Telugu Global
Andhra Pradesh

బస్సు లోయలో పడి ఇద్దరు మృతి, 30 మందికి గాయాలు

బస్సు లోయలో పడటంతో స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. అతి కష్టం మీద ప్రయాణికులను ప్రధాన రహదారి పైకి తీసుకొచ్చారు.

బస్సు లోయలో పడి ఇద్దరు మృతి, 30 మందికి గాయాలు
X

ఆర్టీసీ బస్సు లోయలో పడిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 30 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తుండగా ఘాట్‌ రోడ్డు వ్యూ పాయింట్‌ వద్ద అదుపు తప్పింది. పల్టీలు కొట్టుకుంటూ 50 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నారు.

బస్సు లోయలో పడటంతో స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. అతి కష్టం మీద ప్రయాణికులను ప్రధాన రహదారి పైకి తీసుకొచ్చారు. పాడేరు వైపు నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సులో క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ కూడా ఉన్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు చెట్టు కొమ్మలు రోడ్డుపైకి వాలిపోవటం, రహదారి పక్కన రక్షణ గోడ లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ లేకపోవడంతో తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడానికి క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్నారు.

సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల‌ కలెక్టర్లు, ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని చెప్పారు.

First Published:  20 Aug 2023 12:59 PM GMT
Next Story