Telugu Global
Andhra Pradesh

అప్పుడు పరదాలెందుకు కట్టలేదు..? చెట్లెందుకు కొట్టలేదు..?

తాజాగా పవన్ కల్యాణ్, పోలీసులను టార్గెట్ చేశారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారాయన. పోలీసుల పాత్రపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అప్పుడు పరదాలెందుకు కట్టలేదు..? చెట్లెందుకు కొట్టలేదు..?
X

సీఎం జగన్ పై దాడి ఘటనను మరింత రచ్చ చేసేందుకే నిర్ణయించుకున్నాయి ప్రతిపక్షాలు. గొడవ చేసే కొద్దీ పరువుపోతున్నా కూడా అదే విషయాన్ని హైలైట్ చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు టీడీపీ, జనసేన నేతలు. తాజాగా పవన్ కల్యాణ్, పోలీసులను టార్గెట్ చేశారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నిస్తున్నారాయన. పోలీసుల పాత్రపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పవన్.


జగన్ పై దాడి విషయంలో రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషనర్, సీఎం సెక్యూరిటీ అధికారుల పాత్రపై విచారణ చేపట్టాలని కొత్త వాదన తెరపైకి తెచ్చారు పవన్. సెక్యూరిటీ, భద్రతాచర్యల్లో లోపాలేంటనే విషయం వెలికి తీయాలన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎంత ఉందనేది తేలాలన్నారు. ఆయా అధికారులను బదిలీ చేసి, సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగిస్తే మేలని ఉచిత సలహా ఇచ్చారు. అలా చేస్తేనే.. గులక రాయి విసిరిన చేయి, ఆ చేయి వెనక ఉన్నదెవరో బయటపడుతుందన్నారు. సూత్రధారులు, పాత్రధారులెవరో తేలుతుందని సెలవిచ్చారు పవన్.

సీఎం జగన్ ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా పరదాలు కట్టేవారని, రోడ్ల పక్కన ఉన్న చెట్లు కొట్టేసేవారని.. మరి విజయవాడ పర్యటనలో మాత్రం ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు పవన్. రాత్రి వేళ విద్యుత్ కూడా ఆపేసి చీకట్లో ముఖ్యమంత్రితో యాత్ర ఎందుకు చేయించారని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ పర్యటనలోనూ సెక్యూరిటీపరమైన లోపాలు బయటపడ్డాయని గుర్తు చేశారు పవన్. ఇలాంటి అధికారులు విధుల్లో కొనసాగితే ప్రధాని మోదీ మరోసారి పర్యటించినా కూడా ఇలాగే నిర్లక్ష్యం వహిస్తారని అన్నారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలన్నారు. గతంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా ఏపీ పోలీస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిని బదిలీ చేయాలని కోరుతూ ఈసీకి లేఖ రాశారు. ఇప్పుడు జగన్ పై దాడి ఘటనను ఉదాహరణగా చూపిస్తూ అవే ఆరోపణలను రిపీట్ చేశారు పవన్ కల్యాణ్.

First Published:  16 April 2024 7:24 AM GMT
Next Story