Telugu Global
Andhra Pradesh

రజినీని టార్గెట్ చేసిన వైసీపీ.. కుమ్ముడే కుమ్ముడు

పవన్‌ కల్యాణ్‌ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే.. రజినీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దించారని అన్నారు కొడాలి నాని. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కల్యాణ్‌ గ్రహించాలని హితవు పలికారు.

రజినీని టార్గెట్ చేసిన వైసీపీ.. కుమ్ముడే కుమ్ముడు
X

మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండే హీరో రజినీకాంత్ అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే రజినీ, చంద్రబాబుని పొగిడి దిగజారిపోయారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న హీరో రజినీకాంత్‌ ఇప్పుడు వైసీపీ నేతలకు టార్గెట్‌ గా మారిపోయారు. ముందుగా మంత్రి రోజా, రజినీపై చెణుకులు విసిరారు. ఆ తర్వాత ఇప్పుడు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ సహా మరికొందరు రజినీని టార్గెట్ చేశారు. ఏపీలో జీరో అయిన చంద్రబాబుని సిగ్గు శరం లేకుండా రజినీ కాంత్ పొగుడుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.

పవన్ ని బ్లాక్ మెయిల్ చేసేందుకే..

పవన్‌ కల్యాణ్‌ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే.. రజినీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దించారని అన్నారు కొడాలి నాని. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కల్యాణ్‌ గ్రహించాలని హితవు పలికారు. ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా వైశ్రాయ్‌ హోటల్లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజినీకాంత్.. ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు కొడాలి. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ప్రజలెవరూ పట్టించుకోరన్నారు. ఎన్టీఆర్ బతికుండగా రజినీ ఏం చేశారని, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు.

రజినీకాంత్ సినిమాల్లో సూపర్ స్టార్ కానీ, రాజకీయాల్లో మాత్రం అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు మరో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. సొంతంగా గెలిచే సత్తా లేకే చంద్రబాబు.. రజినీకాంత్, బాలకృష్ణ, గరుడ శివాజీలను తెర మీదకు తెస్తున్నారని సెటైర్లు వేశారు. ఎంత మంది రజినీకాంత్‌ లు వచ్చినా ప్రజలు నమ్మరని, వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం అని చెప్పారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పుడు రజినీకాంత్ కూడా చంద్రబాబుతో చేతులు కలిపాడన్న విషయం అందరికీ తెలుసన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి. అటువంటి వ్యక్తి వచ్చి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తాననటం ఆశ్చర్యంగా ఉందన్నారు. విజన్ 2047 అంటే ఏంటో తనకు అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.

First Published:  29 April 2023 10:39 AM GMT
Next Story