Telugu Global
Andhra Pradesh

షర్మిలలో ఓటమి భయం.. రుజువు ఇదే

కడప కోర్టు ఓసారి వద్దని వారించినా, హైకోర్టు మరోసారి చీవాట్లు పెట్టినా షర్మిల తీరు మాత్రం మారలేదు. పదే పదే వైఎస్ వివేకా హత్యకేసుని తెరపైకి తేవడం, అవినాష్ రెడ్డిని హంతకుడు అనడం ఆమెకు పరిపాటిగా మారింది.

షర్మిలలో ఓటమి భయం.. రుజువు ఇదే
X

షర్మిలలో ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అందుకే ఆమె మరీ దిగజారిపోయి విమర్శలు చేస్తున్నారు. ఇన్నాళ్లూ అన్న జగన్ పైనే అక్కసు వెళ్లగక్కిన ఆమె, ఇప్పుడు వదినమ్మ భారతీ రెడ్డిపై కూడా విమర్శలు మొదలు పెట్టారు. కడపలో వైసీపీ సింగిల్ ప్లేయర్ అంటూ ఇటీవల భారతీ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ షర్మిల ఘాటు విమర్శలు చేశారు.

"వాళ్లే అధికారంలో ఉండాలి.. వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లందరినీ నరికేయాలి.. వాళ్లే సింగిల్‌ ప్లేయర్‌గా ఉండాలి.. భారతి స్ట్రాటజీ ఇదేనా? గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్‌ ప్లేయర్‌." అని అన్నారు షర్మిల. ప్రజలకు అందుబాటులో ఉండే ఎంపీ కావాలంటే తనకు ఓటు వేయాలని, ఎంపీని జైలుకెళ్లి కలసి రావాలంటే అవినాష్‌రెడ్డికి ఓటు వేయాలంటూ వెటకారం చేశారు. దేవుడు తమవైపే ఉంటారని, గొడ్డలితో నరికే వారి వైపు కాదని అన్నారు షర్మిల.

పదే పదే అవే ఆరోపణలు..

కడప కోర్టు ఓసారి వద్దని వారించినా, హైకోర్టు మరోసారి చీవాట్లు పెట్టినా షర్మిల తీరు మాత్రం మారలేదు. పదే పదే వైఎస్ వివేకా హత్యకేసుని తెరపైకి తేవడం, అవినాష్ రెడ్డిని హంతకుడు అనడం ఆమెకు పరిపాటిగా మారింది. అయితే అదే సమయంలో ఆమె ఉద్దేశపూర్వకంగానే కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారని కూడా తేలిపోయింది. ఈసీ చర్యలు తీసుకుంటే సానుభూతి దక్కుతుందనేది షర్మిల ఆలోచన. అందుకే ఆమె అవినాష్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

పవన్ మాటలు వినపడలేదా..?

వైఎస్ఆర్ మరణంపై పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా షర్మిల స్పందించకపోవడం శోచనీయం అంటున్నారు నెటిజన్లు. చంద్రబాబుకోసం ఆమె పనిచేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు. షర్మిల టార్గెట్ కేవలం జగన్ మాత్రమేనని, అందుకే ఆమె టీడీపీ కూటమిపై కూడా విమర్శలు సంధించడంలేదని చెబుతున్నారు. ఎవరెన్ని అంటున్నా కూడా షర్మిల మాత్రం కడప ఎంపీ సీటుపైనే తన ఫోకస్ పెట్టారు. వివేకా హత్యకేసుని తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.

First Published:  8 May 2024 11:15 AM GMT
Next Story