Telugu Global
Andhra Pradesh

నారా భువనేశ్వరికి సెగ.. టీడీపీని భూస్థాపితం చేస్తారా..?

ఆనం రామనారాయణ రెడ్డిని అధిష్టానం ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించిందా, మీకేమైనా అటువంటి సమాచారం ఉందా, ఎందుకు ఆయన ఫోటోను ఫ్లెక్సీల్లో పెట్టారు..? అని ఆయన స్థానిక నాయకులను నిలదీశారు.

నారా భువనేశ్వరికి సెగ.. టీడీపీని భూస్థాపితం చేస్తారా..?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనపై పార్టీ మాజీ ఎమ్యెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు వ్యక్తులు నాలుగు నెలలుగా టీడీపీని పాడెపై పండబెట్టి మోస్తున్నారని ఆయన వ్యాఖ్యానిస్తూ.. 40 ఏళ్ల టీడీపీ భూస్థాపితం చేస్తారా అని ప్రశ్నించారు. నారా భువనేశ్వరి శుక్రవారం నాడు ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని 22వ వార్డు అల్లీపురంలో `నిజం గెలవాలి` కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే, ప్రకటించిన షెడ్యూల్‌ కన్నా ముందే భువనేశ్వరి అక్కడికి చేరుకుని ఇటీవల మరణించిన టీడీపీ కార్యకర్త కముజుల ఆంజనేయరెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ కార్యక్రమం కోసం టీడీపీ కార్యకర్తలు దారి వెంట ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో కేవలం ఆనం రామనారాయణరెడ్డి ఫొటోలు, స్థానిక టీడీపీ నాయకుల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. దానిపై కొమ్మి లక్ష్మయ్యనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. మరో మాజీ ఎమ్యెల్యే బొల్లినేని కృష్ణయ్య, పార్టీ అధికార ప్రతినిధి గూటూరు మురళీ కన్నబాబు ఫొటోలు, పేర్లు లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు .

ఆనం రామనారాయణ రెడ్డిని అధిష్టానం ఆత్మకూరు అభ్యర్థిగా ప్రకటించిందా, మీకేమైనా అటువంటి సమాచారం ఉందా, ఎందుకు ఆయన ఫోటోను ఫ్లెక్సీల్లో పెట్టారు..? అని ఆయన స్థానిక నాయకులను నిలదీశారు. దాంతో స్థానిక నాయకులు మౌనంగా అక్కడి నుంచి తప్పుకున్నారు.

ఆ తర్వాత భువనేశ్వరి వెళ్లిన ఇంట్లోకి కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మరో నేత చంద్రారెడ్డి వెళ్లబోతుండగా యువగళం పాదయాత్ర జట్టు అడ్డుకుంది. దీంతో కొమ్మి లక్ష్యయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... తాను మాజీ ఎమ్యెల్యేనని, తనను అడ్డుకోవాలని ఎవరు చెప్పారని నిలదీశారు. దాంతో ఆయనను లోనికి అనుమతించారు. ఆ తర్వాత చంద్రారెడ్డికి కూడా ఇదే అనుభవం ఎదురైంది.

First Published:  3 Feb 2024 6:34 AM GMT
Next Story