Telugu Global
Andhra Pradesh

ఘాటు రిప్లై.. వివేకా హత్యపై వైఎస్‌ జగన్‌ చర్చకు సిద్ధం

వివేకా చిన్నాన్నను ఎవరు చంపారు, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు, వారి వెనుక ఎవరున్నారో మీ అందరికీ రోజు కనిపిస్తూనే ఉంది.

ఘాటు రిప్లై.. వివేకా హత్యపై వైఎస్‌ జగన్‌ చర్చకు సిద్ధం
X

తన బాబాయ్‌ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న విమర్శలపై తాను చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సంకేతాలు ఇచ్చారు. వైఎస్‌ వివేకా హత్యపై తనపై చేస్తున్న విమర్శలకు ఆయన బుధవారంనాటి సభలో ఘాటు సమాధానం ఇచ్చారు. వివేకా హత్యను వైఎస్‌ జగన్‌కు అంటగడుతూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా, ఆయన ఇద్దరు చెల్లెళ్లు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.

‘‘వివేకా చిన్నాన్నను ఎవరు చంపారు, ఎవరు చంపించారో ఆయనకు, దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు, వారి వెనుక ఎవరున్నారో మీ అందరికీ రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యకరమేమిటో తెలుసా... వివేకా చిన్నాన్నను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపానని అతిహేయంగా, బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో మీరంతా రోజూ చూస్తూనే ఉన్నారు. అతను ఉండాల్సింది జైల్లో. చంపినతనికి మద్దతు ఇస్తూ నేరుగా నెత్తిన పెట్టుకున్నది చంద్రబాబు, ఈ చంద్రబాబుకు మద్దతు ఇస్తున్న ఎల్లో మీడియా, చంద్రబాబు మనుషులు. మద్దతు కోసం తపిస్తూ రాజకీయ స్వార్థంతో తపించిపోతున్న ఇద్దరు నా వాళ్లు’’ అని చాలా స్పష్టంగా చెప్పారు.

‘‘హూ కిల్‌డ్‌ బాబాయ్‌’’ అంటూ గంగవెర్రులెత్తుతున్న చంద్రబాబుకు అది ఘాటు సమాధానమే. వివేకా హత్య చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలోనే జరిగింది. ఆ సమయంలో దర్యాప్తు చేయించి, హంతకుల గుట్టు రాబట్టడానికి చంద్రబాబుకు అవకాశం ఉండింది. కానీ ఆయన కావాలనే నిర్లక్ష్యం వహించారనే సందేహాలు కలుగుతున్నాయి. వివేకాను తానే చంపానని చెప్పిన దస్తగిరి ఇప్పుడు పులివెందులలో పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. వైఎస్‌ జగన్‌ను ఆయన చెల్లెళ్లు షర్మిల, సునీత తప్పు పడుతూ, ప్రశ్నిస్తూ వస్తున్నారు.

వివేకా హత్యను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబు పడరానిపాట్లు పడుతున్నారు. తనపై విమర్శలు చేస్తున్న చెల్లెళ్ల వెనక చంద్రబాబు ఉన్నారనే విషయాన్ని జగన్‌ చెప్పకనే చెప్పారు. ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి ఏ విధమైన ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తూ ఉంటే, ఎల్లో మీడియా ఆ విమర్శలకు పెద్ద పీట వేస్తోంది. దీన్ని గట్టిగా తిప్పికొట్టడానికి వైఎస్‌ జగన్‌ సిద్ధపడినట్లు ఆయన వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు.

First Published:  28 March 2024 7:48 AM GMT
Next Story