తోంది.

‘కాపు సీఎం’ అనేది ఒక వ్యూహాత్మకమైన దాడి. అంటే ఏమిటంటే.. రెండు నెలల్లో ఆంధ్రకి ఒక కాపు నాయకుడు ముఖ్యమంత్రి అయిపోతాడని కాదు. దీన్ని రాజకీయ చదరంగంలో తొలి పాచికని తెలివిగా కదపడం అనాలి. వెంటనే, అర్జెంటుగా ఆంధ్రలో అధికారంలోకి వచ్చేయాలి అనేది బీజేపీ ప్లాన్‌ కానేకాదు. కాపు కత్తి దూసి, ఒకేసారి కమ్మల్నీ, రెడ్లనీ భయకంపితుల్ని చేయడం బీజేపీ లక్ష్యం. ఇప్పుడు, ఇక్కడ ఇరుక్కుపోయింది పవర్‌ స్టార్‌..!

‘ఆ చంద్రబాబుని వదిలేసిరా’ అని బీజేపీ చిలక్కి చెప్పినట్టు చెప్పినా, తలతిక్క పవన్‌ కళ్యాణ్‌ ఆ మాట వినలేదు. జగన్ని ఓడించాలంటే చంద్రబాబు తప్పనిసరి అన్నాడు. పవన్‌ లాగా, బాబు లాగా జగన్ని రేపు ఓడించిపారేయాలని బీజేపీ అనుకోవడం లేదు. జగన్‌ మోడీని వ్యతిరేకించడం లేదు. పైగా ఎంతో విధేయంగా ఉంటున్నాడు. అలాంటప్పుడు బలమైన నాయకుడు చంద్రబాబుని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం దేనికి? అని బీజేపీ కామన్‌ సెన్స్‌తో కన్నుగీటినా పవన్‌ కళ్యాణ్‌ అనే బడుద్ధాయికి అర్థం కాలేదు. ‘పవనే మా సీఎం’ అనడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం సిద్ధంగా ఉంది. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అనుకుంటున్న చంద్రబాబు, ఎత్తుగడలో భాగంగా, ‘‘పవనే మా సీఎం’’ అనగలడా..? అబ్బే, అది అసాధ్యం. దీంతో చంద్రబాబు స్వార్ధం, బీజేపీ దూకుడు మధ్య పవన్‌ పర్‌ఫెక్ట్‌గా ఇరుక్కుపోయారు.

‘కాపు సీఎం’ అని ప్రకటించడానికే బీజేపీ సమయం తీసుకుంటోంది. రేపోమాపో అది నిజమై, ప్రకటన చేస్తే.. ఆంధ్ర రాజకీయాలు టీడీపీ, వైసీపీ, జనసేన, కాపుల్స్‌వార్‌గా మారి రాజకీయ గుర్రం నాలుగు కాళ్ల మీదా దూకుతుంది. నిజంగా చెప్పుకుందాం, ఈ బీజేపీ రివర్స్‌గేరు, జగన్మోహన్‌రెడ్డికి కరుణామయుడైన ఆ ఏసుప్రభువు అడగకుండానే ఇచ్చిన వరం..!

First Published:  4 March 2024 12:01 PM GMT
Next Story