బాబు నోరు తెరిస్తే అబ‌ద్దాలు, మోసం

 ప్ర‌చారం కోసం ఎంత‌కైనా దిగ‌జార‌తాడు —రైతు భ‌రోసా యాత్ర‌లో జ‌గ‌న్ విమర్శ‌లు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మరో మారు విరుచుకుప‌డ్డారు. బాబు నోరు తెరిస్తే అబ‌ద్దాలేన‌ని, మాట్లాడేదంతా మోస‌మేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప‌బ్లిసిటీ కోసం చంద్ర‌బాబు ఎంత‌కైనా దిగ‌జార‌తాడ‌ని, ప‌బ్లిసిటీ వ‌స్తుందంటే ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌రైతుల‌కు ఐదుల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తానంటాడ‌ని లేదంటే అస‌లు ఆత్మ‌హ‌త్య‌లే జ‌ర‌గ‌లేద‌ని అంటాడ‌ని ఎద్దేవా చేశారు. మూడో విడ‌త రైతు భ‌రోసా యాత్ర సంద‌ర్భంగా అనంత‌పురం జిల్లాలోని శెట్టూరు మండ‌ల కేంద్రంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడారు. ప్ర‌చారం కోసం చంద్ర‌బాబు ఎంత‌కైనా దిగ‌జార‌తాడ‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. చివ‌ర‌కు ప్ర‌చారం కోసం ఎంత‌లా దిగ‌జారాడంటే.. పుష్క‌రాలు గొప్ప‌గా చేశార‌ని చెప్పుకునేందుకు షార్ట్‌ఫిల్మ్ తీసి 29 మందిని పొట్ట‌న‌పెట్టుకున్నార‌ని అన్నారు. రైతులు, డ్వాక్రా అక్క‌చెల్లెమ్మ‌ల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తాన‌ని ఎన్నిక‌ల ముందు చెప్పిన చంద్ర‌బాబు ఆ త‌ర్వాత రైతుల‌ను, మ‌హిళ‌ల‌ను మోసం చేశార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. చంద్ర‌బాబు చెప్పిన అబద్దాలు, చేసిన మోసాల వ‌ల్లే రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని అసెంబ్లీలో తాము గ‌ట్టిగా వాదించామ‌ని, కానీ చంద్ర‌బాబు త‌మ‌ను అవ‌హేళ‌న చేశార‌న్నారు. “రాష్ట్రంలో రైతులంతా సుఖ‌సంతోషాల‌తో ఉన్నార‌ని, త‌న‌కు శాలువాలు క‌ప్పుతున్నార‌ని ఆయ‌న చెప్పుకున్నారు. కానీ జ‌రుగుతున్న‌దేమిటి?  బాబు చెప్పిన మాట‌లు న‌మ్మి రైతులు రుణాలు చెల్లించ‌లేదు. అందుకే ఇవాళ రైతుల‌కు రుణాలు రెన్యువ‌ల్ కాలేదు. కొత్త రుణాలు రావ‌డం లేదు. ఇన్సూరెన్స్ కూడా కోల్పోయారు.” అన్నారు. “రుణ‌మాఫీ చేస్తాన‌ని రైతుల‌ను, డ్వాక్రా మ‌హిళ‌ల‌ను మోసం చేసిన‌ట్లే ఇంటికో ఉద్యోగం ఇస్తాన‌ని నిరుద్యోగుల‌ను మోసం చేశాడు. ఉద్యోగం వ‌చ్చేవ‌ర‌కు నిరుద్యోగ భృతి ఇస్తాన‌న్నాడు. కానీ వారినీ మోస‌పుచ్చాడు. త‌మ‌ను మోసం చేసిన చంద్ర‌బాబును రాళ్ల‌తో కొడ‌తామ‌ని చెప్పాలి” అని పిలుపునిచ్చారు. అనంత‌రం శెట్టూరు మండ‌లంలో ఇటీవ‌ల అప్పుల బాధ‌తో మృతి చెందిన కైరేవు గ్రామ రైతు పెద్ద‌నాగ‌ప్ప కుటుంబ సభ్యుల‌ను జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. అధైర్య‌ప‌డొద్ద‌ని, త‌ప్ప‌కుండా న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని వారికి భ‌రోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here