Telugu Global
Andhra Pradesh

ముసుగు తీసేసిన పురందేశ్వరి

మద్యం కుంభకోణంతో పోలిస్తే స్కిల్ స్కామ్ ఎంత అన్నట్లుగా ఆమె మాట్లాడటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం అని అంటున్నారే కానీ అసలు కుంభకోణం జరిగిందా లేదా అని మాత్రం మాట్లాడటంలేదు.

ముసుగు తీసేసిన పురందేశ్వరి
X

చెల్లెలు భువనేశ్వరి భర్త, మరిది చంద్రబాబునాయుడికి మద్దతుగా బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తన ముసుగును తీసేశారు. ఇంతకాలం ఏదో మొహమాటం కొద్ది ముసుగులోనే మద్దతు పలికేవారు. అలాంటిది ఏమనుకున్నారో ఏమో రెండురోజుల క్రితం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న చంద్రబాబును పురందేశ్వరి కలిశారు. తర్వాత నుండి బీజేపీ నేత అనే ముసుగును తీసేసి అచ్చంగా మరిది అన్న పద్ధ‌తిలోనే చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రంలో భారీ మద్యం కుంభకోణం జరుగుతోందని గోల మొదలుపెట్టారు. రాష్ట్ర బడ్జెట్లో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రూ.20 వేల కోట్లని చెప్పారు. కానీ నిజానికి అందుతున్న ఆదాయం రూ.56,700 కోట్లట. మొత్తం ఆదాయంలో బడ్జెట్లో చూపుతున్న రూ.20 వేల కోట్లను తీసేస్తే మిగిలిన రూ.36,700 కోట్లు ఎటు వెళుతున్నాయన్నది పురందేశ్వరి ప్రశ్న. పురందేశ్వరి చెప్పిందేమిటంటే రూ.36,700 కోట్ల భారీ కుంభకోణం జరుగుతోందని.

ఈ కుంభకోణంపై వెంటనే సీబీఐతో విచారణ చేయిస్తే కుంభకోణం మొత్తం బయటపడుతుందని ఆమె చెప్పారు. అందుకని వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ కూడా చేసేశారు. విచిత్రం ఏమిటంటే కేంద్రంలో అధికార బీజేపీ నేత అయి ఉండి కూడా ..సీబీఐ విచారణకు డిమాండ్ చేయటమే. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చెప్పి వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ‌లతో విచారణ చేయించ‌వ‌చ్చు కదా.

మద్యం కుంభకోణంతో పోలిస్తే స్కిల్ స్కామ్ ఎంత అన్నట్లుగా ఆమె మాట్లాడటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం అని అంటున్నారే కానీ అసలు కుంభకోణం జరిగిందా లేదా అని మాత్రం మాట్లాడటంలేదు. ప్రకాశం జిల్లాలోని స్కిల్ సెంటర్‌పై తాను వాకాబు చేయిస్తే అన్నీ సక్రమంగానే ఉన్నట్లు తేలిందట. కాబట్టి చంద్రబాబు అరెస్టు రాజకీయంగా జరిగిందనే నిర్ణయానికి పురందేశ్వరి వచ్చేశారు. మొత్తానికి మరిది కోసమని పార్టీ లైన్‌ను కూడా పురందేశ్వరి దాటేస్తున్నట్లు అర్థ‌మవుతోంది.


First Published:  20 Sep 2023 5:44 AM GMT
Next Story