Telugu Global
Andhra Pradesh

బాబువైపు మందకృష్ణ ఒక్కరే.. మేమంతా జగన్ వైపు

చంద్రబాబు హయాంలో కేవలం పది శాతం మాదిగ కుటుంబాలకు మేలు జరిగితే గొప్పలు చెప్పుకునేవారని, అదే సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో 90 నుంచి 96 శాతం మాదిగ కుటుంబాలు లబ్ధి పొందాయని వివరించారు ఎమ్మార్పీఎస్ నేతలు.

బాబువైపు మందకృష్ణ ఒక్కరే.. మేమంతా జగన్ వైపు
X

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలసి తాను కూటమికి మద్దతిస్తున్నానని చెప్పడం తెలిసిందే. మాదిగలంతా కూటమివైపే ఉన్నారని, జగన్ వారికి ద్రోహం చేశారంటూ ఎల్లో మీడియా రచ్చ చేసింది. మందకృష్ణ కూడా లెక్కలు చెప్పి మరీ చంద్రబాబుకి జై కొట్టారు. కూటమికే తమ జాతి మొత్తం సపోర్ట్ ఇస్తుందని, ఇవ్వాలని పిలుపునిచ్చారు. అక్కడ సీన్ కట్ చేస్తే.. కేవలం మందకృష్ణ ఒక్కరే చంద్రబాబు వైపు ఉన్నారని, తామంతా సీఎం జగన్ తోనే ఉంటామని చెప్పారు 25 మాదిగ సంఘాల నాయకులు. విజయవాడ రౌండ్ టేబుల్ సమావేశంలో వారు ఈమేరకు తీర్మానం చేశారు.

చంద్రబాబు మోసకారి..

మనువాద బీజేపీ, మోసకారి చంద్రబాబు కలసిన కూటమికి తాము ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు మాదిగ సంఘాల నేతలు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తానని హామీ ఇచ్చిన బీజేపీ, పదేళ్లవుతున్నా పట్టించుకోలేదని, వర్గీకరణను అడ్డుపెట్టుకుని చంద్రబాబు మాదిగల ఓట్లతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇకపై మంద కృష్ణ ఆటలు సాగనివ్వబోమని, అతని ఎత్తులను కచ్చితంగా తిప్పి కొడతామని మాదిగ సంఘాల నేతలు హెచ్చరించారు. మాదిగల ద్రోహులు బాబు, మంద కృష్ణకు గుణపాఠం చెబుతామన్నారు.

మేలుచేసింది జగన్ మాత్రమే..

ప్రస్తుత ఎన్నికల్లో మాదిగలకు వైసీపీ 10 సీట్లు కేటాయించడం సంతోషకరమన్నారు ఆయా సంఘాల నేతలు. చంద్రబాబు హయాంలో కేవలం పది శాతం మాదిగ కుటుంబాలకు మేలు జరిగితే గొప్పలు చెప్పుకునేవారని, అదే సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో 90 నుంచి 96 శాతం మాదిగ కుటుంబాలు లబ్ధి పొందాయని వివరించారు. ఊరి చివర ఉండే వెలివాడల్లోని తమ ఇళ్ల వద్దకే వచ్చి సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఎస్సీ శ్మశాన వాటికల సమస్యను అర్థం చేసుకుని ప్రతి ఊరిలో ఒక ఎకరం చొప్పున కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. మాదిగలకు నిజమైన మేలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు తామంతా మద్దతు ఇస్తామన్నారు. తమ జాతి మొత్తం జగన్ తోనే ఉంటుందని స్పష్టం చేశారు నేతలు.

First Published:  29 March 2024 1:48 AM GMT
Next Story