Telugu Global
MOVIE REVIEWS

Ginna Movie Review: 'జిన్నా' - మూవీ రివ్యూ {2.5/5}

Ginna Movie Review: గాలి నాగేశ్వర రావు అలియాస్ జిన్నా (మంచు విష్ణు) అప్పు చేసి టెంట్ హౌస్ నడుపుకుంటూ వుంటాడు. అయితే పెళ్ళిళ్ళకి టెంట్ హౌస్ సామాన్లు అద్దెకిస్తూ వుంటే ఆ పెళ్ళిళ్ళు పెటాకులవుతూ వుంటాయి.

Ginna Movie Review: జిన్నా - మూవీ రివ్యూ {2.5/5}
X

దర్శకత్వం : ఇషాన్ సూర్య

తారాగణం : విష్ణు మంచు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్, నరేష్, రఘుబాబు, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తదితరులు

స్క్రీన్ ప్లే : మోహన్ బాబు, రచన : కోన వెంకట్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్ర

హణం : ఛోటా కె నాయుడు

నిర్మాత : విష్ణు మంచు

విడుదల : అక్టోబర్ 21, 202 2

రేటింగ్ : 2.5/5


గత సంవత్సరం 'మోసగాళ్ళు' నటించి, నిర్మించి భంగపడ్డ మంచు విష్ణు తిరిగి నటించి నిర్మిస్తూ 'జిన్నా' తో దీపావళికి వచ్చాడు. పూర్వం 'రెడీ', 'దేనికైనా రెడీ' లతో హిట్లు సాధించిన తను ఇక లాభం లేదన్నట్టు వాటికి దగ్గరగా వుండే కథతో ఈ కొత్త ప్రయత్నం చేశాడు. గతంలో మంచు మనోజ్ నటించిన 'కరెంటు తీగ' లో అతిధి పాత్రలో కన్పించిన సన్నీ లియోన్ ఇప్పుడు హీరోయిన్ పాత్ర పోషిస్తూ ముందుకొచ్చింది. ఇలాగే ఇంకో సెక్సీ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇంకో హీరోయిన్ గా నటించింది. ఈ కమర్షియల్ కాంబినేషన్స్ తో కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య తీసిన 'జిన్నా' ఎంత వరకు విష్ణు కెరీర్ కి తోడ్పడిందో చూద్దాం...


కథ

గాలి నాగేశ్వర రావు అలియాస్ జిన్నా (మంచు విష్ణు) అప్పు చేసి టెంట్ హౌస్ నడుపుకుంటూ వుంటాడు. అయితే పెళ్ళిళ్ళకి టెంట్ హౌస్ సామాన్లు అద్దెకిస్తూ వుంటే ఆ పెళ్ళిళ్ళు పెటాకులవుతూ వుంటాయి. దీంతో టెంట్ హౌస్ సామాన్లు చావులకి మాత్రమే ఇవ్వాలని ఆంక్షలు విధిస్తాడు సర్పంచ్ తిప్పేస్వామి (రఘుబాబు). ఈ సర్పంచ్ కుర్చీ మీద కన్నేసి వున్న జిన్నా దీనికి డబ్బు గడించే ఆలోచనతో వుంటాడు. ఈ సమయంలో జిన్నాకి చిన్నప్పట్నుంచీ తెలిసిన మూగ చెవిటి అయిన రేణుక (సన్నీ లియోన్) అమెరికా నుంచి వస్తుంది. బాగా డబ్బున్న ఈమె జిన్నాని పెళ్ళి చేసుకుంటానంటుంది. కానీ జిన్నా పచ్చళ్ళ స్వాతి (పాయల్ రాజ్ పుత్) ని ప్రేమిస్తూ వుంటాడు. రేణుక పెళ్ళి ప్రస్తావన తేవడంతో స్వాతిని వదిలేసి సర్పంచ్ కావడానికి డబ్బుకోసం రేణుకతో పెళ్ళికి సిద్ధపడతాడు.

ఇదీ విషయం. ఈ నేపథ్యంలో అనుకున్నట్టు జిన్నా రేణుకని పెళ్ళి చేసుకోగల్గాడా? సర్పంచ్ అవ్వాలనుకున్న పథకం పారిందా? ఇంతలో రేణుకని చూసి అందరూ భయపడే పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు రేణుక ఎవరు? ఆమెని పెళ్ళి చేసుకుని డబ్బు దోచుకోవాలనుకున్న జిన్నా ఏమయ్యాడు చివరికి? ఇదీ మిగతా కథ.


ఎలావుంది కథ

'రెడీ', 'దేనికైనా రెడీ' లాగే ఇది కూడా డబ్బు చుట్టూ ఎంటర్ టైన్ చేసే యాక్షన్ కామెడీ. దీనికి మోహన్ బాబు స్క్రీన్ ప్లే సమకూర్చడం ఒకెత్తు. కథ పాతదే అయినా విష్ణు పోషించిన కామెడీ పాత్ర వల్ల ఆసక్తిగా మారింది. సెకండాఫ్ లో వచ్చే ఒక ఆశ్చర్య పర్చే మలుపు సినిమాని నిలబెడుతుంది. అయితే ముగించిన విధానం హడావుడిగా వుంటూ సంతృప్తి పర్చదు. అలాగే ఫస్టాఫ్ లో కథ పరుగులు తీయకుండా ఇంటర్వెల్ వరకూ కాస్త అసహనానికే గురి చేస్తుంది. విషయానికి రావడానికి ఇంటర్వెల్ వరకూ తీసుకున్న సమయం ఎక్కువే. ఈ కథకి సస్పెన్స్ తో కూడిన సన్నీ లియోన్ పాత్రే కేంద్ర బిందువు. ఈ పాత్రతో ఇంటర్వెల్లో మలుపు కూడా ఉత్కంఠ కల్గించేదే. ఇక్కడ్నుంచీ ఈ పాత్రే సెకెండాఫ్ కి బలంగా మారుతుంది.

ఇలా పూర్తిగా మాస్ మసాలా అంశాలతో బాగా కామెడీని దట్టించి దర్శకుడు ఇషాన్ సూర్య చేసిన ప్రయత్నం మరీ అద్భుతంగాక పోయినా ఫర్వాలేదన్పించే స్థాయిలో వుంది. చాలాకాలం తర్వాత కోన వెంకట్ రచనా బలం కూడా మరోమారు కామెడీతో వినోద కాలక్షేపం అందించింది.


నటనలు- సాంకేతికాలు

మంచు విష్ణు ఎలాటి ఫోజులు, బిల్డప్పులూ ఇచ్చుకోకుండా సాధారణ గల్లీ కంత్రీ కామెడీ క్యారక్టర్ తో మంచి కాలక్షేపం అందించాడు. డబ్బు కొట్టేసే ఆలోచనతో వుండే పాత్ర కావడంవల్ల యాక్షన్ ఎక్కువ వుంది. అప్పులు చేసి తప్పించుకునే, వూరు విడిచి పారిపోయే సీక్వెన్సులు రొటీనే అయినా తన తరహా కామెడీతో లాక్కొచ్చాడు. సర్పంచ్ తో సీన్లు కూడా మామూలే. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ తో ప్రేమ సన్నివేశాలు పేలవమే. ఫస్టాఫ్ ఇలా ఒడిదుడుకులుగా లాక్కొచ్చాక, సెకండాఫ్ లో సన్నీలియోన్ తో కొత్త ప్రేమాయణం ఆమె పాత్రకున్న సస్పెన్స్ కోణంతో హుషారు తెప్పిస్తుంది. చిత్తూరు ప్రాంతంలో జరిగే ఈ కథకి చిత్తూరు యాస బాగానే మాట్లాడాడు.

సన్నీలియోన్ విషయానికొస్తే, ఫస్టాఫ్ ఇంటర్వెల్ కి ముందు ఎంట్రీ ఇచ్చాక బలహీనురాలైన మూగ చెవిటి అమ్మాయిగా సరిపోయింది గానీ, సెకండాఫ్ లో కథకి కేంద్ర బిందువైన తను ఆ బరువైన పాత్రని పోషించడంలో వెనుకబడిపోయింది. సన్నీలియోన్ హిందీ సినిమాలు చాలా నటించింది గానీ వచ్చీ రాని నటనతో ఎప్పుడూ గుర్తుండదు. కేవలం గ్లామర్ పోషణార్ధం ఆమెకి అవకాశాలిస్తున్నట్టుంది. ముగింపులో ఎమోషనల్ సీన్లు కూడా సరిగ్గా చేయలేక పోయింది.

పల్లెటూరి పచ్చళ్ళ స్వాతిగా పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ప్రదర్శిస్తూ పైపైన వుండి పోతుంది. పెద్దగా పాత్ర లేదు. కమెడియన్ చమ్మక్ చంద్ర మాత్రం చాలా కామెడీ సీన్లు నిలబెట్టాడు. అలాగే వెన్నెల కిషోర్, నరేష్, రఘుబాబుల కామెడీ కూడా వినోదమే. ఎక్కువ నవ్విస్తూ ఓ సస్పెన్స్ కథ చెప్పే ఫార్ములా బాగానే వర్కౌట్ అయింది. మాస్ ప్రేక్షకులకి చాలా కాలానికి ఒక తమదిగా చెప్పుకో దగ్గ సినిమా.

చాలా కాలం తర్వాత ఛోటా కె నాయుడు కెమెరా వర్క్ చూడొచ్చు. ఆయన స్థాయిలో బడ్జెట్ ని ధారబోసిన క్వాలిటీ వుంది. యాక్షన్ కామెడీకి కావాల్సిన టెక్నిక్ అంతా వుంది. చాలా కాలం తర్వాత అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ఫర్వాలేదు. ఇలా చాలా కాలం తర్వాత మంచు విష్ణు, కోన వెంకట్, ఛోటా కె నాయుడు, అనూప్ రూబెన్స్ సీనియర్లు ఒక చోట చేరి -తామూ ట్రెండ్ లో వున్నామనీ రుజువు చేసుకుంటూ, కొత్త దర్శకుడు ఇషాన్ సూర్య కెరీర్ కి ప్రాణం పోశారు.

చివరిగా చెప్పొచ్చేదేమిటంటే- 1994 లో సల్మాన్ ఖాన్- అమీర్ ఖాన్- కరిష్మా కపూర్- రవీనా టాండన్ లతో రాజ్ కుమార్ సంతోషీ తీసిన సూపర్ హిట్ మ్యూజికల్ కామెడీ 'అందాజ్ అప్నా అప్నా' లో, అమెరికానుంచి వచ్చే కరిష్మా కపూర్ పాత్రతో సర్ప్రైజింగ్ ట్విస్ట్ వుంటుంది. దీన్నే తీసుకుని 'జిన్నా' తీసినట్టుంది.

First Published:  22 Oct 2022 1:41 AM GMT
Next Story