Telugu Global
Andhra Pradesh

వైసీపీ అభ్యర్థికి జైలు శిక్ష.. జగన్ నిర్ణయంపై అందరిలో ఆసక్తి

కోర్టు తీర్పు వెలువరించిన ఈ సందర్భంలో ఆయన అభ్యర్థిత్వాన్ని జగన్ సమర్థిస్తారా, లేక ప్రత్యామ్నాయం చూస్తారా అనేది ఆసక్తిగా మారింది.

వైసీపీ అభ్యర్థికి జైలు శిక్ష.. జగన్ నిర్ణయంపై అందరిలో ఆసక్తి
X

28ఏళ్లనాటి ఘటన అది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేసినట్టు కేసు నమోదైంది. ఆ కేసులో ఎట్టకేలకు ఇప్పుడు తీర్పు వచ్చింది. సుదీర్ఘ విచారణ అనంతరం తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. నేరారోపణ జరిగినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు, తీర్పు వెలువడే నాటికి ఎమ్మెల్సీగా, మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. కోర్టు తీర్పు ఖరారు చేసిన తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని జగన్ సమర్థిస్తారా, లేక ప్రత్యామ్నాయం చూస్తారా అనేది ఆసక్తిగా మారింది.

1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారనేది అభియోగం. ముద్దాయిల్లో తోట త్రిమూర్తులు కుటుంబ సభ్యులు ఆరుగురు, ముగ్గురు సహాయకులు ఉన్నారు. ఈఘటనలో మొత్తం 24 మందిని సాక్షులుగా గుర్తించారు.. వారిలో 11 మంది మృతి చెందారు. ఈ కేసు విచారణ రకరకాల మలుపులు తిరిగింది. 1998లో ఈ కేసును కొట్టి వేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.. అయితే మళ్లీ హైకోర్టు ఆదేశాలతో 2000లో కేసు రీ ఓపెన్‌ చేశారు. 2012 నుంచి 2019 వరకు 146 సార్లు ఈ కేసు వాయిదా పడింది. 28 ఏళ్లుగా సాగిన విచారణ తర్వాత ఈరోజు ఈ కేసులో తోట త్రిమూర్తులుతోపాటు ఆరుగురు నిందితులకు 18 నెలల జైలు శిక్ష, రెండున్నరలక్షల రూపాయల జరిమానా విధించింది.

ఏపీలో ఎన్నికల వేళ శిరోముండనం కేసు తీర్పు హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఈ కేసు తీర్పుపై రాజకీయ పార్టీలు స్పందించేందుకు జంకుతున్నాయి. ప్రస్తుతం తోట త్రిమూర్తులు వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు, పోనీ టీడీపీ నుంచి ఆరోపణలు వినపడతాయని అనుకున్నా.. ఘటన జరిగినప్పుడు టీడీపీయే అధికారంలో ఉంది, చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి. దీంతో రెండు పార్టీలు ఈ వ్యవహారంపై గుంభనంగానే ఉన్నాయి. అయితే త్రిమూర్తులుకి జైలుశిక్ష పడటంతో ఆయన అభ్యర్థిత్వంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సస్పెన్స్ గా మారింది.

First Published:  16 April 2024 10:26 AM GMT
Next Story