Telugu Global
Cinema & Entertainment

Ashtadigbandhanam Movie Review : అష్ట దిగ్బంధనం- రివ్యూ {2/5}

Ashtadigbandhanam Movie Review : సస్పెన్స్ థ్రిల్లర్లు తీయాలంటే కోర్సులు చదువుకుని రావాలి. అప్పుడే ప్రేక్షకుల్ని దిగ్బంధించి బాక్సాఫీల్ని నింపుకోగలరు. లేకపోతే ఆ ప్రేక్షకుల్ని బోనెక్కించడమే అవుతుంది. ‘అష్టదిగ్బంధనం’ తో ఇదే జరిగింది. ఎలా జరిగిందో చూద్దాం...

Ashtadigbandhanam Movie Review : అష్ట దిగ్బంధనం- రివ్యూ {2/5}
X

రచన-దర్శకత్వం : బాబా పిఆర్

తారాగణం : సూర్య భరత్ చంద్ర, విషిక, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోషినీ రజాక్ తదితరులు

సంగీతం : జాక్సన్ విజయన్

ఛాయాగ్రహణం : బాబు కె

నిర్మాత: మనోజ్ కుమార్ అగర్వాల్

విడుదల : సెప్టెంబర్ 22, 2023

2/5

ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ల‌ కాలం నడుస్తోంది. ఇవి ఎవరి దృష్టినీ ఆకర్షించక వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు ‘అపరిచితులు’, ‘అన్వేషణ’ లాంటి సస్పెన్స్ థ్రిల్లర్లు తీస్తే వారాలకి వారాలు ఆడేవి. అలాటిది ఇప్పుడు విషయం చెప్ప‌డం రాక‌ బి గ్రేడ్ సినిమాలుగా రెండో రోజే అదృశ్యమైపోతున్నాయి. ఇలా వెళ్ళిపోవడానికి వచ్చిన ఇంకో సస్పెన్స్ థ్రిల్లర్ ‘అష్టదిగ్బంధనం’. సస్పెన్స్ థ్రిల్లర్లు తీయాలంటే కోర్సులు చదువుకుని రావాలి. అప్పుడే ప్రేక్షకుల్ని దిగ్బంధించి బాక్సాఫీల్ని నింపుకోగలరు. లేకపోతే ఆ ప్రేక్షకుల్ని బోనెక్కించడమే అవుతుంది. ‘అష్టదిగ్బంధనం’ తో ఇదే జరిగింది. ఎలా జరిగిందో చూద్దాం...

కథ

శ్రీరాములు(విశ్వేందర్ రెడ్డి) ప్రజా సంక్షేమ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు. ఇతడి దగ్గర ఇద్దరు రౌడీ షీటర్లు శంకర్ గౌడ్(మహేష్ రావుల్), నర్సింగ్ గౌడ్(గగన్ రవి) పని చేస్తూంటారు. వచ్చే ఎన్నికల్లో నర్సింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని శ్రీరాములు చెప్తాడు. తోటి రౌడీ షీటర్‌కి టికెట్ ఇస్తుంటే శంకర్ ఇగో దెబ్బతింటుంది. తను కూడా పోటీ చేస్తానని శ్రీరాములుతో చెప్తాడు. అయితే రూ.50 కోట్లు ఇస్తే టికెట్ ఇస్తానంటాడు శ్రీరాములు.

మరోవైపు గౌతమ్ (సూర్య భరత్ చంద్ర) అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వుంటాడు. ఇతడి భార్య ప్రియ (విషిక)కి బ్రెయిన్ ట్యూమర్ వుందని తెలియడంతో గౌతమ్ కంగారు పడతాడు. ట్రీట్‌మెంట్‌కి కోటి రూపాయలు కావాలి. ఇలావుండగా, శంకర్ గౌడ్ రూ.50 కోట్ల కోసం బ్యాంకు దోపిడీ పథకం వేస్తాడు. ఇతడి నుంచి డబ్బు ఆఫర్ చేస్తూ గౌతమ్‌కి ఫోన్ వస్తుంది. ఆ డబ్బు కోసం గౌతమ్ బ్యాంకు దోపిడీ పథకంలో భాగమై ఇరుక్కు పోతాడు. బయట పడాలంటే చాలా చిక్కు ముళ్ళుంటాయి. ఇందులోంచి ఎలా బయటపడ్డాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఈ సినిమాతో పాటే విడుదలైన ‘సప్త సాగరాలు దాటి’ లాంటి కాన్ఫ్లిక్ట్ తో ఉన్న కథే ఈ సినిమా కూడా. ‘సప్త సాగరాలు దాటి’లో ప్రియురాలి కోరిక తీర్చడం కోసం చేయని నేరాన్ని మీదేసుకుని జైలుకెళ్ళి ఇరుక్కుంటే, ప్రస్తుత సినిమాలో భార్య ట్రీట్ మెంట్ డబ్బుల కోసం బ్యాంకు దోపిడీకి ఒప్పుకుని జైల్లో ఇరుక్కుంటాడు హీరో. మొదటిది హ్యూమన్ డ్రామాగా తీస్తే, రెండోది సస్పెన్స్ థ్రిల్లర్ గా తీశారు.

1974లో అమితాబ్ బచ్చన్‌తో తీసిన ‘మజ్బూర్’ లో సామాన్యుడైన అమితాబ్‌కి బ్రెయిన్ ట్యూమర్ వుంటుంది. ఆరు నెలల్లో చనిపోయే ప్రమాదముంటుంది. తాను చనిపోతే కుటుంబం అనాథ అవుతుంది. అందుకని రూ.5 లక్షలు తీసుకుని ఒక చేయని హత్య మీదేసుకుని జైలుకు వెళ్తాడు. డబ్బు కుటుంబానికి అందిస్తాడు. కోర్టులో ఉరి శిక్ష పడుతుంది. ఎలాగూ బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయే వాడే కాబట్టి ఉరి శిక్షకి సిద్ధపడే వచ్చాడు. అయితే ట్యూమర్ సీరియస్ కావడంతో డాక్టర్లు సర్జరీ చేస్తే బతికి పోతాడు. బతికిపోయాక బతకాలన్న ఆశ పుడుతుంది. కానీ ఊరి శిక్ష పడింది. ఇప్పుడెలా?

దీన్నే 1976లో కె.రాఘవేంద్రరావు శోభన్ బాబుతో ‘రాజా’గా రీమేక్ చేస్తే ఇదీ హిట్టయ్యింది. ఇందులో హ్యూమన్ డ్రామా వుంది. ఉరిశిక్ష అనే చావుబతుకుల పతాక స్థాయి విజువల్ కాన్ఫ్లిక్ట్ వుంది. ‘మేరీ జంగ్’ (1985)లో లాయర్‌గా అనిల్ కపూర్ ఒక విషపూరిత ఇంజెక్షన్ కేసులో హత్యలో ఇరుక్కున్న లేడీ డాక్టర్‌ని కాపాడేందుకు తన ప్రాణాల్నే పణంగా పెట్టేస్తాడు. ఆ ఇంజెక్షన్ విషపూరితం కాదని నిరూపించడానికి కోర్టులో ఆ ఇంజెక్షన్‌ని తాగేస్తాడు. ఇది కూడా గొప్ప హ్యూమన్ డ్రామా.

‘సప్త సాగరాలు దాటి’ హ్యూమన్ డ్రామానే కానీ ప్రాణాలతో చెలగాటం అంతటి కన్ఫ్లోక్ట్ కాదు. ఇక ప్రస్తుత సినిమా పూర్తిగా సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్ తీయాలంటే చాలా నేర్పు కావాలి. వస్తున్న సస్పెన్స్ సస్పెన్సు, థ్రిల్స్, లాజిక్కులు లేక ఫెయిలవుతున్నాయి. ఇదీ అంతే. ఫస్టాఫ్ కథని ఏర్పాటు చేసే వరకూ ఓకే, ఏం జరుగుతుందా అన్న సస్పెన్స్ వుంది. కానీ ఏర్పాటు చేసిన కథని సెకండాఫ్‌లో నడపడంలో పూర్తిగా విఫలమయ్యారు. అష్టదిగ్బంధనంలోంచి హీరో బయట పడేందుకు అల్లిన కథ తగిన నేర్పు లేక తేలిపోయింది. ఇదే హ్యూమన్ డ్రామా చుట్టూ వుంటే ‘సస్పెన్స్ థ్రిల్లర్ నడపలేని దర్శకుడి లోపం బయట పడేది కాదు. హ్యూమన్ డ్రామాకి కూడా ఒక అడ్డంకి వుంది. బ్యాంకు దోపిడీ సొమ్ముతో భార్యని బతికించుకోవాలనుకున్నాడు. తనని ఎలాంటి సొమ్ముతో బతికించాడో తెలిస్తే భార్య పరిస్థితి ఏంటి? ‘మజ్బూర్’ లో, ‘మేరీజంగ్’ లో ఈ నైతిక ప్రశ్న ఎదురు కాదు. అమితాబ్, అనిల్ కపూర్‌లు డబ్బుకోసం నేరం చేయలేదు. అమితాబ్ డబ్బు కోసం చేయని నేరం మీదేసుకుంటే, అనిల్ కపూర్ డాక్టర్‌ని కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టాడు.

ఇంకోటేమిటంటే, ప్రస్తుత కథకి చెప్పిన సూక్తి హీరో గురించి కాదు, విలన్ల గురించి. విలన్లు ఎలా పోతే ఎవరిక్కావాలి. ‘యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది. ఈ యుద్ధం రాజ్యం కోసమే. రాణి కోసమో, అధికారం కోసమో కాదు. అహంతో... అహంతో మొదలైన యుద్ధం ఆ అహం దేహాన్ని వీడినప్పుడు ముగుస్తుంది’ అని ట్రైలర్‌లో చెప్పేశారు. ఈ అహం- ఇగో రౌడీ షీటర్ శంకర్ ది. అందుకని ఇది వాడి కథ, హీరో కథ కాదు. పైగా కథ ఎలా ముగుస్తుందో సూక్తి ద్వారా ట్రైలర్‌లో చెప్పేశారు!

నటనలు -సాంకేతికాలు

హీరోగా భరత్ చంద్ర యాక్షన్ పార్టులో, డైలాగ్ పార్టులో ఈజ్‌తో చేసుకుపోయాడు. సంతోష్ శోభన్ లాంటి ఈజ్, టాలెంట్ పుష్కలంగా వున్నాయి. అయితే సినిమాల్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోకపోతే సంతోష్ శోభన్ లాంటి పరిస్థితే ఎదురవుతుంది. హీరోయిన్ విషిక గ్లామర్‌ని అరబోస్తూ నటించింది. పాత్ర కిచ్చిన ట్విస్ట్‌ బావుంది. శంకర్‌గా మహేష్ రావూల్, శ్రీరాములుగా విశ్వేందర్ రెడ్డి రాజకీయ విలనిజాన్ని నిలబెట్టుకున్నారు. ఇంకా చాలా సహాయ పాత్రలున్నాయి. ఆ నటులు పెద్దగా ప్రభావం చూపరు.

సంగీతం, ఛాయాగ్రహణం ఓ మోస్తరుగా వున్నాయి. ప్రొడక్షన్ విలువలు పరిమిత బడ్జెట్‌కి తగ్గట్టుగా వున్నాయి. దర్శకుడు బాబా స్క్రిప్టు మీద బాగా వర్క్ చేసి వుంటే లోపాలు తొలగించుకుని ఒక సాఫీ కథని అందించగల్గే వాడు. ట్విస్ట్‌ మీద ట్విస్ట్‌ పెట్టి హడావిడి చేసినంత మాత్రాన కథ అన్పించుకోదు, ఎన్ని ఎక్కువ ట్విస్టులుంటే అంత ఎక్కువ తెలివి ప్రదర్శిస్తున్నట్టు తెలిసిపోతాడు. ఇన్ని ట్విస్టులు చీప్ టేస్టు కూడా. ‘అష్టదిగ్బంధనం’ అనే టైటిల్ మాత్రం పవర్‌ఫుల్‌గా వుంది. దీంతో సస్పెన్స్ థ్రిల్లర్ తీయడానికి ఇంకా చాలా అనుభవం అవసరం!

First Published:  23 Sep 2023 12:21 PM GMT
Next Story