Telugu Global
Andhra Pradesh

పవన్.. యూటర్న్ పవన్ అయిపోయారా?

ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ ఇప్పటికి ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నారో లెక్కేలేదు. ఒక‌ప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో పదేపదే యూటర్న్ తీసుకున్నారు. దాంతో జనాలంతా చంద్రబాబుకు యూటర్న్ బాబు అని ముద్ర వేసేశారు.

పవన్.. యూటర్న్ పవన్ అయిపోయారా?
X

చంద్రబాబునాయుడుకు మరోపేరు యూటర్న్ బాబు. అలాగే పవన్‌కు కూడా యూటర్న్ పవన్ అని పేరు మారిపోయేట్లుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి విషయంలో పవన్ ఇప్పటికి ఎన్నిసార్లు యూటర్న్ తీసుకున్నారో లెక్కేలేదు. ఒక‌ప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో పదేపదే యూటర్న్ తీసుకున్నారు. దాంతో జనాలంతా చంద్రబాబుకు యూటర్న్ బాబు అని ముద్ర వేసేశారు. దాన్ని వైసీపీ బాగా ప్రచారంలోకి తీసుకెళ్ళింది.

ఇప్పుడు విషయం ఏమిటంటే గాజువాక వారాహి యాత్రలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సీటును తీసుకునేందుకు తాను సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అప్పటికేదో ముఖ్యమంత్రి పదవిని తన కోసమే రిజర్వు చేసినట్లుగా పవన్ భ్రమల్లో ఉన్నట్లున్నారు. సీఎం పదవి అన్నది ఒకళ్ళు ఇచ్చేది కాదని ఎవరికి వాళ్ళుగా జనాల్లో నమ్మకాన్ని పెంచుకుని ఎన్నికల్లో పోరాటం చేసి గెలిచి సంపాదించుకోవాల్సిందే అన్న విషయం పవన్‌కు ఇంకా అర్థంకాలేదు.

ఒకప్పుడు ఇదే పవన్ మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ.. తనకు సీఎం పదవి అందుకనే అర్హత లేదన్నారు. కూటమి తరపున సీఎం అభ్య‌ర్థిగా కూడా తనను ఎవరు ప్రపోజ్ చేయరని చెప్పారు. సీఎం పదవి అందుకోవాలంటే అందుకు కొన్ని అర్హతలుండాలని అవి తనకు లేవని అంగీకరించారు. తర్వాత జరిగిన బహిరంగసభలో తాను ముఖ్యమంత్రి పదవి అందుకోవటానికి రెడీగా ఉన్నట్లు చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఒకసారి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవిని అందుకోవటం అంటే మామూలు విషయం కాదన్నారు. అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంద‌న్నారు.

వారాహి యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో మొదలైన నాలుగు రోజుల వరకు తనను గెలిపించి ముఖ్యమంత్రిని చేయమని జనాలను రిక్వెస్ట్‌ చేసుకున్నారు. తర్వాత ఎల్లో మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిమానులను హుషారు చేయటం కోసమే తనను సీఎంని చేయమని అడిగానంతే అని చెప్పారు. సీఎం పదవి మీద తనకు ఆశలు లేవన్నారు. కాకినాడలో మాట్లాడుతూ .. ఎమ్మెల్యేగానే తనకు ఓట్లేసి గెలిపించకపోతే ఇక ముఖ్యమంత్రి ఎలాగవుతానని జనాలనే ఎదురు ప్రశ్నించారు. మళ్ళీ ఇప్పుడు గాజువాకలో ముఖ్యమంత్రి పదవిని అందుకునేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించారు. మొత్తానికి సీఎం పోస్టు విషయంలో ఎందుకు ఇన్నిసార్లు యూటర్న్‌ తీసుకుంటున్నారో అర్థంకావటంలేదు.

First Published:  15 Aug 2023 6:31 AM GMT
Next Story