Telugu Global
Andhra Pradesh

టీడీపీలో పీకే చేస్తున్నదిదేనా..?

లోకేష్‌కు హైప్ ఇచ్చే బాధ్యతలను కూడా పీకే మీద చంద్రబాబు మోపారని పార్టీవర్గాల సమాచారం. 92 రోజులు పాదయాత్ర చేసినా, బహిరంగ సభల్లో మాట్లాడినా లోకేష్ కు అనుకున్నంత లిఫ్ట్ రాలేదన్నది వాస్తవం.

టీడీపీలో పీకే చేస్తున్నదిదేనా..?
X

చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ భేటీ అవ్వటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎందుకంటే.. ఒకప్పుడు బందిపోటు, సైబర్ క్రిమినల్, అరాచకవాది అని దుమ్మెత్తిపోసిన ప్రశాంత్ కిషోర్ (పీకే)తోనే చంద్రబాబు భేటీ అవ్వటమే దీనికి కారణం. ఎన్నికలు మరో మూడునెలల్లో ఉండగా చంద్రబాబు+పీకే ఎందుకు భేటీ అయినట్లు..? ఇప్పటికిప్పుడు టీడీపీతో కలిసి పనిచేయటానికి పీకే అంగీకరించినా చేయగలిగేది ఏముంటుంది..? అన్నదే ఎవరికీ అర్థంకాలేదు.

సర్వే తదితరాలకు దూరంగా బిహార్ రాజకీయాల్లో బిజీగా ఉన్న పీకేని బతిమలాడుకుని, లోకేష్‌ను పంపించి చంద్రబాబు మరీ విజయవాడకు ర‌ప్పించుకున్నారు. పైగా చాలాకాలంగా టీడీపీకి వ్యూహకర్తగా రాబిన్ శర్మ పనిచేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు వ్యూహకర్తగా శర్మ పనిచేస్తుండగానే మరోవైపు పీకేని చంద్రబాబు పిలిపించుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడే పీకే టీడీపీకి అందించబోయే సేవలు ఏమిటి అనే విషయమై అయోమయం పెరిగిపోతోంది.

అయితే పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే.. గడచిన మూడున్నరేళ్ళుగా పనిచేస్తున్న రాబిన్ వర్మ వ్యవహారాలను పీకే క్రాస్ చేస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, సామాజికవర్గాల బలం తదితరాలపై నియోజకవర్గాలపై ఇప్పటికే శర్మ తన నివేదికను చంద్రబాబుకు ఇచ్చారట. ఆ నివేదికను చంద్రబాబు కొత్తవ్యూహకర్త పీకేకు అందించారని సమాచారం. అంటే నియోజకవర్గాల వారీగా శర్మ తయారుచేసిన రిపోర్టును పీకే క్రాస్ చెక్ చేస్తున్నారట. తన టీమ్‌తో క్రాస్ చెక్ చేస్తున్న పీకే అవసరమైన చోట్ల మార్పులను చంద్రబాబుకు సూచిస్తున్నారట.

ఇదే సమయంలో లోకేష్‌కు హైప్ ఇచ్చే బాధ్యతలను కూడా పీకే మీద చంద్రబాబు మోపారని పార్టీవర్గాల సమాచారం. 92 రోజులు పాదయాత్ర చేసినా, బహిరంగ సభల్లో మాట్లాడినా లోకేష్ కు అనుకున్నంత లిఫ్ట్ రాలేదన్నది వాస్తవం. అందుకనే లోకేష్‌కు అవసరమైన హైప్ ఇచ్చి జనాల దృష్టిలో జగన్ కు దీటైన యువనేతగా ప్రాధాన్యత పెరిగేట్లుగా ప్రొజెక్టు చేయమని పీకేని చంద్రబాబు కోరినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపోటములతో తనకు ఎలాంటి సంబంధంలేదని పీకే ముందే చంద్రబాబుతో చెప్పేశారట. అందుకనే ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో రెడీ అయిన అభ్యర్థుల జాబితాను పీకే బృందం క్రాస్ చెక్ చేయటానికి మాత్రమే పరిమితమైనట్లు సమాచారం.

First Published:  10 Jan 2024 5:11 AM GMT
Next Story