Telugu Global
Andhra Pradesh

అల్లర్లకు అసలు కారణమిదేనా?

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుకు ఏమాత్రం పడటంలేదు. ఇద్దరి మధ్య హై ఓల్టేజీలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే సమయంలో పుంగనూరులోకి ప్రవేశించిన చంద్రబాబు నేతలు, క్యాడర్‌ను రెచ్చగొట్టారు.

అల్లర్లకు అసలు కారణమిదేనా?
X

ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని అంగళ్ళు దగ్గర వైసీపీ-టీడీపీ క్యాడర్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చిన్నగా మొదలైన ఘర్షణ వాతావరణం చివరకు పెద్దదైపోయింది. దాదాపు మూడు గంటలపాటు రెండు పార్టీల నేతలు, శ్రేణులు ఒకళ్ళపై మరొకళ్ళు రాళ్ళతో దాడులు చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. అడ్డొచ్చిన పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 14 మంది పోలీసులకు తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. అలాటే రెండు పార్టీల్లోని వాళ్ళకి కూడా గాయాలయ్యాయి.

సరే ఈ గొడవలకు అసలు కారణం ఏమిటి? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రాయలసీమ ప్రాజెక్టులను సందర్శించే ఉద్దేశంతో చంద్రబాబు మూడు రోజులుగా కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో నుండి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సమయంలోనే గొడవలు జరిగాయి. ఇక్కడే అసలు కారణం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి చెప్పిన ప్రకారం గొడవలకు కారణం చంద్రబాబునాయుడేనట.

కారణం ఏమిటంటే టీడీపీ నేతలు ముందుగా పోలీసులకు ఇచ్చిన రూటు మ్యాప్ ప్రకారం పుంగనూరు హైవే మీదుగా చిత్తూరుకు వెళ్ళిపోవాలి. అంటే పుంగనూరు టౌన్లోకి చంద్రబాబు ప్రవేశించేందుకు లేదు. కానీ చివరి నిమిషంలో రూటు మార్చి పక్కా ప్లాన్‌తో కావాలనే పట్టణంలోకి వచ్చినట్లున్నారు. చంద్రబాబు పుంగనూరులోకి వస్తున్న విషయం తెలుసుకుని వైసీపీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఆ సమయంలో సంయమనం పాటించాల్సిన చంద్రబాబు కూడా రెచ్చగొట్టేట్లుగా మాట్లాడారు. దాంతో చంద్రబాబును చూసుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. దాంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుకు ఏమాత్రం పడటంలేదు. ఇద్దరి మధ్య హై ఓల్టేజీలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే సమయంలో పుంగనూరులోకి ప్రవేశించిన చంద్రబాబు నేతలు, క్యాడర్‌ను రెచ్చగొట్టారు. ‘తరమండి..కొట్టండి కొడుకులను..చూసుకుందాం’ అంటూ కార్యకర్తలను ఉసిగొల్పారు.

పుంగనూరు హైవే మీదుగా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చంద్రబాబు చిత్తూరుకు వెళ్లిపోయి ఉంటే అసలు గొడవే జ‌రిగేదికాదు. సడెన్‌గా పుంగనూరు టౌన్లోకి రావాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చింది? ఇప్పుడేకాదు నెల్లూరు రోడ్డుషోలో 11 మంది చనిపోయిన ఘటనలో రూటు మ్యాప్ ఒకటిచ్చి సభను మరోచోట పెట్టుకున్నారు. గుంటూరులో ముగ్గురు చనిపోయిన ఘటనలో కూడా టీడీపీ నేతలు పోలీసులకు ఒకటి చెప్పి మరో ప్రోగ్రామ్ చేసుకున్నారు. అంటే జరిగింది చూస్తుంటే టీడీపీ కావాలనే వైసీపీని రెచ్చగొట్టి గొడవలకు దింపినట్లు అర్థ‌మవుతోంది.

First Published:  5 Aug 2023 5:27 AM GMT
Next Story