Telugu Global
Andhra Pradesh

ఓటుకు నోటు కేసు.. వాయిదా సంతోషం చంద్రబాబుకి లేనట్టే

సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసిందని, రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదని అన్నారు ఎమ్మెల్యే ఆర్కే.

ఓటుకు నోటు కేసు.. వాయిదా సంతోషం చంద్రబాబుకి లేనట్టే
X

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసారి కూడా కోర్టు అనివార్య పరిస్థితుల్లో ఈ కేసు వాయిదా వేసింది. అయితే ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. మళ్లీ వాయిదా అంటే కుదరదని, ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేసింది. జులై 24న ఈ కేసు విచారణ జరుగుతుందని చెప్పింది.

చార్జిషీట్‌లో చంద్రబాబు పేరును 22 సార్లు ఏసీబీ ప్రస్తావించినా కూడా ఆయన పేరు నిందితుల జాబితాలో లేదని, చంద్రబాబు పేరు కూడా చార్జ్ షీట్ లో చేర్చేలా తెలంగాణ ఏసీబీని ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. పలు వాయిదాల అనంతరం ఈరోజు కోర్టు ముందుకు కేసు వచ్చింది. విచారణ సందర్భంగా ఈ కేసులో తమ వాదనలు వినిపించేందుకు తగిన సమయం కావాలని తెలంగాణ తరపున న్యాయవాది సుప్రీంకోర్టుని కోరారు. సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు. దీంతో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ కేసు విచారణను జులై-24కి వాయిదా వేసింది.

బాబు, రేవంత్ కుమ్మక్కయ్యారు..

చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి మరోసారి కుమ్మక్కయ్యారంటూ మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఒక ఓటుకు ఐదు కోట్ల రూపాయలు బేరం పెట్టుకున్న చంద్రబాబు ఆడియో బయటపడిందని, రేవంత్ రెడ్డి రూ.50 లక్షలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని, అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఈ కేసు ముందుకు సాగకపోవడానికి కారణం వ్యవస్థలను మేనేజ్ చేయడమేనని అన్నారు ఆర్కే. ఏడేళ్ల నుంచి కేసు ముందుకు నడవకుండా రకరకాల కారణాలతో సాగదీస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసిందని, రాబోయే రోజుల్లో చంద్రబాబుకు ఈ కేసులో శిక్ష తప్పదని అన్నారు ఎమ్మెల్యే ఆర్కే.

First Published:  18 April 2024 9:54 AM GMT
Next Story