Telugu Global
Andhra Pradesh

ముచ్చటగా ముగ్గురు.. చంద్రబాబుపై రాబిన్ శర్మ అసహనం?

రాబిన్ శర్మ టీమ్ తన కోసం పనిచేస్తుండగా చంద్రబాబు ప్రశాంత్ కిశోర్ తో డీల్ కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు రాబిన్ శర్మ టీమ్ పనిచేయాల్సిన పరిస్థితిని ఆయన కల్పించారని అంటున్నారు.

ముచ్చటగా ముగ్గురు.. చంద్రబాబుపై రాబిన్ శర్మ అసహనం?
X

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరుపై రాబిన్ శర్మ అసహనం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ కోసం రాబిన్ శర్మ టీమ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. తాను చేసిన సూచనలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని, ఇలాగైతే విజయం సాధ్యం కాదని ఆయన అంటున్నట్లు చెప్పుతున్నారు. ఓ వైపు తాను పనిచేస్తుండగా మరో ఇద్దరు ఎన్నికల వ్యూహకర్తలు ఎందుకని ఆయన అసహ‌నం వ్యక్తం చేస్తున్నట్లు కూడా చెప్పుతున్నారు.

రాబిన్ శర్మ టీమ్ తన కోసం పనిచేస్తుండగా చంద్రబాబు ప్రశాంత్ కిశోర్ తో డీల్ కుదుర్చుకున్నారు. ప్రశాంత్ కిశోర్ సూచనల మేరకు రాబిన్ శర్మ టీమ్ పనిచేయాల్సిన పరిస్థితిని ఆయన కల్పించారని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని, క్షేత్రస్థాయి విషయాలు ఆయనకు చేరే అవకాశం లేదని అంటున్నారు. అందువల్ల ప్రశాంత్ కిశోర్ సలహాలు ఎలా పనిచేస్తాయనే విషయాన్ని చంద్రబాబు ఆలోచించడం లేదని అంటున్నారు.

అంతేకాకుండా, కర్ణాటకలోనూ తెలంగాణలోనూ కాంగ్రెస్ కోసం పనిచేసిన సునీల్ కనుగోలును కూడా చంద్రబాబు నియమించుకున్నట్లు వినికిడి. ఇంత మంది వ్యూహకర్తల వల్ల విషయాలు కలగాపులగం అవుతాయని, గురి పెట్టి పనిచేయడానికి వీలు కాదని, టార్గెట్లు తప్పుతాయని అంటున్నారు. పైగా రాబిన్ శర్మ చేసిన సూచనలను చంద్రబాబు పట్టించుకోవడం లేదని అంటున్నారు.

కోవిడ్ కు మందు రాబిన్ శర్మ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని రూపొందించారు. అది కాస్తా ఫలితం ఇచ్చినట్లు కనిపించింది. ఆ తర్వాత ‘ఏం ఖర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమాన్ని ఆయన రూపొందించారు. అది ఫరవాలేదనిపించింది. ఈ స్థితిలో టీడీపీ పట్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పడినట్లు కనిపించింది. వైఎస్ జగన్ సిద్ధం సభల ప్రారంభంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అందుకు సమాంతరంగా బలమైన కార్యక్రమాలను తీసుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు.

సీట్ల పంపకంలోనూ, సీట్ల కేటాయింపులోనూ చంద్రబాబు రాబిన్ శర్మ మాటలను పెడ చెవిన పెట్టారని, దానివల్ల చాలా చోట్ల ఓటమి పాలయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. జనసేన, బీజేపీలతో సీట్ల పంపకం కొంప ముంచే పరిస్థితి తెచ్చినట్లు భావిస్తున్నారు. బీజేపీకి, జనసేనకు కేటాయించిన 31 అసెంబ్లీ స్థానాల్లో సగమైనా గెలుస్తాయా అనే సందేహాలు పట్టి పీడిస్తున్నాయి. అపజయావకాశాలను చంద్రబాబు కొని తెచ్చుకున్నారని, తాని ఎంత పనిచేసినా ఫలితం ఉండదని రాబిన్ శర్మ అంటున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

First Published:  20 April 2024 8:33 AM GMT
Next Story