Telugu Global
Andhra Pradesh

సాగర్ నీటికి బ్రేక్.. ఈ నెల 6న ఢిల్లీలో కీలక సమావేశం

ప్రస్తుతానికి నాగార్జున సాగర్ డ్యామ్ ను కృష్ణాబోర్డ్ పరిధిలోకి తేవడం, సెక్యూరిటీ విషయాన్ని సీఆర్పీఎఫ్ కి అప్పగించడంతో సమస్య సద్దుమణిగింది అనుకోడానికి లేదు. ఇరు రాష్ట్రాల అధికారుల కీలక సమావేశం ఈ నెల 6కి వాయిదా పడింది.

సాగర్ నీటికి బ్రేక్.. ఈ నెల 6న ఢిల్లీలో కీలక సమావేశం
X

నాగార్జున సాగర్ కుడి కాల్వ నుంచి నీటి విడుదల ఆగిపోయింది. రాత్రి 10.30 గంటలకు ఏపీ అధికారులు గేట్లు మూసివేశారు. సోమవారం వరకు నీటి విడుదల కొంతమేర కొనసాగించాలని అనుకున్నా.. శనివారం రాత్రే గేట్లు మూసివేయడం విశేషం. నీటి విడుదల వెంటనే ఆపివేయాలంటూ కృష్ణా బోర్డ్ ఇదివరకే లేఖ రాసినా.. ఏపీ ప్రభుత్వం రెండురోజులు వేచి చూసింది.

ఈనెల 6న కీలక సమావేశం..

ప్రస్తుతానికి నాగార్జున సాగర్ డ్యామ్ ను కృష్ణాబోర్డ్ పరిధిలోకి తేవడం, సెక్యూరిటీ విషయాన్ని సీఆర్పీఎఫ్ కి అప్పగించడంతో సమస్య సద్దుమణిగింది అనుకోడానికి లేదు. ఇరు రాష్ట్రాల అధికారుల కీలక సమావేశం ఈనెల 6కి వాయిదా పడింది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో సమస్య పరిష్కారానికి తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అప్పటి వరకు ఇరు రాష్ట్రాలు సంయమనం పాటించాలని కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సూచించారు.

పోటాపోటీ కేసులు..

సాగర్ వివాదంపై ఏకంగా అట్రాసిటీ కేసు నమోదు కావడం విశేషం. విజయపురి సౌత్‌ పోలీస్ స్టేషన్లో శనివారం తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులపై రెండు కేసులు నమోదయ్యాయి. విజయపురి సౌత్ ఏఎస్ఐ సోమ్లా నాయక్ ను తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు కులం పేరుతో దూషించారని ఈ కేసు పెట్టారు. జల వివాదంలో ఈ కేసులేంటనే విమర్శలు మొదలయ్యాయి.

ప్రస్తుతం డ్యామ్ ప్రాంతాన్ని సీఆర్పీఎఫ్ బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నా.. ఏపీ పోలీసులు మాత్రం వెనక్కి తగ్గలేదు. వారు కూడా డ్యామ్ పైనే మకాం వేశారు. అటు కృష్ణా బోర్డు ఇంజినీర్ల బృందం సాగర్ వద్ద వాస్తవ పరిస్థితిని అంచనా వేసింది. కేంద్రం ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఇక్కడ బోర్డ్ పరిధిలో కార్యకలాపాలు జరిపేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఇంజినీర్లు అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది.

First Published:  3 Dec 2023 1:16 AM GMT
Next Story