Telugu Global
Andhra Pradesh

ఆ లేఖ చదివితే పవన్ ఏపీ వదిలి పారిపోవడం ఖాయం

ముద్రగడ లేఖ చదివితే పవన్ ఏపీ వదిలి పారిపోతారని అన్నారు మంత్రి జోగి రమేష్. గతంలో సీఎం సీఎం అంటూ ఆయన అభిమానులు గోల చేసేవారని, ఇప్పుడు పవన్, ఎమ్మెల్యేగా గెలిపించండి చాలు అంటూ బతిమిలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

ఆ లేఖ చదివితే పవన్ ఏపీ వదిలి పారిపోవడం ఖాయం
X

ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం చూస్తూనే ఉన్నాం. అయితే సడన్ గా ఈ యుద్ధంలోకి కాపు ఉద్యమ నేత ముద్రగడ ఎంట్రీ ఇచ్చారు. వైసీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుగుతున్నా ప్రస్తుతానికి ఆయన తటస్థుడే. కాపు ఉద్యమ నేతే అయినా పవన్ ని ఆయన ఎప్పుడూ కాపు నాయకుడిగా గుర్తించలేదు. ఇప్పుడు కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా పవన్ కి ఘాటు లేఖ రాశారు. ఈ లేఖ తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరే మళ్లీ పవన్ పై ఎదురుదాడి మొదలు పెట్టారు. ఆ లేఖ చదివితే పవన్ కల్యాణ్ ఏపీ వదిలిపెట్టి పారిపోవడం ఖాయమంటున్నారు మంత్రి జోగి రమేష్.

నేనెక్కడికీ వెళ్లను, గోదావరి లాగే ఈ జిల్లాలను అంటిపెట్టుకుని ఉంటానంటూ.. ఇటీవల పదే పదే పవన్ కల్యాణ్ చెబుతున్నారు. అయితే ముద్రగడ లేఖ చదివితే మాత్రం ఆయన ఏపీ వదిలి పారిపోతారని అంటున్నారు మంత్రి జోగి రమేష్. గతంలో సీఎం సీఎం అంటూ ఆయన అభిమానులు గోల చేసేవారని, ఇప్పుడు పవన్, ఎమ్మెల్యేగా గెలిపించండి చాలు అంటూ బతిమిలాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వంగవీటి మోహన్ రంగాని హత్యచేయించిన చంద్రబాబుకోసం, ముద్రగడ కుటుంబ సభ్యులను కొట్టుకుంటూ లాక్కెళ్లిన చంద్రబాబుకోసం పవన్ పనిచేయడం సిగ్గుచేటని అన్నారు. కాపులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంది వైఎస్ఆర్, జగన్ మాత్రమేనని స్పష్టం చేశారు జోగి రమేష్. లోకేష్ పాక్కుంటా తిరిగినా, పవన్ కల్యాణ్‌ వారాహి వాహనంలో తిరిగినా ప్రజలు నమ్మరని అన్నారు.

సినిమా స్టైల్ లో హావభావాలు చూపిస్తూ, అభిమానుల్ని అలరించడానికే పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు. చంద్రబాబు కూడా ఈ స్థాయిలో ఎప్పుడూ వ్యక్తిగత దూషణలు చేయలేదని గుర్తు చేశారు. సబ్జెక్ట్ లేకపోతేనే ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయన్నారు. పవన్ కు దమ్ముంటే కాకినాడ సిటీలో ద్వారంపూడికి పోటీగా నిలబడాలని సవాల్ విసిరారు కన్నబాబు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించడానికి చిరంజీవి వస్తే, టీడీపీ ప్రభుత్వం ఎయిర్‌ పోర్ట్‌ లోనే నిర్భధించిందని గుర్తు చేశారు. అప్పుడు పవన్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో 90 శాతం కాపులు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు కన్నబాబు.

రెడ్లు, కాపుల మధ్య గొడవ కోసమే..

రెడ్డి సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం మధ్య గొడవలు పెట్టేందుకే పవన్ తనపై విమర్శలు చేశారన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తనపై పోటీ చేసే సత్తా లేక పవన్ కల్యాణ్ తోక ముడిచారన్నారు. లేదా ఆయనకు చంద్రబాబు అనుమతివ్వలేదేమోనన్నారు. తనపై పోటీ చేసే విషయంలో పవన్ కి తాను విధించిన డెడ్ లైన్ ముగిసిందని, తనపై పోటీ చేసే ధైర్యం పవన్ కు లేదనే విషం తేలిపోయిందన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి.

First Published:  20 Jun 2023 12:18 PM GMT
Next Story