Telugu Global
Cinema & Entertainment

పీవీ ఆర్- ఐనాక్స్ తో మలయాళం నిర్మాతల పేచీ ఏమిటి?

మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ తో కేరళ ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేచీ ఓ కొలిక్కి వచ్చినట్టే కన్పిస్తోంది.

పీవీ ఆర్- ఐనాక్స్ తో మలయాళం నిర్మాతల పేచీ ఏమిటి?
X

మల్టీప్లెక్స్ దిగ్గజం పీవీఆర్ ఐనాక్స్ తో కేరళ ఫిలిమ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ పేచీ ఓ కొలిక్కి వచ్చినట్టే కన్పిస్తోంది. పీవీఆర్- ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు మలయాళం సినిమాల్ని ప్రదర్శించకపోవడం వల్ల దక్షిణాది రాష్ట్రాల నిర్మాతలకి కలిగిన నష్టాన్ని భర్తీ చేసే వరకు పీవీఆర్ యాజమాన్యంలోని ఏ స్క్రీన్ లేదా థియేటర్‌కి మలయాళ సినిమాలు ఇవ్వబోమని ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఫెఫ్కా) కూడా ప్రకటించడంతో వివాదం మరింత ముదిరింది. అయితే ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రముఖ వ్యాపారవేత్త జోక్యంతో ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. పీవీఆర్ వసూలు చేసే వర్చువల్ ప్రింట్ ఫీజు (వీపీఎఫ్) విషయంలో పీవీఆర్ కీ, మలయాళ నిర్మాతలకీ మధ్య వివాదం మొదలైంది. పరస్పరం బహిష్కరించుకున్నారు. దీంతో విజయవంతంగా రన్ అవుతున్న సినిమాలు సహా, మొన్న ఈద్ సందర్భంగా విడుదలైన మలయాళం సినిమాల ప్రదర్శనలు కూడా పీవీఆర్ లో నిలిచిపోయాయి.

ఇటీవల ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తన సొంత పిడిసి (ప్రొడ్యూసర్స్ డిజిటల్ సినిమా) అనే కంటెంట్ మాస్టరింగ్ యూనిట్ ని లాంచ్ చేసింది. థియేటర్లలో సినిమాల్ని ప్రదర్శించడానికి ప్రస్తుతమున్న క్యూబ్, యూఎఫ్ఓ, పీఎక్స్ డీ, టీఎస్ఆర్ వంటి కంటెంట్ ప్రొవైడర్ల చార్జీలు అధికంగా వున్నందున ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సొంత పిడిసిని లాంచ్ చేసింది. ఒక్క క్యూబ్ నే తీసుకుంటే వీపీఎఫ్ రేటు వారానికి రూ. 14 వేలు చార్జి చేస్తున్నారు. 8 వారాలు సినిమా ఆడిందంటే లక్షలకి లక్షలు చమురు వదులుతుంది, నిర్మాతలు ఎక్కడికి పోవాలి? అదే పిడిసి అయితే పన్నులు కలుపుకుని రూ 3,500 గా నిర్ణయించాం, ఇది ఒకసారి చెల్లించి ఎన్ని వారాలైనా సినిమాలు ఆడించుకోవచ్చు- అనేది నిర్మాతల నివేదన.

ఇక్కడే పేచీ మొదలైంది. క్యూబ్, యూఎఫ్ఓ తప్ప నిర్మాతల పిడిసిని ఒప్పుకోమనీ, ఇది చట్ట విరుద్ధమనీ పీవీఆర్ వాదించింది. నిర్మాతలు పట్టు వదలకపోవడంతో, పీవీఆర్ దేశవ్యాప్తంగా మలయాళ సినిమాల ప్రదర్శనని నిలిపి వేసింది. మలయాళ డబ్బింగు సినిమాలని కూడా నిలిపి వేసింది. దీంతో తెలుగులో రన్ అవుతున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ ప్రదర్శన అర్ధాంతరంగా ఆగిపోయింది. కేరళలో ‘ఆడు జీవితం’ కూడా ఆగిపోయింది. ఈద్ కి విడుదలైన ' వర్షంగల్కు శేషం', 'ఆవేశం', 'జై గణేష్' సినిమాల్ని పీవీఆర్ దేశంలో ఎక్కడా ప్రదర్శించలేదు.

ఆదివారం మధ్యాహ్నం ఓ ప్రముఖ వ్యాపార వేత్త కుదిర్చిన రాజీ ప్రకారం ప్రస్తుతం సినిమాలని యధావిధిగా ప్రదర్శించాలి, వివాదాంశాల్ని తర్వాత సెటిల్ చేసుకోవచ్చు. వివాదాంశాలు రెండే : పిడిసి ని అంగీకరించడం, నిలిపేసిన సినిమాలకి నష్టపరిహారం చెల్లించడం.

వర్చువల్ ప్రింట్ ఫీజు అనేది మల్టీప్లెక్స్ చైన్‌ల వంటి డిజిటల్ సినిమా సర్వీస్ ప్రొవైడర్లు, థియేటర్లలో ఇన్‌స్టాల్ చేసిన డిజిటల్ ప్రొజెక్షన్ పరికరాల కోసం (ప్రొజెక్టర్‌ల వంటివి) డిస్ట్రిబ్యూటర్‌లపై, నిర్మాతలపై విధించే ఛార్జీ. పూర్వం సినిమాల స్క్రీనింగ్‌ల కోసం ఫిజికల్ ఫిలిం ప్రింట్లని ఉపయోగించే వారు. అయితే 2010లో డిజిటల్ ప్రొజెక్షన్‌కి మారడంతో, డిజిటల్ పరికరాలతో థియేటర్‌లని అప్‌గ్రేడ్ చేయడానికి ఖర్చు భారం పంపిణీదారులతో బాటు నిర్మాతలపై పడింది. కాలక్రమేణా ఆర్థిక భారాన్ని తగ్గించడానికి వీపీఎఫ్ ఒప్పందాలు జరిగాయి. ఈ వీపీఎఫ్ ఛార్జీలు సింగిల్ స్క్రీన్ లేదా మల్టీప్లెక్స్ స్థాయిని బట్టి ఒక్కో స్క్రీన్‌కి రూ. 12,000 నుంచి రూ. 25,000 మధ్య వుంటాయి.

వీపీఎఫ్ ఒప్పందం ప్రకారం, డిజిటల్ ప్రొజెక్షన్ ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాలేషన్ కి, మెయింటెనెన్స్ ఖర్చులు కవర్ చేయడానికీ డిస్ట్రిబ్యూటర్‌లు ఒక్కో సినిమాకి రుసుము చెల్లిస్తారు. ఈ రుసుము తరచుగా అనేక సంవత్సరాలు కొనసాగుతూనే వుంటుంది. హైవేల మీద టోల్ గేట్ల లాగా. ఇదే వివాదానికి దారితీస్తోంది.

First Published:  15 April 2024 12:31 PM GMT
Next Story