Telugu Global
Cinema & Entertainment

సౌత్ లో పీవీఆర్ - ఐనాక్స్ స్క్రీన్ ల విస్తరణ!

మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్- ఐనాక్స్ 170 కొత్త స్క్రీన్స్ ని తెరవడానికి సిద్ధమవుతోంది.

సౌత్ లో పీవీఆర్ - ఐనాక్స్ స్క్రీన్ ల విస్తరణ!
X

మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్- ఐనాక్స్ 170 కొత్త స్క్రీన్స్ ని తెరవడానికి సిద్ధమవుతోంది. రూ. 600-700 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ విస్తరణ ప్రణాళికలో ఇప్పటికే 97 స్క్రీన్స్ కి ప్రారంభోత్సవం చేసింది. వీటిలో ఐస్, 4 డీఎక్స్ వంటి అత్యాధునిక ప్రీమియం ఫార్మాట్‌లలో స్క్రీన్స్ కూడా వున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్ని కీలక అభివృద్ధి ప్రాంతాలుగా గుర్తించి, 40-45% కొత్త ఓపెనింగ్స్ నీ ప్రకటించింది.

కంపెనీ ఆర్ధిక పురోగతిని కూడా ప్రకటించింది. డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి లాభం -ఆదాయం వరుసగా రూ. 204.5 కోట్లు, రూ 4913.3 కోట్లుగా వున్నాయి. ఈ కాలంలో మొత్తం 3 కోట్ల 65 లక్షల టికెట్లు విక్రయించింది. కొన్ని సినిమాలు బాగా ఆడనప్పటికీ డిసెంబర్ 2023లో అత్యధిక వసూళ్ళు సాధించిన నెలగా నిలిచింది. హిందీ యాక్షన్ మూవీ ‘యానిమల్’ రూ. 650 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇదే నెలలో విడుదలైన ఇతర ప్రధాన సినిమాల్లో ‘సాలార్’ రూ. 480 కోట్లు, ‘డంకీ’ రూ. 270 కోట్లు, ‘సామ్ బహదూర్’ రూ. 110 కోట్లు వసూలు చేశాయి. ‘12th ఫెయిల్’, ‘సామ్ బహదూర్’ వంటి చిన్న-స్థాయి సినిమాల అనూహ్య విజయం కూడా కలిసి వచ్చింది. పోతే, అమెరికాలో హాలీవుడ్ రచయితలు, నటీనటుల సమ్మె కారణంగా ఈ త్రైమాసికంలో హాలీవుడ్ నుంచి తాజా విడుదలలు లేక బాక్సాఫీసు చిన్నబోయింది. ఈ కాలంలో సౌత్ సినిమాలు కూడా పెద్దగా విడుదల కాలేదు.

కంపెనీ సగటు టిక్కెట్ ధరలో 14% పెరుగుదల వినియోగదారులకి భారం కాదని, ప్రీమియం- లగ్జరీ సినిమా ఫార్మాట్‌లలో రేట్లని చేర్చడం వల్ల సగటు టిక్కెట్ ధర ఎక్కువగా కనిపిస్తోందని భావిస్తోంది. కాగా, ఈ సంవత్సరం షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి పెద్ద స్టార్లు తెరపై కనిపించే అవకాశం లేకపోవడంతో, అజయ్ దేవగన్ ‘మైదాన్-సింఘం ఎగైన్’ , అక్షయ్ కుమార్ ‘బడే మియాన్ చోటే మియా’ సినిమాలపై ఆధారపడాల్సి వస్తుంది.

కంపెనీ ప్రతి త్రైమాసికంలో ఎనిమిది నుంచి తొమ్మిది కొత్త నగరాలని తన పోర్ట్ ఫోలియోలో జోడిస్తూ వస్తోంది. అయితే ఒకవైపు 170 కొత్త స్క్రీన్లతో మార్కెట్లోకి ప్రవేశిస్తూనే, మరోవైపు 62 నడుస్తున్న స్క్రీన్స్ ని మూసి వేసింది. నష్టాలతో నడుస్తున్న ఈ స్క్రీన్స్ గత సంవత్సరం ప్రకటించిన 50 కంటే 12 ఎక్కువ. ఈ స్క్రీన్స్ పెద్ద నగరాల్లోనే వుండడం విశేషం. కంపెనీ లాభదాయక విస్తరణపై దృష్టి సారించడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఇటువంటి 62 స్క్రీన్స్ ని మూసివేసింది. అయితే 170 కొత్త స్క్రీన్స్ ప్రణాళికతో ముందుకు సాగుతోంది. కంపెనీ మన దేశంతో పాటు శ్రీలంకలోని 113 నగరాల్లోని 360 సినిమాల్లో 1,712 స్క్రీన్స్ ని నిర్వహిస్తోంది.

2023లో బాక్సాఫీస్ కలెక్షన్లలో మహమ్మారి ముందు వున్నఉచ్చస్థితిని అధిగమించడానికి ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఏకైక ప్రధాన మార్కెట్‌గా నిలిచింది. మన దేశ బాక్సాఫీసు 2019లో రూ. 10,948 కోట్లతో పోలిస్తే, 2023లో రూ. 12,226 కోట్లతో 12% వృద్ధిని సాధించింది. ఇతర రంగాలెలా వున్నా సినిమా రంగం మహమ్మారి తెచ్చి పెట్టిన స్లంప్ ని అవలీలగా దాటేసింది. 2023లో హిందీ బాక్సాఫీసు అన్ని కాలాలలోనూ అత్యధిక వసూళ్ళు సాధించిన 4 హిందీ సినిమాలతో గొప్పగా పూర్వవైభవం చూసింది. అంతేగా కుండా, వివిధ భాషల్లోని మధ్య స్థాయి సినిమాల విభిన్న శ్రేణి బాక్సాఫీసుకి బలమైన వనరుగా నిలిచింది.ప్రదర్శనలను ప్రదర్శించింది.

ఈ గణాంకాలు మన దేశ చలనచిత్ర పరిశ్రమకి ఆకాశమే హద్దుగా పురోభివృద్ధిని సూచిస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఈ పరిశ్రమ నుంచి మరింత గొప్పవైన, ఆకట్టుకునే ఫలితాల్ని ఆశించడానికి ఏమాత్రం సందేహపడనవసరం లేదు.

First Published:  1 Feb 2024 2:25 PM GMT
Next Story