Telugu Global
Andhra Pradesh

బ్యాంకుల ముందు క్యూ లైన్లు.. బాబు పాపానికి వృద్ధులు బలి

డీబీటీ ద్వారా పెన్షన్లు పొందిన వృద్ధులు గత మూడు రోజులుగా ఆ డబ్బులకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమందికి అకౌంట్ తో ఆధార్ లింక్ కాకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి.

బ్యాంకుల ముందు క్యూ లైన్లు.. బాబు పాపానికి వృద్ధులు బలి
X

చంద్రబాబు పాపం, వృద్ధులకు శాపంలా మారింది. గత నెలలో సచివాలయాల వద్ద పడిగాపులు పడి వడదెబ్బకు కొంతమంది వృద్ధులు చనిపోయారు. ఈసారి వారి పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్టుగా మారింది. సచివాలయానికి వస్తే కనీసం సాయంత్రానికయినా డబ్బులు చేతిలో పడేవి, కానీ బ్యాంకుల వద్ద రోజుల తరబడి వేచి చూస్తున్నా పని కావడంలేదు. పెన్షన్లకోసం వస్తున్న వృద్ధులు చివరకు వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్నారు. క్యూలైన్లలో నిలబడలేక, ఎండలో అవస్థలు పడుతున్నారు.

ఎందుకింత ఆలస్యం..?

డీబీటీ ద్వారా పెన్షన్లు పొందిన వృద్ధులు గత మూడు రోజులుగా ఆ డబ్బులకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమందికి అకౌంట్ తో ఆధార్ లింక్ కాకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. వారిని ఈకేవైసీ చేయించుకోమంటున్నారు బ్యాంకు సిబ్బంది. అది ఆలస్యం కావడంతో డబ్బులు డ్రా చేసుకోవడం ఆలస్యమవుతంది. దీంతో వారు బ్యాంకుల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోంది.


అద్దంకిలో పెన్షన్ కోసం బ్యాంక్‌కి వెళ్లిన చాగంటి సుబ్బాయమ్మ అనే వృద్ధురాలు వడదెబ్బకి గురై మృతి చెందింది. కడప జిల్లా బద్వేల్ లో అమ్మవారిశాలకు చెందిన వల్లంకొండు రామయ్య పెన్షన్ కోసం రెండు రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాడు. అకౌంట్ కి ఆధార్ లింక్ కాకపోవడంతో నగదు డ్రా చేసుకోలేక పోయాడు. మరోవైపు తీవ్రమైన ఎండ తాకిడికి వడదెబ్బ తగిలింది. రాత్రి రామయ్య మృతి చెందాడు.

చంద్రబాబు కారణంగానే వృద్ధులు అవస్థలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ సజావుగా సాగుతుంటే దాన్ని అడ్డుకున్నారని, చివరకు సచివాలయాల్లో కూడా పెన్షన్లు వద్దని చెప్పారని, ఇప్పుడు బ్యాంకుల వద్ద వృద్ధులు అవస్థలు పడుతున్నారని అన్నారు. అయితే ఈ తప్పంతా ప్రభుత్వంపై వేస్తూ చంద్రబాబు డైవర్షన్ గేమ్ మొదలు పెట్టడం ఇక్కడ విశేషం.

First Published:  4 May 2024 6:57 AM GMT
Next Story