Telugu Global
Andhra Pradesh

ట్వీట్లు కాదు తొడగొట్టు చిన్నా.. ఎన్టీఆర్ పై అనిల్ సెటైర్..

తెలుగుదేశం పార్టీ నారావారి పార్టీగా మారిపోయిందని, ముందు దాన్ని నందమూరి వారి దగ్గరకు తెచ్చుకోవాలన్నారు అనిల్. అలాంటి విషయాల్లో తొడగొట్టాలని, చప్పుడు లేకుండా ఈ ట్వీట్లు ఎందుకంటూ వెటకారం చేశారు.

ట్వీట్లు కాదు తొడగొట్టు చిన్నా.. ఎన్టీఆర్ పై అనిల్ సెటైర్..
X

ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారంపై ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది నేరుగా ఆ ట్వీట్ పై స్పందిస్తున్నారు. ఎవరిని పొగిడారు, ఎవరిని తిట్టారు అనేది స్పష్టంగా తెలియకుండా జాగ్రత్తగా ట్వీట్ వేశారు ఎన్టీఆర్. కానీ పేరు మార్పుపై స్పందించారు కాబట్టి వైసీపీనుంచి కౌంటర్లు పడుతున్నాయి. మనవళ్లకు ట్వీట్ల పాట్లు ఎందుకంటూ ఎన్టీఆర్ పేరెత్తకుండా చురకలంటించారు మాజీ మంత్రి అనిల్. ఎన్టీఆర్ పార్టీని చంద్రబాబు లాగేసుకున్నప్పుడు, ఆయనపై చెప్పులేయించినప్పుడు ఈ పౌరుషం ఎక్కడికి పోయిందన్నారు. పోనీ అప్పుడు మనవళ్లు నిక్కర్లు వేసుకున్న చిన్నపిల్లలే అయినా, ఇప్పుడు పెద్దోళ్లయ్యారు కదా, సినిమాల్లో కూడా హీరో పెద్దోడయ్యాక పగ తీర్చుకునే సన్నివేశాలు ఉంటాయి కదా, ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఎన్టీఆర్ మనవళ్లు చంద్రబాబుపై పగతీర్చుకోవాలని అనిల్ అన్నారు. పార్టీని చంద్రబాబు దగ్గరనుంచి లాగేసుకోవాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ నారావారి పార్టీగా మారిపోయిందని, ముందు దాన్ని నందమూరి వారి దగ్గరకు తెచ్చుకోవాలన్నారు. అలాంటి విషయాల్లో తొడగొట్టాలని, చప్పుడు లేకుండా ఈ ట్వీట్లు ఎందుకంటూ వెటకారం చేశారు.

అభినందించడానికి నోరు రాదా..?

ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టినప్పుడు వీరంతా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్. అప్పట్లో సీఎం జగన్ ని నందమూరి కుటుంబం నుంచి ఒక్కరైనా పొగిడారా అని అన్నారు. అప్పుడు పొగడటానికి రాని నోళ్లు, ఇప్పుడెందుకు లేస్తున్నాయని అడిగారు అనిల్. ఎన్టీఆర్ పై చంద్రబాబుకంటే వైసీపీకే ఎక్కువ అభిమానం ఉందని, అందుకే ఆయన పేరుని జిల్లాకు పెట్టామని గుర్తుచేశారు. ఆయన్ను ఎక్కడా అగౌరవపరిచి మాట్లాడింది లేదన్నారు. ఆయనపై చెప్పులేయించి, ఆయన పార్టీనే లాగేసుకుని, ఆయన మరణానికి కారణం అయిన చంద్రబాబుకి, ఆయన పేరెత్తే అర్హత లేదన్నారు.

ఆరోగ్యశ్రీ పేరెందుకు మార్చారు..?

ఆరోగ్యశ్రీ రూపకర్త వైెఎస్ఆర్ అని, అలాంటి పథకానికి కూడా ఆయన పేరుని తీసేసి ఎన్టీఆర్ పేరు తగిలించారని చెప్పారు. అప్పుడు లేని న్యాయం ఇప్పుడెందుకని అన్నారు అనిల్. అప్పట్లో ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చి, ఇప్పుడు వైసీపీని ప్రశ్నిస్తే ఏం ఉపయోగం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకి ఎన్టీఆర్ గుర్తు రారని, అప్పట్లో చంద్రన్న బీమా, చంద్రన్న తోఫా అంటూ పథకాలకు పేర్లు పెట్టారని, వాటికి ఎన్టీఆర్ పేరు పెట్టొచ్చుకదా అని ప్రశ్నించారు. మొత్తమ్మీద ఎన్టీఆర్ ట్వీట్ పై వైసీపీ నుంచి పెద్దగా స్పందన రాకపోయినా.. అనిల్ వంటివారు మాత్రం కాస్త ఘాటుగానే బదులిస్తున్నారు.

First Published:  23 Sep 2022 2:14 AM GMT
Next Story