Telugu Global
Andhra Pradesh

ప‌వ‌న్ పార్టీకి హైకోర్టులో ఊర‌ట‌.. జ‌న‌సేన‌కే గాజు గ్లాస్ గుర్తు

ప్రస్తుతం ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది.

ప‌వ‌న్ పార్టీకి హైకోర్టులో ఊర‌ట‌.. జ‌న‌సేన‌కే గాజు గ్లాస్ గుర్తు
X

ఎన్నిక‌ల ముందు జ‌న‌సేన పార్టీకి హైకోర్టు ఊర‌ట‌నిచ్చింది. ఆ పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్‌ను వారికే కేటాయిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. జ‌న‌సేన‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించ‌డాన్ని స‌వాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్(సెక్యులర్) హైకోర్టులో పిటిషన్ దాఖ‌లు చేసింది. ఆ పిటిష‌న్‌ను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. దీంతో గాజు గ్లాస్ గుర్తు జ‌న‌సేన‌కే ఖాయ‌మైంది.

ఫ్రీ సింబ‌ల్ మాకే ఇవ్వండ‌న్న పిటిష‌నూ కొట్టివేత‌

ప్రస్తుతం ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దానిపై కూడా ఏపీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించినందున తాము ఎన్నికల వేళ జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రెండు పిటిషన్లను తిరస్కరించింది.

ప్ర‌తిసారీ గండ‌మే..

జ‌న‌సేన పెట్టి ద‌శాబ్ద‌కాలం దాటినా ఒకే ఒక ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. అందులోనూ ఘోర ప‌రాజ‌యం. ప్ర‌తిసారి ఎన్నిక‌ల వ‌ర‌కు పోటీ చేస్తామ‌ని చెప్ప‌డం, చివ‌ర్లో కాడి ప‌డేస్తుండ‌టంతో గెలుపు అనేది ద‌రిచేర‌ని ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో రిజిస్ట‌ర్డ్ పార్టీలు పోటీ చేసి, ఓట్లు తెచ్చుకుంటే ఇచ్చే శాశ్వ‌త గుర్తు ద‌క్క‌డం గ‌గ‌న‌మైపోతోంది. ప్ర‌తిసారి గాజు గ్లాస్ గుర్తు కోసం కోర్టుల్లో పోరాడాల్సి వ‌స్తోంద‌ని, అదృష్ట‌వ‌శాత్తూ కోర్టు త‌మ‌కు అనుకూలంగా తీర్పిచ్చింద‌ని, లేక‌పోతే ఈ ఎన్నిక‌ల్లో నిండా మునిగిపోయేవాళ్ల‌మ‌ని జ‌న‌సేన అభ్య‌ర్థులు ఊపిరిపీల్చుకుంటున్నారు.

First Published:  16 April 2024 3:25 PM GMT
Next Story