Telugu Global
Andhra Pradesh

సిద్ధం దెబ్బకి టీడీపీ మైండ్ బ్లాక్.. రుజువులివే

సిద్ధం సభలతో టీడీపీలో వణుకు మొదలైందనే చెప్పాలి. పొత్తు వ్యవహారాలన్నీ పక్కనపెట్టి ఆదివారం సిద్ధం సభను చూసేందుకే టీడీపీ నేతలు ఎక్కువ సమయం కేటాయించినట్టు తెలుస్తోంది.

సిద్ధం దెబ్బకి టీడీపీ మైండ్ బ్లాక్.. రుజువులివే
X

మేదరమెట్లలో వైసీపీ ఆఖరి సిద్ధం సభ ఏపీలో రాజకీయ కలకలం రేపింది. లక్షలాదిమంది ఈ సభకు వచ్చారని, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయిందని, యూట్యూబ్ లో కేవలం సాక్షి ఛానెల్ లోనే 56వేల మంది లైవ్ లో వీక్షించారని, ఇక ట్విట్టర్లో రికార్డు స్థాయిలో 11వేలమంది లైవ్ లో చూశారని అధికార పార్టీ అధికారికంగా చెప్పుకుంటోంది. ఈ వ్యవహారాలన్నీ టీడీపీకి మింగుడు పడటం లేదు. సిద్ధం సభ గ్రాండ్ సక్సెస్ అనే మాట వింటేనే ఎల్లో మీడియాకు మంటెత్తిపోతోంది. సభ జరగడానికి ముందే వీలైనంత విషం కక్కింది ఎల్లో మీడియా. సభ పూర్తయిన తర్వాత నారా లోకేష్ సహా టీడీపీ బ్యాచ్ తెగ ఇదైపోతోంది. అదంతా గ్రాఫిక్ మాయాజాలం అంటూ అక్కసు వెళ్లగక్కుతోంది.

వైసీపీ సిద్ధం సభలో చూపించిన జనమంతా గ్రాఫిక్స్ అంటూ నారా లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ఒక గుంపు జనాన్ని పలుచోట్ల అమర్చారంటూ కొన్ని ఫొటోలు విడుదల చేశారు. మార్ఫింగ్‌ ఫొటోలు వేసిన వైనం చరిత్రలో ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. డ్రోన్‌ చిత్రాలు, గ్రీన్‌ మ్యాట్‌తో దొరికిపోయారని.. ఇప్పుడు ఏకంగా మార్ఫింగ్‌ చేసి ఫొటోలు వదిలారని ఎద్దేవా చేశారు. లోకేష్ తన రాజకీయం మరచిపోయి సిద్ధం సభపైనే ఫోకస్ పెట్టినట్టున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. జగన్ కోసం వచ్చిన జనాలను చూసి టీడీపీ నేతలు భయంతో వణికిపోతున్నారంటే సిద్ధం సభ ఏ స్థాయిలో గ్రాండ్ సక్సెస్ అయిందో స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు.



సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..

సిద్ధం సభకు ముందు గ్రీన్ మ్యాట్ లు వేశారంటూ ఎల్లో మీడియా రచ్చ చేయాలని చూసింది. సభా ప్రాంగణంలో జనం తాకిడికి దుమ్మురేగకుండా, సభకు వచ్చినవాళ్లు ఇబ్బంది పడకుండా గ్రీన్ మ్యాట్ వేస్తే అసలు టీడీపీకి వచ్చిన నష్టమేంటని అప్పుడే కౌంటర్లు పడ్డాయి. ఆ తర్వాత సభ జరిగే సమయంలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని, అనుకున్న స్థాయిలో జనం రాలేదని, డ్రోన్ ఎగురుతుంటే వైసీపీ నేతలు భయపడ్డారంటూ కథనాలిచ్చారు. తీరా ఇప్పుడు సభ పూర్తయిన తర్వాత లోకేష్ సహా టీడీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. మొత్తానికి సిద్ధం సభలతో టీడీపీలో వణుకు మొదలైందనే చెప్పాలి. పొత్తు వ్యవహారాలన్నీ పక్కనపెట్టి ఆదివారం సిద్ధం సభను చూసేందుకే టీడీపీ నేతలు ఎక్కువ సమయం కేటాయించినట్టు తెలుస్తోంది.

First Published:  11 March 2024 5:43 AM GMT
Next Story