Telugu Global
Andhra Pradesh

కాపులను ముంచావ్‌.. బీసీలనూ ముంచుతావా.. చంద్రబాబూ?

బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమనే అంశం తన చేతుల్లో ఉండనేది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఇది రాష్ట్ర పరిధిలో ఉండేది కూడా కాదు.

కాపులను ముంచావ్‌.. బీసీలనూ ముంచుతావా.. చంద్రబాబూ?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం బీసీ డిక్లరేషన్‌ను విడుదల చేశారు. ఈ డిక్లరేషన్‌లో అత్యంత ప్రధానమైన అంశం చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనేది. తద్వారా సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా చంద్రబాబు హామీలు ఇస్తారని మరోసారి రుజువైంది. గతంలో ఆయన కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దానికి అతీగతీ లేదు. ఇప్పుడు బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేశారు.

బీసీలకు రిజర్వేషన్లు కల్పించడమనే అంశం తన చేతుల్లో ఉండనేది చంద్రబాబుకు తెలియని విషయం కాదు. ఇది రాష్ట్ర పరిధిలో ఉండేది కూడా కాదు. శాసనసభలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటే సరిపోతుందని బహుశా, చంద్రబాబు భావించి ఉండవచ్చు. కేంద్రం అంగీకరిస్తే తప్ప బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదు. బీసీలను మభ్యపెట్టడానికి చంద్రబాబు ఆ హామీ ఇచ్చారు, అంతకు మించి దానికి ప్రాధాన్యం లేదు.

విద్య, ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గతంలో చంద్రబాబు ప్రభుత్వం బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించింది. కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించుతున్నాయి. అందువల్ల కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం రాజ్యాంగంలో చేర్చాల్సి ఉంటుంది. అందుకు కేంద్రం ముందుకు రాలేదు.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనకబడినవారికి కల్పించిన రిజర్వేషన్లలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవి ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి కల్పించిన రిజర్వేషన్లే తప్ప కుల ప్రాతిపదికపై కాదు. దాంతో ఇది కూడా అమలు కాలేదు. ఇప్పుడు బీసీలకు చట్టసభల్లో చంద్రబాబు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడమనేది సాధ్యమయ్యే విషయం కాదు.

ఒకవేళ తాను అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతామని, అందుకు ముందుకు రాకపోతే ఏ విధంగానూ కేంద్రానికి సహకరించబోమని స్పష్టంగా చంద్రబాబు ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇంత మాత్రం చేసినా చంద్రబాబుకు కొద్దో గొప్పో చిత్తశుద్ధి ఉందని అంగీకరించవచ్చు. కానీ, ఆయన మోసం చేయడాన్ని ఓ అస్త్రంగా ఎంచుకున్నారు కాబట్టి అందుకు సిద్ధపడరని అనుకోవాల్సి ఉంటుంది.

First Published:  6 March 2024 9:07 AM GMT
Next Story