Telugu Global
Cinema & Entertainment

ఈ స్టార్ కూడా కొత్త 007 కాదా? ఐతే టార్చరే!

కొత్త జేమ్స్ బాండ్ 007 రేసులో ఆరోన్ టేలర్-జాన్సన్ ఫేవరెట్‌ స్టార్ గా దాదాపు ఖరారైనట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో మరొక బ్రిటిష్ నటుడు ఉన్నట్టుండి ఈ ఐకానిక్ పాత్రని ఆరోన్ నుంచి లాక్కోగలడని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఈ స్టార్ కూడా కొత్త 007 కాదా? ఐతే టార్చరే!
X

కొత్త జేమ్స్ బాండ్ 007 రేసులో ఆరోన్ టేలర్-జాన్సన్ ఫేవరెట్‌ స్టార్ గా దాదాపు ఖరారైనట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో మరొక బ్రిటిష్ నటుడు ఉన్నట్టుండి ఈ ఐకానిక్ పాత్రని ఆరోన్ నుంచి లాక్కోగలడని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. గత మూడు సంవత్సరాలుగా కొత్త జేమ్స్ బాండ్ పాత్రధారి ఎంపిక వ్యవహారం కొలిక్కిరావడంలేదు. చివరి జేమ్స్ బాండ్ సినిమా ‘నో టైమ్ టు డై’ 2021 లో విడుదలైంది. అప్పటికి ఈ పాత్ర పోషిస్తూ వచ్చిన డేనియల్ క్రేగ్ 56 ఏళ్ళ వయస్సులో ఈ పాత్ర నుంచి రిటైర్మెంట్ తీసుకోగా, కొత్త యువ బాండ్ ఎవరా అని నిర్మాతలు అన్వేషణలో పడ్డారు. 2006 లో ‘కేసినో రాయల్’ నుంచీ 2021 లో ‘నో టైమ్ టు డై’ వరకూ 15 ఏళ్ళు బాండ్ గా కొనసాగిన క్రేగ్, 6 బాండ్ సినిమాలు నటించాడు.

ఈ నేపథ్యంలో అనేక వడపోతల తర్వాత గత నెల కొత్త 007 గా 33 ఏళ్ళ ఆరోన్ పేరు ఖరారైనట్టు విన్పించింది. కానీ ఇప్పుడు 34 ఏళ్ళ బ్రిటిష్ నటుడు టరన్ ఎగర్టన్ పేరు విన్పిస్తోంది. అయితే బాండ్ సినిమాల ప్రొడక్షన్ బ్యానర్ ఇయోన్ నుంచి గానీ, లేదా ఇయోన్ అధినేత్రి బార్బరా బ్రోకలీ నుంచిగానీ ఎలాటి ధృవీకరణ వెలువడ లేదు.

మార్వెల్ బ్యానర్ బ్లాక్‌బస్టర్ ‘ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’, ‘డార్క్లీ కామెడీ కిక్-యాస్’ మూవీ సిరీస్‌లు సహా - ఆరోన్ సక్సెస్ ఫుల్ యాక్షన్ హీరోగా నిరూపించుకున్నప్పటికీ, కొత్త బాండ్ ఎంపికలో టారన్ నుంచి గట్టి పోటీని ఎదుర్కోవచ్చని తెలుస్తోంది. ఇతను ‘కింగ్స్ మాన్’ అనే ధారావాహికలో గూఢచారిగా నటించాడు. ‘రాకెట్‌ మాన్’ పేరుతో ఓ గాయకుడి బయోపిక్‌లో నటించి కూడా మెప్పుపొందాడు.

ఇలావుండగా, కొత్త బాండ్ ఎవరనే దానిమీద జోరుగా బెట్టింగులు సాగాయి. ఆరోన్ ఇప్పటికే 007 గా ఖరారైనట్టు వార్తలు రావడంతో, బెట్టింగ్స్ ని నిలిపివేస్తున్నట్లు బెట్టింగ్ నిర్వాహకులు ప్రకటించారు. ఇప్పుడు టరన్ ఎగర్టన్ పేరు బయటికి రావడంతో మళ్ళీ మొదటికొచ్చింది.

1962 లో మొదటి బాండ్ సినిమా 'డాక్టర్ నో' నుంచీ 2021 లో చివరి సినిమా 'నో టైమ్ టు డై'వరకూ నిర్మించిన మొత్తం పాతిక సినిమాల్లో జేమ్స్ బాండ్ 007 గా వరుసగా సీన్ కానరీ, డేవిడ్ నివెన్, జార్జ్ లాజెన్‌బీ, రోజర్ మూర్, టిమోతీ డాల్టన్, పియర్స్ బ్రాస్నన్, డేనియల్ క్రేయిగ్ నటించారు. జేమ్స్ బాండ్ సృష్టికర్త, నవలా రచయిత ఇయాన్ ఫ్లెమింగ్ నుంచి నిర్మాతలు ఆల్బర్ట్ ఆర్. బ్రోకలీ, హ్యారీ సాల్జ్ మన్ లు 1961లో బాండ్ సిరీస్ సినిమాల హక్కులు పొందారు. ఇయాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో25 సినిమాలు నిర్మించారు. 1996 లో ఆల్బర్ట్ బ్రోకలీ మృతి తర్వాత ఆయన కుమార్తె బార్బరా బ్రోకలీ బాధ్యతలు చేపట్టింది. ఆరోన్ తో బాటు మరో 25 మంది నటుల్ని క్షుణ్ణంగా పరిశీలించింది బార్బరా. ఇందులో నల్లజాతి నటుడు ఇడ్రీస్ ఎల్బా కూడా వున్నాడు.

అయితే 2021లో డేనియల్ క్రెయిగ్ నిష్క్రమణ తర్వాత ఆరోన్ టేలర్- జాన్సన్ సీక్రెట్ ఆడిషన్స్ కోసం నిర్మాతల్ని కలుసుకున్నాడనీ, పాస్ మార్కులు పడ్డాయనీ లీకులు వచ్చాయి. ఇప్పుడు టరన్ ఎగర్టన్ పైకొచ్చి లీకుల్ని చాలెంజీ చేస్తున్నాడు.

కొత్త బాండ్ ఎవరనేది ఇంకా ప్రశ్నగానే వుంటే, 26 వ బాండ్ మూవీ ఏమిటనేది కూడా తేలలేదు. కథ, దర్శకుడు, హీరోయిన్ ఏదీ కూడా ఫైనల్ కాలేదు. అయితే కొత్త బాండ్ మూవీ 2025 కల్లా విడుదలవుతుందని 2022 లో ప్రకటించారు. కానీ ఇంతవరకూ న్యూ బాండ్ ఎవరనేది సహా ఏదీ కార్యరూపం దాల్చలేదు. అంటే 2025 లో విడుదల సందేహమే.

ఇప్పుడు ప్రేక్షకులకి ఒక ఫాలో కా దగ్గ యాక్షన్ హీరో పాత్రలేదు. మార్వెల్ సిరీస్ సినిమాల్లో ఎవరెవరో ఒక సినిమా యాక్షన్ హీరోగా వచ్చి వెళ్ళిపోతున్నారు. వెండితెర దైవాలుగా కొలవడానికి ఒక రాంబో, ఒక జేమ్స్ బాండ్ వంటి స్టాండర్డ్ యాక్షన్ హీరో పాత్ర లేని లోటు తీవ్రంగా అనుభవిస్తున్నారు ప్రేక్షకులు. దీన్ని దృష్టిలో పెట్టుకుని త్వరగా కొత్త బాండ్ ని తేల్చుకుని, 26 వ జేమ్స్ బాండ్ మూవీ టైటిలైనా కనీసం ప్రకటిస్తారని, ప్రేక్షకులకి ఈ టార్చర్ నుంచి విముక్తి కలిగిస్తారనీ ఆశిద్దాం!

First Published:  22 April 2024 9:12 AM GMT
Next Story