Telugu Global
Andhra Pradesh

చీపురుపల్లిలో టీడీపీకి షాక్‌.. రాజీనామా బాటలో నాగార్జున..?

2019లో పోటీ చేసి ఓడిపోయినప్పటికి నాగార్జున పార్టీ కోసం తీవ్రంగా పనిచేశారు. దీంతో నాగార్జునను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబునాయుడు. అప్పటి నుండి అటూ జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను సక్సెస్‌ చేసేందుకు కష్టపడి పని చేశారు.

చీపురుపల్లిలో టీడీపీకి షాక్‌.. రాజీనామా బాటలో నాగార్జున..?
X

ఏపీలో కూటమి పార్టీల మధ్య టికెట్ల పంచాయితీ కొనసాగుతూనే ఉంది. ఇవాళ టీడీపీ నాలుగో జాబితా ప్రకటించగా.. టికెట్ ఆశించి భంగపడిన నేతలు చంద్రబాబుపై తిరుగుబాటు చేస్తున్నారు. చీపురుపల్లిలో ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ అయింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సీటు నుంచి మాజీ మంత్రి కళా వెంకట్రావును బరిలో నిలిపారు చంద్రబాబు. ఐతే చంద్రబాబు నిర్ణయంతో చీపురుపల్లి నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా ఉన్న కిమిడి నాగార్జున తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేశారు.

2019లో పోటీ చేసి ఓడిపోయినప్పటికి నాగార్జున పార్టీ కోసం తీవ్రంగా పనిచేశారు. దీంతో నాగార్జునను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబునాయుడు. అప్పటి నుండి అటూ జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలను సక్సెస్‌ చేసేందుకు కష్టపడి పని చేశారు. ఇప్పడు తీరా ఎన్నికలు వచ్చే సరికి నాగార్జునను పక్కన పెట్టేశారు చంద్రబాబు. కిమిడి కళా వెంకట్రావుకు టికెట్ ఇచ్చి నాగార్జున రాజకీయ భవిష్యత్‌కు వెన్నుపోటు పొడిచారు. తమ నాయకుడికి అన్యాయం జరిగిందంటూ ఆందోళనలకు సిద్ధమయ్యారు నాగార్జున అనుచరులు. తన నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే పార్టీ కోసం పనిచేసేది లేదని తేల్చి చెప్తున్నారు. 2014లో చీపురుపల్లిలో నాగార్జున తల్లి కిమిడి మృణాళిని గెలిచి.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు.

బొత్స సత్యనారాయణను ఎలాగైనా ఓడించాలనుకుంటున్న చంద్రబాబు ఈ స్థానం నుంచి మొదట గంటా శ్రీనివాస రావును పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఐతే చీపురుపల్లిలో పోటీకి గంటా ఒప్పుకోకపోవడంతో ప్రత్యామ్నాయంగా కళా వెంకట్రావును పోటీలో ఉంచారు. కళా వెంకట్రావు ఎచ్చెర్ల సీటు ఆశించినప్పటికీ.. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి వెళ్లింది. చీపురుపల్లిలో పోటీకి కళా వెంకట్రావు అయిష్టంగానే ఉన్నప్పటికీ.. ఆయనకు బాబు సర్దిచెప్పినట్లు సమాచారం.

First Published:  29 March 2024 1:58 PM GMT
Next Story