Telugu Global
Andhra Pradesh

వైసీపీ అసంతృప్తులపై ఎల్లో మీడియా సానుభూతి

ఎన్నికల నాటికి వైసీపీలో మరిన్ని సంస్కరణలు తెరపైకి రావొచ్చు. ఎల్లో మీడియాకు మరింత పని పెరగొచ్చు. అయితే ఎంతమంది ఎల్లో మీడియా ట్రాప్ లో పడతారనేది వేచి చూడాలి.

వైసీపీ అసంతృప్తులపై ఎల్లో మీడియా సానుభూతి
X

సీఎం జగన్ సహా వైసీపీ నేతలందరిపై బురదజల్లడమే ఎల్లో మీడియా పని. కానీ ఇప్పుడు కాస్త రూటు మారింది. వైసీపీలో కొంతమందిని సెలక్ట్ చేసుకుని ఎక్కడలేని సింపతీ చూపిస్తోంది. అయ్యోపాపం అంటూ వారిపై కథనాలిస్తోంది. ఇటీవల 11 నియోజకవర్గాలకు కొత్తగా వైసీపీ ఇన్ చార్జ్ లను ప్రకటించిన నేపథ్యంలో అసంతృప్తులందరిపై ఎల్లో మీడియా సానుభూతి చూపిస్తోంది. వారంతా టీడీపీ గేలానికి చిక్కేందుకు సహకరిస్తోంది.

ఆళ్ల రామకృష్ణారెడ్డి, మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాసులరెడ్డి.. వీరందరి గురించి ఈనాడులో ఓ సింపతీ ఆర్టికల్ వచ్చింది. గతంలో ఆయా నాయకుల్ని విమర్శించిన ఇదే ఈనాడు.. ఇప్పుడు జగన్ వారిని దూరం పెడుతున్నారని తెలిసే సరికి ఎక్కడలేని సానుభూతి చూపిస్తోంది. జగన్ కు నమ్మిన బంటుల్లా ఉన్నారని, అప్పట్లో అధికారాన్ని వదిలేసి ఆయన వెంట వచ్చారని, ఆయన గీచిన గీత దాటలేదని.. అలాంటి వారందర్నీ జగన్ దూరం పెట్టారని, పాపం వాళ్ల పరిస్థితి ఏంటని ఓ కథనాన్ని వండి వార్చింది ఈనాడు.

జగన్ నిర్ణయంతో సీనియర్లు ఇబ్బంది పడుతున్నారో లేదో తెలియదు కానీ ఈనాడు మాత్రం తెగ ఇదైపోతోంది. ఆ నాయకుల్ని జగన్ పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారంటోంది. పరోక్షంగా వారిని టీడీపీ గూటికి చేర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తమకు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తామంతా జగన్ తోనే ఉంటామని కొందరు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు, మరికొందరు సైలెంట్ అయ్యారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి వంటి నేతలు పార్టీకి రాజీనామా చేసి తమ అసంతృప్తిని బయటపెట్టారు. వీరందర్నీ ఈనాడు టార్గెట్ చేసింది. జగన్ వారికి అన్యాయం చేశారంటూ గగ్గోలు పెడుతోంది.

ఎల్లో మీడియా ట్రాప్ లో పడి ఆ నాయకులంతా ఎదురు తిరిగినా సీఎం జగన్ మాత్రం తన నిర్ణయాలను మార్చుకునేలా లేరు. "జుట్టు ఉంటేనే ఏ కొప్పయినా పెట్టుకోవచ్చు" అనే ఉదాహరణ గతంలో జగన్ చాలా సార్లు ఎమ్మెల్యేలకు చెప్పారు. ఎమ్మెల్యేలు గెలిస్తేనే తిరిగి వైసీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, దానికోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఈపాటికే క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల నాటికి వైసీపీలో మరిన్ని సంస్కరణలు తెరపైకి రావొచ్చు. ఎల్లో మీడియాకు మరింత పని పెరగొచ్చు. అయితే ఎంతమంది ఎల్లో మీడియా ట్రాప్ లో పడతారనేది వేచి చూడాలి.

First Published:  14 Dec 2023 5:54 AM GMT
Next Story