Telugu Global
Andhra Pradesh

తెలుగుదేశం గుండెల్లో రాయి పడింది..!

ఆ రాయి దెబ్బ, తెలుగుదేశానికి మొహం పగిలిపోయేట్టు తగిలింది. జగన్ని చంపడానికి తెగిస్తారా అంటూ సామాన్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జనం మధ్యలో ఉన్న జగన్ని దెబ్బ తీశాం అన్న తెలుగుదేశం ఆనందం, క్షణాల్లో ఆవిరైపోయింది.

తెలుగుదేశం గుండెల్లో రాయి పడింది..!
X

అక్కడ తెలుగుదేశం ఒక పెద్ద ముక్క. జనసేన చిన్నముక్క. బీజేపీ ఓ పిచ్చి మొక్క. పంటి బిగువున ఈ మూడు ముక్కలాట ఆడుతున్నాడు చంద్రబాబు. ఎన్నికలు పట్టుమని నెలరోజులు కూడా లేవు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని ఎవరో రాయితో కొట్టారు. ఇది రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచింది. ఇదీ వైసీపీ వాళ్ల దొంగ నాటకం అనీ, సానుభూతి పొందడం కోసం వాళ్లే రాయితో చిన్న గాయం చేసుకున్నారనీ తెలుగుదేశం వాళ్లు ఎదురుదాడికి దిగారు. వేగంగా వచ్చిన రాయి తగిలి, నుదుటి మీద జగన్‌కి నెత్తురోడీ గాయం అయినప్పుడు – అది వైసీపీ పనే అనడం దారుణమైన రాజకీయ దగుల్బాజీతనం. ఎక్కడైనా ఒక చిన్నరాయి మారణాయుధం అవుతుందా..? అని అతి తెలివి ప్రదర్శిస్తూ అడుగుతున్నారు. వేగంగా విసిరిన రాయి ఒక మనిషి కణతకి తగిలితే ఏమవుతుందో అందరికీ తెలుసు. మొదట తెలుగుదేశం వాళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా ఇప్పుడు బాగా డిఫెన్స్‌లో పడ్డారు. వాస్తవానికి ఆ రాయి తెలుగుదేశం కణతకి గట్టిగా తగిలింది. ఆ చిన్నరాయే వాళ్ల ఎన్నికల అవకాశాలను బాగా దెబ్బతీసింది. గొప్ప ప్రజాదరణ ఉన్న జగన్‌కి సహజంగానే సానుభూతి ప్రవాహంలా వచ్చిపడింది.

అసలే అతుకుల బొంతలా ఉన్న కమ్మ, కాపు, హిందుత్వ‌ పొత్తు పెద్ద తలనొప్పిగా మారింది. వైసీపీ బహిరంగ సభలు బ్రహ్మాండంగా జరుగుతుండడంతో, చంద్రబాబుకీ, పవన్‌ కళ్యాణ్‌కీ పొత్తు అనే మత్తు పాదాల్లోకి దిగిపోయింది. వాళ్లకిప్పుడు అరుపులు, కేకలు, రంకెలు మాత్రమే మిగిలాయి. ఓటమి ఖాయం కూటమిని వెన్నాడుతోంది.

భయం నంబర్‌ వన్‌ : మేం అధికారంలోకి వస్తే నాలుగు శాతం ఉన్న ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం అని బీజేపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. ఈ ట్రిక్కు గుజరాత్‌లో, ఉత్తరప్రదేశ్‌లో ఫలిస్తుందేమో గానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ పాచిక పారదు. దాదాపు 40 నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలన్ని శాసించే సంఖ్యలో ఉన్న ముస్లింలు ఈ ఎన్నికల్లో ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నారు. తమపై బాహటంగా విషం కక్కుతున్న బీజేపీని ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. ముస్లిం ఓట్ల వల్ల వైసీపీకి 20–25 అసెంబ్లీ స్థానాలు వచ్చినా అది తెలుగుదేశం పాలిట పిడుగుపాటు అవుతుంది.

భయం నంబర్‌ టూ : అన్ని జిల్లాల్లోనూ వ్యాపించి ఉన్న దళిత ఓటు. క్రిస్టియన్‌ అనుకూల ప్రభుత్వం అనే పేరున్నందు వల్ల, మెజారిటీ మాల మాదిగలు జగన్‌ మద్దతుదార్లుగా ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో 15 శాతం పైనే ఉన్న దళిత ఓట్లు చీలినా, వైసీపీకే ఎక్కువ ఓట్లు పడతాయి. చంద్రబాబు కమ్మ పార్టీకీ, పవన్‌ కళ్యాణ్‌ కాపు పార్టీకీ, బ్రాహ్మల బీజేపీకీ ఓటు వేయడానికి దళితులు సుతరామూ అంగీకరించరు. అందుకే వైసీపీ నిశ్చింతగా ఉంది.

భయం నంబర్‌ త్రీ : కూలీలకూ, పేదలకూ, నిస్సహాయులకూ, మహిళలకూ, దళితులకూ, బీసీలకూ, ముస్లింలకూ నగదు రూపంలో అందుతున్న సంక్షేమం..! వాళ్లకి క్రమం తప్పకుండా డబ్బు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు. భారతదేశంలో ఎన్నడూ ఇలాంటిది జరిగిందిలేదు. మారుమూల చిన్న ఊళ్లలో, గ్రామాల్లో పెద్దగా చదువులేని జనాలకి మూడు వేలు, అయిదు వేలు – క్రమం తప్పకుండా అందడం ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడ పేదవాడు జగన్‌కి కృతజ్ఞుడై ఉన్నాడు. అందుకే చంద్రబాబు భయంతో వణుకుతున్నాడు.

భయం నంబర్‌ ఫోర్‌ : ఆ రాయి దెబ్బ, తెలుగుదేశానికి మొహం పగిలిపోయేట్టు తగిలింది. జగన్ని చంపడానికి తెగిస్తారా అంటూ సామాన్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. జనం మధ్యలో ఉన్న జగన్ని దెబ్బ తీశాం అన్న తెలుగుదేశం ఆనందం, క్షణాల్లో ఆవిరైపోయింది. వైసీపీ ఈ రాజకీయ అవకాశాన్ని అద్భుతంగా వాడుకుంది. పార్టీ శ్రేణుల్ని కూడగట్టింది. విషం చిమ్ముతున్న తెలుగుదేశం కక్షరాజకీయాలపై వైసీపీ యుద్ధ‌భేరీ మోగించింది. నాలుగువైపుల నుంచీ భయం కారుమబ్బులై కమ్ముకువస్తోంది. జగన్‌పై కురిసే కృతజ్ఞత అనే ఓట్ల వరదలో కూటమి హాహాకారాలు చేస్తూ కొట్టుకుపోవడం మనం కళ్లారా చూడబోతున్నాం.

First Published:  17 April 2024 5:03 AM GMT
Next Story