Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుది పెద్ద తప్పు, జగన్ ది చిన్న తప్పు.. కడిగేసిన కాగ్

రాజధాని కోసం భూసేకరణపై గత ప్రభుత్వ తీరును కాగ్ ఎండగట్టింది. భూసేకరణ విషయంలో నిపుణుల కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొలేదని తేల్చింది.

చంద్రబాబుది పెద్ద తప్పు, జగన్ ది చిన్న తప్పు.. కడిగేసిన కాగ్
X

ఏపీ అసెంబ్లీలో ఈ రోజు కాగ్ నివేదిక ప్రవేశ పెట్టారు. 2016-2021 మధ్య ఏపీలో జరిగిన పనుల్లో పలు అవకతవకలను కాగ్ తన నివేదికలో పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగాయని, ఈ ప్రభుత్వ హయాంలో కూడా అవి కొనసాగుతున్నాయని నివేదికలో పేర్కొంది. అందుకే 2015-20 మధ్య కాలంలో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర గ్రాంట్లలో కోత పడిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.

రాజధాని కోసం భూసేకరణపై గత ప్రభుత్వ తీరును కాగ్ ఎండగట్టింది. భూసేకరణ విషయంలో నిపుణుల కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొలేదని తేల్చింది. రాజధానికి అవసరమైన మొత్తం భూమిలో 70 శాతం భూ సమీకరణ ద్వారా సేకరించాలనే నిర్ణయం వల్ల భారీ ఆర్థిక భారం పడిందని తెలిపింది. అదే సమయంలో అమరావతి ప్రాంతంలో పనుల నిలుపుదల వల్ల నిధులు నిరుపయోగంగా మారాయని ప్రస్తుత ప్రభుత్వ తీరును తప్పు బట్టింది కాగ్. 2019 మే నుంచి వివిధ పనులను నిలిపి వేశారని, దీని వల్ల ఈ పనుల కోసం అప్పటికే ఖర్చు చేసిన రూ.1505 కోట్లు నిరుపయోగం అయ్యాయని తెలిపింది.

ప్రజా వేదిక..

జలవనరుల శాఖ పరిధిలో ప్రజా వేదికను నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా కట్టారని కాగ్ గత ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. ఆ తర్వాత దాన్ని కూల్చివేయటం వల్ల రూ.11.51 కోట్ల ప్రజాధనం వృథా అయిందని పేర్కొంది. రాజధాని భూ సమీకరణ కోసం సీఆర్డీఏ రూ.2,244 కోట్లు ఖర్చు చేసిందని, సేకరించిన ఆ భూమి నేడు నిరుపయోగంగా ఉందని తెలిపింది. 2016-22 మధ్య కాలంలో లేబర్ సెస్ కింద రూ.55.39 కోట్ల వసూలు చేశారని.. ఆ సొమ్ముని ఏపీ భవన కార్మికుల సంక్షేమ బోర్డుకు బదిలీ చేయలేదని కాగ్‌ తప్పుబట్టింది.

First Published:  25 Sep 2023 11:22 AM GMT
Next Story