Telugu Global
Andhra Pradesh

క‌లిసిరాని క్యాడ‌ర్‌.. కూట‌మిలో కుమ్ములాట‌లు

టీడీపీ, జ‌న‌సేన అధ్య‌క్షులు, కీల‌క నాయ‌కులు గ‌తంలో ఒక‌రి పార్టీని ఉద్దేశించి ఒక‌రు అనుకున్న మాట‌లు మ‌ర్చిపోయారేమోగానీ క్షేత్ర‌స్థాయిలో క్యాడ‌ర్ మాత్రం ఇంకా గుర్తుపెట్టుకుంది.

క‌లిసిరాని క్యాడ‌ర్‌.. కూట‌మిలో కుమ్ములాట‌లు
X

టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ అభ్య‌ర్థులు ఖ‌రార‌యినా, ప్ర‌చారం మాత్రం నేత‌లు ఆశించిన స్థాయిలో ముందుకెళ్ల‌డం లేదు. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, పురందేశ్వ‌రి క‌లిసి ప్ర‌చారం చేసినా క్షేత్రస్థాయిలో మూడు పార్టీల క్యాడ‌ర్ క‌లిసిరావ‌డం లేదు. టీడీపీ అభ్య‌ర్థి ఉన్న చోట జ‌న‌సేన, జ‌న‌సేన క్యాండిడేట్ ఉన్న స్థానంలో టీడీపీ క్యాడ‌ర్ ప్ర‌చారంలో పాల్గొన‌డం మొక్కుబ‌డిగా సాగుతోంది. తెనాలిలో సీటు ఆశించి భంగ‌ప‌డిన టీడీపీ మాజీ మంత్రి ఆల‌పాటి రాజా మొన్న నియోజ‌క‌వ‌ర్గంలో నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు మ‌ద్దతుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిర్వ‌హించిన‌ రోడ్‌షోకు రాలేదు. నిన్న హిందూపురంలో టీడీపీ అభ్య‌ర్థి బాల‌కృష్ణ ప్ర‌చారానికి వెళితే అక్క‌డ జ‌న‌సేన‌, బీజేపీ శ్రేణులెవ‌రూ క‌లిసిరాలేదు.

క్యాడ‌ర్ రావ‌ట్లే

ద్వితీయ శ్రేణి నాయ‌కుల వ‌ర‌కు క‌లిసి ప్ర‌చారం చేస్తున్నా నిజ‌మైన కార్య‌క‌ర్త‌ల్లో అత్య‌ధిక శాతం కూట‌మి అభ్య‌ర్థుల ప్ర‌చారానికి కలిసిరావ‌డం లేదు. ఏళ్ల త‌ర‌బ‌డి త‌మ గుర్తుకు ఓటేయ‌మ‌ని అడిగిన నోటితో ఇప్పుడు కూట‌మిలో వేరే పార్టీ అభ్య‌ర్థికి ఓటేయ‌మ‌ని చెప్ప‌డం త‌మ వ‌ల్ల కావ‌ట్లేద‌ని టీడీపీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. జ‌న‌సేన క్యాడ‌ర్ త‌మ అభ్య‌ర్థికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెబితే ఓట్లు ప‌డిపోతాయంటూ త‌ల‌బిరుసు ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని టీడీపీ శ్రేణుల కంప్ల‌యింట్‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాటలు విని ప్ర‌చారానికి క‌లిసి వెళితే త‌మ‌ను టీడీపీ కార్య‌క‌ర్త‌లు చిన్న‌చూపు చూస్తున్నార‌ని జ‌న‌సేన క్యాడ‌ర్ అంటోంది. త‌ణుకులో టికెట్ వ‌స్తుంద‌ని ఆశ‌పెట్టుకున్న జ‌న‌సేన ఇన్‌చార్జి విడివాడ రామ‌చంద్ర‌రావు వ‌ర్గీయులు, టీడీపీ క్యాడ‌ర్‌తో సాక్షాత్తూ చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల ఉమ్మ‌డి స‌భ‌లోనే కొట్లాట‌కు దిగారు.

పాత మాటలు మ‌ర్చిపోలేక‌పోతున్న క్యాడ‌ర్‌

టీడీపీ, జ‌న‌సేన అధ్య‌క్షులు, కీల‌క నాయ‌కులు గ‌తంలో ఒక‌రి పార్టీని ఉద్దేశించి ఒక‌రు అనుకున్న మాట‌లు మ‌ర్చిపోయారేమోగానీ క్షేత్ర‌స్థాయిలో క్యాడ‌ర్ మాత్రం ఇంకా గుర్తుపెట్టుకుంది. జెండా కూలీలని త‌మ‌ను ఎద్దేవా చేసిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి అడుగు వేయ‌లేమ‌ని చాలాచోట్ల జ‌న‌సేన శ్రేణులు అంటున్నాయి. ఓట్లు చీలిపోకూడ‌ద‌ని చంద్ర‌బాబు పొత్తు పెట్టుకున్నారు గానీ బాల‌కృష్ణ అన్న‌ట్లు ఈ అల‌గా జ‌నంతో త‌మ‌కేంట‌ని టీడీపీలోని పెత్తందారు కులం నేతలు వ్యాఖ్యానిస్తున్న‌ట్లు జ‌న‌సేన అభ్య‌ర్థులున్న చోట్ల ఆ పార్టీ నుంచి వ‌స్తున్న ఫిర్యాదు.

బీజేపీ పరిస్థితి మ‌రీ ఘోరం

ఇక కూట‌మిలో జూనియ‌ర్ పార్ట‌న‌ర్ అయిన బీజేపీ ప‌రిస్థితి మ‌రీ ఘోరం. టీడీపీ, జ‌న‌సేన నుంచి నాయ‌కులొస్తున్నారు గానీ కార్య‌క‌ర్త‌లు క‌న‌ప‌డ‌టం లేదు. టీడీపీకి, జ‌న‌సేన‌కు అయితే సొంత క్యాడ‌ర్ వ‌చ్చినా కాస్త జ‌నం క‌న‌ప‌డ‌తారు. ఏపీలో బీజేపీకి ఏ ఊళ్లోనూ ప‌ట్టుమ‌ని ప‌ది మంది కార్య‌క‌ర్త‌లు క‌న‌ప‌డ‌రు. అలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీ, జ‌న‌సేన క్యాడ‌ర్ ప్ర‌చారానికి రాక‌పోతే త‌మ ప‌రిస్థితి ఏంట‌ని బీజేపీ అభ్య‌ర్థులు గొల్లుమంటున్నారు. మ‌రోవైపు టీడీపీ అభ్య‌ర్థులున్న‌చోట చంద్ర‌బాబు స‌భ‌లకుగానీ, ప్ర‌చారానికి గానీ త‌మ‌ను పిల‌వ‌డం లేద‌ని, గౌర‌వం లేనిచోట‌కు ఎలా వెళ్లాల‌ని బీజేపీ కార్య‌క‌ర్త‌లు ఆవేద‌న‌గా చెబుతున్నారు. క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు, అనంత‌పురం జిల్లా రాప్తాడు చంద్ర‌బాబు స‌భ‌ల‌కు బీజేపీ వారెవ్వ‌రికీ ఆహ్వానం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

First Published:  16 April 2024 7:56 AM GMT
Next Story