Telugu Global
Andhra Pradesh

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. కడప పోలీసుల సీరియస్ వార్నింగ్

దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కంటైనర్లకు ఎస్కార్ట్ గా వెళ్లారు.

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం.. కడప పోలీసుల సీరియస్ వార్నింగ్
X

కంటైనర్లలో వేలకోట్లు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు కడప పోలీసులు. అవాస్తవాలు ప్రచారం చేస్తే తిప్పలు తప్పవని హెచ్చరించారు. కడప నుంచి వేలకోట్లు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అంతా అవాస్తవం అని అన్నారు. ఈమేరకు కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ కంటైనర్ల వార్తలపై వివరణ ఇచ్చారు.

అసలేం జరిగింది..?

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడిన నేపథ్యంలో కడప నుంచి వేల కోట్లు కంటైనర్ల ద్వారా తరలిస్తున్నారంటూ కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. కంటైనర్లకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు ఉన్న ఫొటోలను అప్ లోడ్ చేసి తప్పుడు కథనాలు అల్లారు. ఆ వార్తలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. తప్పుడు వార్తల వ్యవహారం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో వారు వివరణ ఇచ్చారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన వారికి వార్నింగ్ ఇచ్చారు.

వాస్తవం ఇదీ..

దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కంటైనర్లకు ఎస్కార్ట్ గా వెళ్లారు. సామాగ్రి వెళ్తున్న రూట్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని రక్షణ శాఖ.. రాష్ట్ర పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేసింది. అటు ఆర్మీ అధికారులు కూడా ఆ కంటైనర్లకు ఎస్కార్ట్ గా ఉన్నారు. ఇటు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే కొందరు ఈ ఎస్కార్ట్ వాహనాల గురించి అభూతకల్పనలు ప్రచారం చేశారు. ఆ కంటైనర్లలో డబ్బు ఉందని, అందుకే అంతమంది పోలీసులు సెక్యూరిటీగా ఉన్నారని వార్తలు రాశారు. ఈ వార్తల్ని జిల్లా పోలీసులు ఖండించారు.

First Published:  2 Feb 2024 4:55 PM GMT
Next Story