Telugu Global
Andhra Pradesh

ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ ప్రాజెక్ట్ ద్వారా 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు జగన్.

ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్.. జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్ట్ టన్నెళ్లను జాతికి అంకితం చేసిన సందర్భంగా సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకి అప్పట్లో వైఎస్ఆర్ శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టారని, ఈరోజు ఆయన కొడుకుగా రెండు టన్నెళ్లను తాను పూర్తి చేశానని చెప్పారు జగన్. తండ్రి ప్రారంభించిన ప్రాజెక్ట్ ని కొడుకు జాతికి అంకితం చేయడమనేది నిజంగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని, టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని చెప్పారు జగన్. అద్భుతమైన ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు.



ఈ ప్రాజెక్ట్ ద్వారా 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు జగన్. ఈ ఏడాది జులై-ఆగస్ట్ లోనే శ్రీశైలం నుంచి నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకొచ్చి నింపుతామని చెప్పారు.

3 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో మొదటి టన్నెల్ పూర్తి చేశామని, 8,500 క్యూసెక్కుల కెపాసిటీతో రెండో టన్నెల్ పూర్తయిందని చెప్పారు సీఎం జగన్. శ్రీశైలంలో 840 అడుగులు దాటిన వెంటనే రోజుకో టీఎంసీని ఈ రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తీసుకొస్తామన్నారు. నీళ్లు నింపే సమయానికి మరో 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్అండ్‌ఆర్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తిరిగి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు మూడు నెలల్లోనే ఆ పని పూర్తవుతుందన్నారు జగన్. 2014 నుంచి 2019 వరకు కేవలం 6.6 కి.మీ. మాత్రమే టన్నెళ్ల పని జరిగిందని, వైసీపీ హయాంలో మిగిలిపోయిన 11 కి.మీ. టన్నెళ్ల పని పూర్తి చేశామని వివరించారు.

First Published:  6 March 2024 8:49 AM GMT
Next Story