Telugu Global
Andhra Pradesh

పురందేశ్వ‌రి టీడీపీ అధ్య‌క్షురాలా? - మంత్రి రోజా సెటైర్‌

అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువ అని కేంద్ర‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్ల‌మెంటులోనే క్లియ‌ర్‌గా చెప్పార‌ని, పురందేశ్వ‌రి మాత్రం ఏపీ అప్పుల్లో ఉందని అనడం హాస్యాస్పదమ‌ని మంత్రి రోజా అన్నారు.

పురందేశ్వ‌రి టీడీపీ అధ్య‌క్షురాలా? - మంత్రి రోజా సెటైర్‌
X

పురందేశ్వ‌రి బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలా.. లేక టీడీపీ అధ్య‌క్షురాలా..? అనే సందేహం వ‌స్తోంద‌ని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. శ‌నివారం రోజా తిరుప‌తిలో విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. పురందేశ్వ‌రి తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన‌ట్టే పురందేశ్వరి కూడా మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు.

బాబును సీఎం చేయ‌డం కోస‌మే ప‌నిచేస్తున్న‌ట్టున్నారు..

అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు తక్కువ అని కేంద్ర‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్ల‌మెంటులోనే క్లియ‌ర్‌గా చెప్పార‌ని, పురందేశ్వ‌రి మాత్రం ఏపీ అప్పుల్లో ఉందని అనడం హాస్యాస్పదమ‌ని మంత్రి రోజా అన్నారు. టీడీపీ హయాంలోనే తలకుమించిన అప్పులు చేశారని ఈ సంద‌ర్భంగా గుర్తుచేశారు. పురందేశ్వ‌రి తీరు చూస్తుంటే చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిగా చేయ‌డం కోసం ప‌నిచేస్తున్న‌ట్టుంద‌ని విమ‌ర్శించారు.

14 ఏళ్లు సీఎంగా ఉండి గాడిద‌లు కాశారా?

ఓ మ్యాప్ తీసుకుని చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో గాడిదలు కాశారా..? అని మంత్రి రోజా ప్ర‌శ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం, అభివృద్ధి గుర్తుకు రాదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు అభివృద్ధి గుర్తుకువస్తుంద‌న్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో నదుల అనుసంధానం కన్నా నిధులు అనుసంధానం చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

ప‌వ‌న్‌ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు..

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే రాష్ట్రంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని రోజా అన్నారు. పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించి తొమ్మిదేళ్లయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని, చంద్రబాబును సీఎం చేయడమే పవన్ ధ్యేయమ‌ని రోజా విమ‌ర్శించారు. ప‌వ‌న్ పార్టీ పెట్టిందే ప్యాకేజీల కోస‌మ‌ని, ప్ర‌జ‌ల కోసం కాద‌ని ఆరోపించారు. ఆ విష‌యం ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే అర్థ‌మైంద‌ని, అందుకే ప్ర‌జ‌లు ప‌వ‌న్‌ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మంత్రి రోజా తెలిపారు.

First Published:  29 July 2023 10:11 AM GMT
Next Story