Telugu Global
Cinema & Entertainment

విడాకుల రూమర్లకు సూర్య- జ్యోతిక ఫుల్ స్టాప్

జ్యోతికతో కలిసి మంచు కొండల్లో ఆస్వాదిస్తున్న సూర్య ఫోటోలను చూసిన ఫ్యాన్స్ వారిద్దరూ విడిపోవడం లేదంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.

విడాకుల రూమర్లకు సూర్య- జ్యోతిక ఫుల్ స్టాప్
X

కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య- జ్యోతిక జంట స్వీట్ కపుల్ గా పేరు తెచ్చుకుంది. వీరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి 2006లో పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా మెలిగే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత జ్యోతిక చాలా ఏళ్ళు సినిమాలకు దూరం అయింది. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక వరుసగా సినిమాలు చేస్తోంది.

పెళ్లయినప్పటి నుంచి సూర్య దంపతులు చెన్నైలోనే ఉంటున్నారు. అయితే కొన్ని నెలల కిందట జ్యోతిక సడన్ గా తన మకాం ముంబై కి మార్చింది. పిల్లల్ని కూడా అక్కడి స్కూల్లో చేర్పించింది. జ్యోతికకు, హీరో సూర్య తండ్రి శివకుమార్ కు మధ్య విభేదాలు వచ్చాయని..అందువల్లే ఆమె ముంబైకి వెళ్లిపోయినట్లు ప్రచారం జరిగింది.

అయితే మొదట్లో సూర్య అప్పుడప్పుడు ముంబైకి వెళ్లి కుటుంబంతో కొన్నాళ్లు ఉండి మళ్లీ చెన్నైకి వచ్చేవాడు. అయితే వరుసగా సినిమాలు ఒప్పుకున్న సూర్య ఇటీవల ముంబైకి వెళ్లలేదు. దీంతో సూర్య - జ్యోతిక త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు రావడం మొదలైంది.

ఈ ప్రచారం ఎక్కువ కావడంతో ఇటీవల జ్యోతిక స్పందించింది. పిల్లల చదువు కోసం ముంబైకి వచ్చామని, అలాగే తాను కూడా వరుసగా హిందీ సినిమాలు ఒప్పుకోవడం వల్ల ఇక్కడే ఉండాల్సి వస్తోందని చెప్పింది. తన తల్లికి కూడా ఆరోగ్యం బాగాలేదని వివరించింది. అంతేకానీ తనకు, సూర్యాకు మధ్య ఎటువంటి వివాదం లేదని తెలిపింది.

అయితే జ్యోతిక క్లారిటీ ఇచ్చినప్పటికీ విడాకుల ప్రచారం మాత్రం ఆగలేదు. రెగ్యులర్ గా సూర్యతో కలిసి ఉండే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే జ్యోతిక నెలల తరబడి ఒక్క ఫోటో కూడా పోస్ట్ చేయకపోవడంతో సూర్య - జ్యోతిక విడాకులు తీసుకోవడం నిజమే..అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఈ వార్తలు మరీ ఎక్కువయ్యాయి.

అయితే ఈ ప్రచారానికి ఒకే ఒక్క పోస్ట్ తో జ్యోతిక చెక్ పెట్టింది. తాజాగా జ్యోతిక ఇన్ స్టా గ్రామ్ పేజీలో ఓ వీడియో పోస్ట్ చేసింది. సూర్యతో కలిసి వెకేషన్ కు ఫిన్ ల్యాండ్ కు వచ్చినట్లు పేర్కొంది. ఫిన్ ల్యాండ్ లోని మంచు కొండల్లో జ్యోతిక - సూర్య ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. జ్యోతికతో కలిసి మంచు కొండల్లో ఆస్వాదిస్తున్న సూర్య ఫోటోలను చూసిన ఫ్యాన్స్ వారిద్దరూ విడిపోవడం లేదంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. విడాకులపై ఇన్ని రోజులు అసత్య ప్రచారం చేసిన వారికి జ్యోతిక ఒక పోస్ట్ తో చెక్ పెట్టిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


First Published:  30 Jan 2024 3:02 PM GMT
Next Story