Telugu Global
Cinema & Entertainment

మరోసారి మాటమార్చిన మల్టీప్లెక్స్ లు

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎం ఏ ఐ) ఈ నెల ప్రారంభంలో సెప్టెంబర్ 16 వ తేదీ జాతీయ సినిమా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 4000 మల్టీప్లెక్సుల్లో 75 రూపాయలకే లక్ష టిక్కెట్లు విక్రయిస్తామని ప్రకటించారు.

మరోసారి మాటమార్చిన మల్టీప్లెక్స్ లు
X

మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎం ఏ ఐ) ఈ నెల ప్రారంభంలో సెప్టెంబర్ 16 వ తేదీ జాతీయ సినిమా దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా 4000 మల్టీప్లెక్సుల్లో 75 రూపాయలకే లక్ష టిక్కెట్లు విక్రయిస్తామని ప్రకటించారు. అయితే విజయవంతంగా నడుస్తున్న 'బ్రహ్మాస్త్ర' కలెక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 23ని కొత్త తేదీగా ప్రకటించారు. అంటే ఈ శుక్రవారం అన్న మాట. అయితే ఈ విషయంలో పీవీఆర్ మల్టీప్లెక్స్ సంస్థ మాట మార్చింది! తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆఫర్ లేదట!

మొన్నటి వరకూ 75 రూపాయల టికెట్లు ఎలా పొందాలో కూడా చెప్తూ వచ్చారు. ఆన్ లైన్లో బుక్ మై షోలో బుక్ చేసుకుంటే అదనంగా ఇంటర్నెట్ చార్జీలుంటాయనీ, నేరుగా థియేటర్లోనే తీసుకుంటే అదనపు ఛార్జీ లుండవనీ చెప్పుకుంటూ వచ్చారు.

ప్రధాన మల్టీప్లెక్స్ గ్రూపులు పీవీఆర్, ఐనాక్స్, సినీపొలిస్, కార్నివాల్, మీరజ్, సిటీ-ప్రైడ్, ఏషియన్, ముక్తా ఏ2 మొదలైవి ఈ ఈవెంట్ లో పాల్గొంటాయని ఎం ఏ ఐ ధృవీకరించింది. మూవీ టైమ్, వేవ్ సినిమాస్, ఎం2కే, డిలైట్ లు కూడా ఈ పండగలో చేయి కలిపాయి.

తీరా ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. తెలుగు రాష్ట్రాల్లో, కేరళలోని కొచ్చి, మరి కొన్ని ఇతర రాష్ట్రాల్లోని నగరాల్లో 75 రూపాయల ఆఫర్ లేదట. అంటే ఈ చోట్లలో జాతీయ సినిమా దినోత్సవం వుండదు. కారణం తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 23 శుక్రవారం మూడు సినిమాలు విడుదల కావడం! ఈ ప్రకటన చేసింది పీవీఆర్ గ్రూపు.

పీవీఆర్ గ్రూపునే ఫాలో అయి ఇతర గ్రూపులూ ఇదే నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం అల్లూరి, కృష్ణ వ్రింద విహారి, దొంగలున్నారు జాగ్రత్త మూడు కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ కారణంగా ఆఫర్ ఎత్తేశారు. ఈ సినిమాలకి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. టికెట్ రేట్లలో మార్పు లేదు.

హిందీలో స్వర భాస్కర్ నటించిన 'జహా చార్ యార్' 23 నే విడుదలవుతోంది. దీని నిర్మాతలు 75 రూపాయలకే టికెట్టు ధర ప్రకటించి పండగలో పాల్గొంటున్నారు. తెలుగు నిర్మాతలు కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలని ఎవరూ కోరడం లేదు. ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు విడుదలవుతూనే వుంటాయి. ఇది గ్రహించకుండా ఎం ఏ ఐ సెప్టెంబర్ 23 న జాతీయ సినిమా దినోత్సవం నిర్వహించడ మేమిటి? వారాంతపు రోజులు కాకుండా మంగళ, బుధ, గురువారాల్లో ఒక రోజు నిర్వహించ వచ్చు కదా? 'బ్రహ్మస్త్ర' కలెక్షన్స్ కోసం ముందు ప్రకటించిన 16 వ తేదీ రద్దు చేసి, సెప్టెంబర్ 23 కొత్త తేదీ ప్రకటించారు. ఇప్పుడు దీనికీ మొండి చెయ్యి చూపిస్తున్నారు.

అమెరికా, బ్రిటన్, గల్ఫ్ దేశాల్లో నిర్వహించిన జాతీయ సినిమా దినోత్సవం చూసి మన దేశంలో ప్రవేశ పెట్టారు. కోవిడ్ మహమ్మారితో మూతబడ్డ థియేటర్లు విజయవంతంగా పునఃప్రారంభం కావడానికి గుర్తుగా ఈ దినోత్సవమనీ, అంతేగాక ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్తూ వారి గౌరవార్ధం ఈ వేడుకని జరుపుతున్నట్టు మల్టీప్లెక్స్ యాజమాన్యాలు ఈ దినోత్సవం దీని వెనుక ఉద్దేశాన్ని స్పష్టం చేశాయి కూడా. అమెరికాలో ఎలాంటి గుంజాటన లేకుండా ప్రకటించిన సెప్టెంబర్ 3 నే - అంటే శనివారం జరిపారు. వారాంతంలో కొత్త సినిమాలు విడుదలైనా ప్రకటించిన తేదీ నుంచి వెనక్కి తగ్గలేదు. ఇదీ థియేటర్ వ్యాపారాన్ని తిరిగి అదరిస్తున్న ప్రేక్షకుల పట్ల కృతజ్ఞత అంటే!

అంతేగానీ కలెక్షన్లు దెబ్బతింటాయని ఇచ్చిన ఆఫర్లు వెనక్కి తీసుకున్నప్పుడు గొప్ప ఆదర్శాలు ప్రకటించుకోవడంలో అర్ధం లేదు. తమ పట్ల కృతజ్ఞత తెలుపుకోక పోయినా ప్రేక్షకులు మల్టీప్లెక్స్ గ్రూపుల ఆదాయానికి లోటు లేకుండా జేబు నుంచి తీసి అందిస్తూనే వుంటారు.

First Published:  19 Sep 2022 7:19 AM GMT
Next Story