Telugu Global
Andhra Pradesh

రసవత్తరంగా ఏపీ రాజకీయం.. కూటమి సభకు ప్రధాని మోదీ

ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలోకి వచ్చింది కాబట్టి అది మూడు పార్టీల పబ్లిక్ మీటింగ్ గా మారబోతోంది. ఆ సభకు మోదీని ఆహ్వానించారు. ఈనెల 17 లేదా 18న ఈ సభ జరుగుతుందని అంటున్నారు.

రసవత్తరంగా ఏపీ రాజకీయం.. కూటమి సభకు ప్రధాని మోదీ
X

అప్పుడు ఏపీకి మోదీ వస్తుంటే నల్ల బెలూన్లు ఎగరేసి హంగామా చేశారు చంద్రబాబు. ఇప్పుడు బతిమాలి, బామాలి ఆయన్ను కూటమి సభకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బాబు వ్యూహం ఫలిస్తే ఈనెల 17 లేదా 18 తేదీల్లో ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా వస్తారు. ఆయన రాకతో ఏదో జరిగిపోతుందనుకోలేం కానీ.. బీజేపీ కలయికతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు గట్టి ప్రయత్నాలే చేశారని చెప్పాలి. ఆమేరకు ఎన్నికలపై వైసీపీ మరింత ఫోకస్ పెంచాల్సిన అవసరం ఏర్పడింది.

రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి ఎట్టకేలకు పొత్తులకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోగలిగారు చంద్రబాబు, పవన్ కల్యాణ్. బీజేపీ-జనసేనకు కలిపి 30 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలు ఇస్తున్నట్టు చంద్రబాబు ఢిల్లీ నుంచి ప్రకటించారు. అయితే అందులో బీజేపీ-జనసేన సీట్ల వాటా ఎలా ఉంటుందో తేలాల్సి ఉంది. సీట్ల కేటాయింపులు పూర్తయితే అభ్యర్థుల జాబితాలు బయటకొచ్చే అవకాశముంది. ఈలోగా ఏపీకి మోదీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు. ఈనెల 17న చిలకలూరి పేటలో టీడీపీ-జనసేన కలసి బహిరంగ సభ నిర్వహించాలనుకున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలోకి వచ్చింది కాబట్టి అది మూడు పార్టీల పబ్లిక్ మీటింగ్ గా మారబోతోంది. ఆ సభకు మోదీని ఆహ్వానించారు. 17 లేదా 18న ఈ సభ జరుగుతుందని అంటున్నారు.

త్యాగరాజులెవరు..?

గతంలో జనసేనకు 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ సీట్లు అనుకున్నారు. ఇప్పుడు వాటికి అదనంగా మరో 6 అసెంబ్లీ 5 పార్లమెంట్ సీట్లు బీజేపీకి కేటాయించాల్సి వస్తోంది. అంటే ఆ మేరకు టీడీపీలో త్యాగరాజులు రెడీ అవ్వాలన్నమాట. గతంలో లాగా ఓడిపోయే సీట్లిచ్చి సరిపెట్టాలనుకుంటే ఈసారి బీజేపీ, జనసేన ఒప్పుకోకపోవచ్చు. అంటే టీడీపీ నికరంగా గెలిచే స్థానాలు కూడా ఈసారి త్యాగం చేయక తప్పేలా లేదు. దీనిపై ఇప్పటికే చంద్రబాబు పార్టీ శ్రేణులకు హింటిచ్చారు. పొత్తులో భాగంగా ఎవరికైనా సీటు రాకపోతే నిరుత్సాహపడొద్దని, సీనియర్లు బాధ్యత తీసుకుని పొత్తు అవసరాన్ని నేతలకు వివరించాలని సూచించారు.

First Published:  9 March 2024 1:10 PM GMT
Next Story