Telugu Global
Andhra Pradesh

మమ్మల్ని తిట్టడం కాదు.. మోదీని కూడా తిట్టండి ప్లీజ్

మోదీని కూడా కలిపి తిడితేనే టీడీపీ కడుపుమంట చల్లారుతుందేమోనని వైసీపీ నుంచి సెటైర్లు పడటం ఇక్కడ కొసమెరుపు.

మమ్మల్ని తిట్టడం కాదు.. మోదీని కూడా తిట్టండి ప్లీజ్
X

"చంద్రబాబు రాజకీయ వికలాంగుడు, అందుకే ఊత కర్ర(పొత్తు)లపై ఆయన ఆధారపడతా"రంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు టీడీపీకి బాగానే మంటపెట్టాయి. చంద్రబాబుని రాజకీయ వికలాంగుడిగా పేర్కొనడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తాము పొత్తులు పెట్టుకున్నాం సరే, తమతో పొత్తు పెట్టుకున్న ప్రధాని మోదీ కూడా వికలాంగుడేనా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. చంద్రబాబుని తిట్టడం కాదు, మోదీని కూడా తిట్టండని అంటున్నారాయన. మోదీని కూడా కలిపి తిడితే టీడీపీ కడుపుమంట చల్లారుతుందేమోనని వైసీపీ నుంచి సెటైర్లు పడటం ఇక్కడ కొసమెరుపు.

మా పొత్తులు కనిపించేవి..

సింహం సింగిల్ గానే వస్తుందని చాన్నాళ్లుగా చెబుతున్నారు వైసీపీ నేతలు. పొత్తులు తమకు అవసరం లేదని తమకి ప్రజలతోనే పొత్తులని చెబుతూ వచ్చారు. తమకి వ్యతిరేకంగా ఎవరెన్ని కూటములు కట్టినా తమకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. వారు అన్నట్టుగానే కాస్త ఆలస్యంగా అయినా టీడీపీ-బీజేపీ-జనసేన ఒక్కటయ్యాయి. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఒక్కటే పోటీ చేస్తోంది. అయితే తమ పొత్తులు బయటకు కనిపించేవని, వైసీపీ పొత్తులు ఎవరికీ కనిపించనివి అని విమర్శిస్తున్నారు అచ్చెన్నాయుడు. మాఫియాల పొత్తు లేకుండా వైసీపీ రంగంలోకి దిగగలదా అని ప్రశ్నించారాయన.

పార్టీలేదు బొక్కాలేదు అంటూ ఆఫ్ ది రికార్డ్ చెప్పే అచ్చెన్న, మైకుల ముందుకొస్తే 120 స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయం అంటారు. అలాంటి అచ్చెన్నాయుడు ఇప్పుడు వైసీపీ విమర్శలకు బదులిస్తుంటే మరింత కామెడీగా ఉందని అంటున్నాయి వైరి వర్గాలు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిని అని చెప్పుకోవడం మినహా, పార్టీలో ఆయనకు విలువ లేదని ఎద్దేవా చేస్తున్నారు వైసీపీ నేతలు.

First Published:  20 March 2024 10:28 AM GMT
Next Story