Telugu Global
MOVIE REVIEWS

Rudrangi Movie Review: రుద్రంగి - మూవీ రివ్యూ! {2/5}

Rudrangi Movie Review | ‘బాహుబలి’ మాటల రచయితల్లో ఒకరైన అజయ్ సామ్రాట్ దర్శకుడుగా మారి తీసిన ‘రుద్రంగి’ 1940 లనాటి తెలంగాణ దొరల కథ. దీనికి రసమయి బాలకిషన్ నిర్మాత.

Rudrangi Movie Review: రుద్రంగి - మూవీ రివ్యూ! {2/5}
X

Rudrangi Movie Review: రుద్రంగి - మూవీ రివ్యూ! {2/5}

చిత్రం: రుద్రంగి

రచన - దర్శకత్వం: అజయ్ సామ్రాట్

తారాగణం : నటీనటులు: జగపతి బాబు, ఆశీష్ గాంధీ, గానవీ లక్ష్మణ్, మమతా మోహన్‌దాస్, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్ తదితరులు

సంగీతం: ఐస్ నావల్ రాజా

ఛాయాగ్రహణం: సంతోష్ శనమోనీ

నిర్మాత : రసమయి బాలకిషన్

విడుదల: జులై 7, 2023

రేటింగ్: 2/5

‘బాహుబలి’ మాటల రచయితల్లో ఒకరైన అజయ్ సామ్రాట్ దర్శకుడుగా మారి తీసిన ‘రుద్రంగి’ 1940 లనాటి తెలంగాణ దొరల కథ. దీనికి రసమయి బాలకిషన్ నిర్మాత. నిజాం కాలంలో తెలంగాణా దొరల సినిమా అంటే ఒకే తరహా కథలతో తీసిన సినిమాలు మెదులుతాయి. మరి ‘రుద్రంగి’ కూడా మరో ఆ తరహా కథేనా, లేక ఏమైనా తేడా గల కథా? జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించిన ఈ పీరియెడ్ తెలంగాణా మూవీ చరిత్రలోంచి నేటి కాలానికి చెబుతున్న నీతి ఏమిటి? ఇవి తెలుసుకుందాం.

కథ

దొర భీంరావు దేశ్ ముఖ్ (జగపతి బాబు) చుట్టు పక్కల ప్రజలకి టెర్రర్ లా వుంటాడు. అణిచివేసి, ప్రాణాలు తీసి, దొరతనం చెలాయిస్తూంటాడు. స్త్రీ వ్యామోహ

మెక్కువ. భార్య మీరాబాయి (విమలా రామన్) వుండగా, జ్వాలాబాయి (మమతా మోహన్ దాస్) అనే ఇంకో సంపన్నురాలిని పెళ్ళి చేసుకుని తెచ్చుకుంటాడు. ఆమె ఆడదానిగా కంటే మగవాడి ప్రతాపం చూపించే దానిలా వుండడంతో, నువ్వు ఆడదానివి కావని పక్కన పెట్టేస్తాడు. దీంతో ఆమె జీతగాడు మల్లేష్ (ఆశీష్ గాంధీ) మీద కన్నేస్తుంది. దొర మల్లేష్ మరదలి మీద కన్నేస్తాడు. ఎలాగైనా మల్లేష్ మరదలు రుద్రంగి (గానవీ లక్ష్మణ్) ని పడకలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. మల్లేష్ తిరగబడి దీన్ని అడ్డుకోవడం మొదలెడతాడు. ఇప్పుడేం జరిగిందన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

అదే అప్పటి తెలంగాణా దొరల టెంప్లెట్ కథ. ఏ 1940ల నాటి తెలంగాణా కథతో సినిమా ఎప్పుడు తీసినా ఓ దొర, అతడి దౌర్జన్యాలు, చివరికి ప్రజల చేతిలో చావు- అనే మూసలోనే వుంటాయి. టైటిల్సే తేడా తప్ప, సినిమాలన్నీ ఒకటే. నేటి తరం ప్రేక్షకులకి సమీప చరిత్ర అయిన నక్సలిజం మీద తీసే సినిమాలే కనెక్ట్ కావడంలేదు, ఇక సుదూర చరిత్ర అయిన తెలంగాణా దొరల మీద సినిమాలు కనెక్ట్ అయ్యే అవకాశమే లేదు. ఈ సినిమాల్లో ఏం యూత్ అప్పీల్, మార్కెట్ యాస్పెక్ట్ వుంటాయని యువ ప్రేక్షకులు చూస్తారు?

దొరల సినిమాల్లో దొరలకి ఏ నీతీ చెప్పడం వుండదు. ‘రుద్రంగి’ లో కూడా లేదు. ఆడవాళ్ళ మీద మీరు చేస్తున్న అత్యాచారాలు రేపు మీ వారసులు మిమ్మల్ని రోల్ మోడల్స్ గా తీసుకుని చేస్తే ముందు కాలంలో చాలా ఘోరాలు జరుగుతాయని- ఇప్పటి కాలంలో వాళ్ళ వారసుల్ని మాస్ రేపిస్టులుగా చూపిస్తూ దొరల కథలకి కలిపి చూపిస్తే - ఇప్పటి ప్రేక్షకులకి నాటి దొరల చరిత్ర మీద కుతూహల మేర్పడి కనెక్ట్ అయ్యే అవకాశముంటుంది కథ. లేకపోతే కుతూహలానికి అవకాశమే లేదు.

ఒక కామాంధుడైన దొరకి అతడి బానిస బంటు బుద్ధి చెప్పే కథ ‘రుద్రంగి’. తెలిసిపోయే రొటీన్ కథా కథనాలతో, పాత్ర చిత్రణలతో, పోరాటాలతో, భీకరమైన అరుపులతో బి సి సెంటర్ల మాస్ ప్రేక్షకుల సినిమాగా, ఇది నాటుగా కూడా వుంటుంది. అలాగే తెలంగాణా పీరియెడ్ సినిమా తీస్తూ అందులో ఇటీవల వచ్చిన కొన్ని తెలుగు సినిమాల కాపీ సీన్లే పెడితే, 1940 ల నాటి తెలంగాణా చరిత్ర అనే స్వచ్ఛతని కూడా కోల్పోయింది కథ. ‘బాహుబలి’ రచయిత నుంచి తెలంగాణా కథ ఇలా తెరకెక్కడం విచిత్రం.

నటనలు –సాంకేతికాలు

నెగెటివ్ పాత్రలో కామాంధుడైన దొరగా జగపతి బాబుకే ఈ సినిమాలో ప్రాధాన్యం. మిగతా పాత్రలు డమ్మీలు. జగపతి బాబు తానొక్కడై సినిమా మొత్తం వూపేస్తాడు ఓవరాక్షన్ విలనీతో. ఇది మాస్ కి నచ్చుతుందనుకోవచ్చు. కానీ క్లాస్ కి నచ్చాలంటే పాత్రచిత్రణ బావుండాలి. పెళ్ళి చేసుకుని తెచ్చుకున్న రెండో భార్య వచ్చీ రావడంతోనే, జగపతి బాబు శత్రువు పంపిన అనుచరుల్ని యాంజెలీనా జోలీలా మార్షల్ ఆర్ట్స్ టైపులో, టపటపా కొట్టి పడెయ్యడంతో బెదిరిపోతాడు జగపతి బాబు. నువ్వు ఆడదానివి కాదు, ఆడది మంచులా వుండాలి, కంచులా కాదని నీతులు చెప్పి దూరం పెట్టేస్తాడు.

దీంతో జగపతి బాబుది పిరికి పాత్ర అన్పిస్తుంది. చుట్టుపక్కల అంత ఉగ్రుడైన, కామాంధుడైన దొర ఓ ఆడది కంచులా వుంటే మంచులా మార్చేసి బానిసగా చేసుకోకుండా తప్పించుకుంటాడు. పైగా వూళ్ళో బలహీనురాలైన రుద్రంగి మీద కన్నేసి ప్రతాపం చూపిస్తాడు. అసలు రెండో భార్య శత్రువు అనుచరుల్ని చంపి తన ప్రాణాలు కాపాడిందన్న విషయమే మర్చిపోతాడు. పాత్ర ఇలా ఎస్టాబ్లిష్ అయ్యాక ఇక జగపతి బాబు సినిమాని ఎంత వూపేసినా బాక్సాఫీసు వూగిపోదు.

రుద్రంగి పాత్రలో కన్నడ నటి గానవీ లక్ష్మణ్ పీరియెడ్ తెలంగాణా పాత్ర రూపు రేఖలకి సరిపోయింది గ్లామర్ లేకుండా. పాత్ర ఎలా వున్నా హావభావ ప్రదర్శనతో దృశ్యాల్ని నిలబెట్టిందని చెప్పొచ్చు. కానీ బానిస బంటుగా ఆశీష్ గాంధీ ఫేసులో ఎక్స్ ప్రెషన్స్ సరిపోలేదు. బానిసగా, ఆ తర్వాత తిరగబడ్డ తెలంగాణా బిడ్డగా, అవసరానికి మించిన జగపతి బాబు మాస్ విశ్వరూపం ముందు నిలబడ లేకపోయాడు.

రెండో భార్యగా మమతా మోహన్ దాస్ ది కూడా ఓవరాక్షనే. ఆమె నటన, పలికే డైలాగులు మాస్ కోసమే. ఇక మొదటి భార్యగా విమలా రామన్ ది రెగ్యులర్ బానిస పాత్ర, నటన. బానిస బంటు ప్రేమిస్తున్న రుద్రంగి మీద కామంతో దొర, పెళ్ళి చేసుకున్న దొర దూరం పెడితే బానిస బంటు మీద కామం పెంచుకున్న రెండో భార్య- ఇలా ఇదంతా ఒక చతుర్ముఖ రంకు పురాణం.

దర్శకత్వం షాట్లు తీసే విషయంలో నిలబడింది. అయితే కొన్ని చోట్ల షాట్సు ఏ పాయింటాఫ్ వ్యూతో తీశారో అర్ధంగాదు. రెండో భార్య ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు మొదటి భార్య దిష్టి తీస్తూంటే, మధ్యలో పై నుంచి ఏరియల్ షాట్ ఎందుకు? పై నుంచి దేవుడు చూస్తున్నాడా? ఇంకో షాట్ కిటికీ చువ్వల మధ్య నుంచి తీయడమెందుకు? కిటికీ లోంచి ఎవరు చూస్తున్నారు?

రసమయి బాలకిషన్ మీద ఓ పాట వుంది. తెలంగాణా సాహిత్యంతో మిగిలిన పాటలు ఓకే. కళాదర్శకత్వం, వస్త్రాలంకరణ, సెట్స్ వగైరా పీరియెడ్ ప్రపంచంలోకి తీసికెళ్తాయి. కానీ కథ పీరియెడ్ మూడ్ లోకి తీసికెళ్ళదు. ఫస్టాఫ్ పాయింటుని ఎస్టాబ్లిష్ చేస్తూ స్పీడుగా సాగితే, ఈ మధ్య వచ్చిన చాలా సినిమాలకి లాగే సెకండాఫ్ నత్త నడక నడుస్తుంది. దొరకీ బానిసకీ తెలిసిన పోరాటమే తీరుబడిగా పోరాడుకుంటే, రెండు గంటలా 15 నిమిషాల సినిమా, 4 గంటలూ సాగుతున్నట్టు అన్పిస్తుంది.



First Published:  9 July 2023 8:54 AM GMT
Next Story