Telugu Global
Andhra Pradesh

అది నానాజాతి సమితి.. అందులో చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీ లేకుండా చేయడంలో టీడీపీదే ప్రధాన పాత్ర అనేది అందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఇప్పుడు ఆయన అదే పార్టీకి సపోర్ట్ చేయడమేంటని నిలదీస్తున్నారు నెటిజన్లు.

అది నానాజాతి సమితి.. అందులో చిరంజీవి
X

రాజకీయాల్లో నేను లేను, నాకు రాజకీయాలు సరిపడవు అంటూనే చిరంజీవి ఇటీవల తన ముసుగు తొలగించశారంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. తాను నేరుగా కూటమికి మద్దతిస్తున్నానని చెప్పకపోయినా కూటమిలోని ఇద్దరు నేతలకు ఓటు వేయాలంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు. పంచకర్ల రమేష్ బాబు, సీఎం రమేష్ ని చెరోవైపు కూర్చోబెట్టుకుని చిరు స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో ఆయన కూటమికి వకాల్తా పుచ్చుకున్నారనే విషయం స్పష్టమైంది. దీంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. ప్రజారాజ్యం పార్టీ లేకుండా చేయడంలో టీడీపీదే ప్రధాన పాత్ర అనేది అందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా చిరంజీవి ఈ విషయంలో ఎల్లో మీడియాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ ఇప్పుడు ఆయన అదే పార్టీకి సపోర్ట్ చేయడమేంటని నిలదీస్తున్నారు నెటిజన్లు.

మాకు సంతోషమే..

చిరంజీవి కూటమికి సపోర్ట్ చేస్తూ మాట్లాడటం తమకు సంతోషమేనన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎవరు ఎటువైపు ఉన్నారనే విషయం ప్రజలకు స్పష్టంగా తెలిసిందని, వారికి క్లారిటీ వచ్చేసిందని చెప్పారు. కూటమిలో నక్కలు, తోడేళ్లు, హైనాలు.. అన్నీ కలసిపోయాయని, ఇటువైపు జగన్ ఒక్కరే సింగిల్ గా ఉన్నారని చెప్పారు సజ్జల. కూటమి ఓ నానాజాతి సమితిలా మారిపోయిందని, అందులో ఇప్పుడు చిరంజీవి కూడా చేరారని ఎద్దేవా చేశారు. చిరంజీవే కాదు, ఇంకా ఎంతమంది వారికి సపోర్ట్ చేసినా వైసీపీ విజయం ఖాయమైపోయిందని అన్నారు సజ్జల.

మెగాస్టార్ రియాక్షన్ ఉంటుందా..?

చాన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా నిగ్రహంగానే ఉన్నారు చిరంజీవి. ఆ మాటకొస్తే తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా ఆయన పెద్దగా స్పందించలేదు. కానీ ఏపీలో తమ్ముడికోసం చిరంజీవి బయటకు రావాల్సిన పరిస్థితి. జనసేనకు విరాళం ఇస్తూ ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు. ఆ తర్వాత కూటమి నేతలకు సపోర్ట్ చేస్తూ స్టేట్ మెంట్లు ఇచ్చి పూర్తిగా ముసుగు తొలగించేశారు. ఈ వ్యవహారంలో వస్తున్న విమర్శలకు చిరంజీవి కౌంటర్లు ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

First Published:  22 April 2024 2:30 AM GMT
Next Story