Telugu Global
Andhra Pradesh

అనవసరంగా కెలుక్కున్నారా..?

ముద్రగడ స్థాయికి తగ్గట్లుగా తమ అధినేత పవన్ కిర్లంపూడికి వచ్చి ఉద్యమనేతను పార్టీలోకి ఆహ్వానిస్తారని బొలిశెట్టి మీడియాతో చెప్పారు. ఇదిచెప్పి నెలలు గ‌డుస్తున్నా.. ఇంతవరకు ముద్రగడ ఇంటికి పవన్ వెళ్ళలేదు

అనవసరంగా కెలుక్కున్నారా..?
X

దారినప‌డేసే చెత్త‌ను నెత్తిన వేసుకోవటం అంటే ఏమిటో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూస్తే తెలుస్తుంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో పవన్ తనంతట తానుగా చెత్తను నెత్తినేసుకోవటం ఎక్కువైపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం గురించి తెలియని వాళ్ళుండరు. దాదాపు పదేళ్ళుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి ఉద్యమనేత ఇంటికి నేతలను పంపించి మరీ కెలుక్కున్నది పవనే. జనసేనలో ముద్రగడను చేరాలని తన తరపున సీనియర్ నేత బొలిశెట్టి శ్రీనివాస్ ను పంపారు. పవన్ ఆదేశాలు లేకుండా తనంతట తానుగా బొలిశెట్టి ఉద్యమనేత ఇంటికి వెళ్ళే అవకాశమే లేదు.

ముద్రగడ-బొలిశెట్టి మధ్య ఏమిచర్చలు జరిగాయో, పార్టీ తరపున ఆయన ఏమి హామీ ఇచ్చారో ఎవరికీ తెలీదు. మొత్తానికి ముద్రగడ అయితే జనసేనలో చేరటానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన కొడుకు ముద్రగడ గిరి మీడియాతో చెప్పారు. తన తండ్రితో పాటు తాను కూడా రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేయబోతున్నట్లు ప్రకటించారు. ముద్రగడ కాకినాడ ఎంపీగా, గిరి పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీచేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోయింది.

ముద్రగడ స్థాయికి తగ్గట్లుగా తమ అధినేత పవన్ కిర్లంపూడికి వచ్చి ఉద్యమనేతను పార్టీలోకి ఆహ్వానిస్తారని బొలిశెట్టి మీడియాతో చెప్పారు. ఇదిచెప్పి నెలలు గ‌డుస్తున్నా.. ఇంతవరకు ముద్రగడ ఇంటికి పవన్ వెళ్ళలేదు సరికదా, ఇప్పుడు ఉద్యమనేత పార్టీలో చేరటంలేదన్నది ఫిక్సయిపోయింది. కారణం ఏమిటంటే.. చంద్రబాబునాయుడు అడ్డుకున్న కారణంగానే ముద్రగడను పార్టీలో చేర్చుకోకూడదని పవన్ డిసైడ్ అయినట్లు బాగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడేమైందంటే.. ముద్రగడ పూర్తిగా పవన్ కు వ్యతిరేకమైపోయారు. ఇంతకుముందు ముద్రగడ ఎప్పుడూ పవన్ గురించి మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు పవన్ పై ముద్రగడ ఆరోపణలతో రెచ్చిపోతున్నారు. ముద్రగడ వల్ల జనసేనకు లాభం ఎంతుంటుందో తెలీదు కానీ, నష్టంమాత్రం క‌చ్చితంగా ఉంటుంది. ముద్రగడను పవన్ కోరి అవమానించాడని కాపుల్లో బాగా ప్రచారమవుతోంది. ఉద్యమనేతను పవన్ అవమానించటంపై సొంత సామాజికవర్గంలో వ్యతిరేకత పెరిగిపోతోంది. దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో జనసేనపైన కచ్చితంగా ఉంటుందని కాపు ప్రముఖులు బహిరంగంగానే పవన్ను హెచ్చరిస్తున్నారు. అనవసరంగా ముద్రగడను కెలికి పవన్ చెత్తను నెత్తినేసుకున్నారనే సెటైర్లు బాగా పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఇది ఎక్కడకు దారితీస్తుందో చూడాలి.

First Published:  2 March 2024 5:41 AM GMT
Next Story