అమిత్ షాను వాడేస్తున్న‌ కాంగ్రెస్‌

నిత్యం బ‌హిరంగ వేదిక‌ల‌పై కాంగ్రెస్ ప‌రువు తీసేలా విమ‌ర్శించే బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను ఇప్పుడు అదేపార్టీ వాడుకుంటోంది. శ‌త్రువుకు శ‌త్రువు మ‌న‌కు మిత్రుడే అన్న సామెత ప్ర‌కారం తెలంగాణ‌లో కాంగ్రెస్ ముందుకుపోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు బీజేపీ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి. కానీ తెలంగాణ‌లో బీజేపీకి అంత సీన్ లేదు. పైగా బీజేపీ కూడా తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్ష‌మే. ఇద్ద‌రికీ ఉమ్మ‌డి ప్ర‌త్య‌ర్థి టీఆర్ ఎస్సే! కాబ‌ట్టి ఒక‌రి మాటను మ‌రొక‌రు వాడుకుంటున్నారు. ఎలా అంటారా?  మీరే చ‌ద‌వండి.
తెలంగాణ‌కు రూ.90 వేల కోట్లు ఇస్తే ఏం చేశారు? అన్న‌ అమిత్‌షా మాట‌ల‌ను అధికార ప‌క్షం లైట్ తీసుకున్నా.. విప‌క్షాలు మాత్రం సీరియ‌స్‌గా తీసుకుంటున్నాయి. అమిత్‌షా అబ‌ద్దాలు చెబుతున్నార‌ని గ‌ణాంకాల‌తో  స‌హా ప్ర‌తివిమ‌ర్శ‌లు చేశారు టీఆర్ ఎస్ మంత్రులు. అయితే, ఇప్పుడు అవే ఆరోప‌ణ‌లను అస్ర్తంగా మ‌లుచుకుంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్‌. అమిత్‌షా మాట‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా మీరెందుకు ఉలిక్కి ప‌డుతున్నార‌ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు కె.ల‌క్ష్మ‌ణ్ ధ్వ‌జ‌మెత్తుతున్నారు. అమిత్‌షా అన్న‌దాంట్లో త‌ప్పేంలేద‌ని వెన‌కేసుకొస్తున్నారు. చేతనైతే ఆయ‌న మాట‌ల‌కు స‌మాధానాలు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. 
ఇక‌పోతే కాంగ్రెస్ పార్టీ కూడా అమిత్‌షా మాట‌ల‌ను బాగానే వాడేస్తున్నారు. సాక్షాత్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ జాతీయాధ్య‌క్షుడే రూ.90 వేల కోట్లు ఇచ్చార‌ని చెబుతున్న‌పుడు ఆ నిధుల‌ను ఏం చేశారు? అని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఆ డబ్బుల‌తో ప్ర‌త్య‌ర్థి పార్టీల్లో నేత‌ల‌ను బ‌ల‌వంతంగా పార్టీ ఫిరాయించేలా చేస్తున్నార‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో కుటుంబ పాల‌న సాగుతోంద‌న్న అమిత్‌షా ఆరోప‌ణ‌ల‌ను కూడా ఉత్త‌మ్ ప్ర‌స్తావించ‌డం ఇక్క‌డ విశేషం. మొత్తానికి ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే కాంగ్రెస్- బీజేపీలు కేసీఆర్ ను విమ‌ర్శించేందుకు ఒక‌రి మాట‌ల‌ను మరొక‌రు వాడుకోవ‌డం విశేషం. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here