Telugu Global
Andhra Pradesh

జగన్‌కు ప్రశ్నలు సరే.. నువ్వేం చెప్తావ్‌, చంద్రబాబూ..

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆయన ఆపగలరా? ఈ విషయంలోనైనా చంద్రబాబు బీజేపీ నుంచి హామీ పొందారా? బీజేపీతో కుమ్మక్కు కావడం వల్లనే వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదని ఆయన గతంలో విమర్శలు చేశారు.

జగన్‌కు ప్రశ్నలు సరే.. నువ్వేం చెప్తావ్‌, చంద్రబాబూ..
X

రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పుతున్నారు. ఆ ప్రయోజనాలు ఇవి అని ఆయన నిర్దిష్టంగా చెప్పడం లేదు. తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పలు చిక్కులను ఎదుర్కుంటోంది. అందులో ప్రత్యేక హోదా రాకపోవడం ఒకటి. ప్రత్యేక హోదాకు చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలోనే చెల్లు చీటీ పాడారు. ఎన్డీఏతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ప్రత్యేక హోదా డిమాండ్‌ను అందుకుని ప్రధాని నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా కూడా దూషించారు.

ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మీదికి నెడుతున్నారు. ప్రత్యేక హోదాపై ఏం చెప్తావని జగన్‌ను ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా, కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని బాబు స్పష్టంగా చెప్పగలరా..? ప్రత్యేక హోదా ఇస్తామంటేనే ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా..? బీజేపీ నుంచి రాష్ట్రానికి సంబంధించి ఒక్క హామీని కూడా చంద్రబాబు పొందలేదు.

ఆ విషయాన్ని పక్కన పెడదాం. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆయన ఆపగలరా? ఈ విషయంలోనైనా చంద్రబాబు బీజేపీ నుంచి హామీ పొందారా? బీజేపీతో కుమ్మక్కు కావడం వల్లనే వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదని ఆయన గతంలో విమర్శలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఆపాలని కోరుతూ వైఎస్‌ జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఆపుతామని ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ నాయకులు హామీ ఇస్తున్నారు. కనీసం అటువంటి హామీనైనా ఇచ్చే పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా? బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అందుకు ప్రయత్నాలు చేస్తారా? అంటే, బీజేపీ నుంచి ఆయన ఏదీ కోరే పరిస్థితిలో లేరు. ఒక రకంగా నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నారు.

విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కూడా జగన్‌నే తప్పు పట్టారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వం తలొగ్గే విధంగా చేయగలిగారా? ఎంతసేపూ జగన్‌ మీద పడి ఏడ్వడమే తప్ప రాష్ట్రానికి ఆయన చేసే మేలు ఏమిటో ఏనాడూ చెప్పలేకపోయారు. ఎందుకో, కారణమేమిటో తెలియదు గానీ ఆయన జగన్‌పై వ్యక్తిగతమైన కక్ష పెంచుకున్నారు.

రాష్ట్ర సమస్యలకు సంబంధించిన ఏ ఒక్క అంశం మీద కూడా స్పష్టత ఇవ్వలేని దౌర్భాగ్యమైన స్థితిలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. వారు రాష్ట్రానికి మేలు చేస్తామంటే ఎలా నమ్మడమనేది ప్రశ్న. జగన్‌ తాను ఏది చేయగలనో, ఏది చేయలేనో స్పష్టంగా చెప్పుతున్నారు. ఆ ధైర్యం కూడా వారికి లేదు. చంద్రబాబుకు కావాల్సింది అధికారం, పవన్‌ కల్యాణ్‌కు కావాల్సింది చంద్రబాబును అధికారంలోకి తేవడం. అంతకు మించిన రాష్ట్ర ప్రయోజనాలు వారికి ఏమీ లేవు.

First Published:  28 March 2024 11:37 AM GMT
Next Story