Telugu Global
Andhra Pradesh

కడప కోర్టులో షర్మిలకు ఎదురు దెబ్బ..

ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు షర్మిల దగ్గర సబ్జెక్ట్ లేదు. ఆమె కేవలం వివేకా హత్యకేసునే ఆయుధంగా చేసుకున్నారు.

కడప కోర్టులో షర్మిలకు ఎదురు దెబ్బ..
X

వైఎస్ వివేకా హత్యకేసుని తన రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవాలనుకున్నారు షర్మిల. ఆమెకు జత కలసిన సునీత కూడా తప్పుడు ఆరోపణలతో ప్రెస్ మీట్లు పెట్టి హల్ చల్ చేశారు. చివరకు కడప కోర్టు వారి నోటికి తాళం వేసింది. అయినా కూడా వారు నెమ్మదించలేదు. కడప కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ హైకోర్టుకెక్కారు. వైఎస్ వివేకా హత్యకేసు గురించి ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించకూడదని కడప కోర్టు జారీ చేసిన ఆర్డర్ ని డిస్మిస్ చేయాలంటూ వారిద్దరూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వ్యవహారంలో ఇప్పుడు వారిద్దరికీ ఎదురుదెబ్బ తగిలింది.

కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ షర్మిల, సునీత వేసిన పిటిషన్‌ను ఏపీ కోర్టు కొట్టివేసింది. ఈ వ్యవహారాన్ని కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ వారిద్దరికీ రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది.

ఏపీలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు షర్మిల దగ్గర సబ్జెక్ట్ లేదు. ఏపీని విభజించిన పాపం కాంగ్రెస్ ని ఇంకా వెంటాడుతూనే ఉన్న వేళ, ఆమె కేవలం వివేకా హత్యకేసునే ఆయుధంగా చేసుకున్నారు. కడపలో అవినాష్ రెడ్డిపై పోటీ చేస్తూ ఆయనపై హంతకుడనే ముద్ర వేయాలని చూశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న షర్మిల, సునీతకు కోర్టులు చీవాట్లు పెట్టినా ఫలితం లేదు. పదే పదే అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. తాజాగా కోర్టు జరిమానాతో అయినా వారిలో మార్పు వస్తుందేమో చూడాలి.

First Published:  8 May 2024 2:40 PM GMT
Next Story