Telugu Global
CRIME

యూపీలో కొనసాగుతున్న ఘోరాలు.. విద్యార్థినిని నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు

విద్యార్థిని కాల్చి చంపడాన్ని చూసిన చుట్టుపక్కల వారు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే దుండగులు కాల్పులకు ఉపయోగించిన గన్ ను వారిపై విసిరి పరారయ్యారు.

యూపీలో కొనసాగుతున్న ఘోరాలు.. విద్యార్థినిని నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు
X

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాల్పుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఒకవైపు పోలీసులు ఎన్ కౌంటర్ల పేరుతో రౌడీలను ఏరిపారేస్తుంటే.. మరోవైపు దుండగుల అరాచకాలు కూడా విచ్చ‌ల‌విడిగా కొనసాగుతున్నాయి. తాజాగా కొందరు దుండగులు అంద‌రూ చూస్తుండ‌గానే న‌డిరోడ్డుపై కళాశాల విద్యార్థినిని కాల్చి చంపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది.

జలౌన్ జిల్లాకు చెందిన దళిత విద్యార్థిని రోహ్ని అహిర్వార్ (21) డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. సోమవారం ఉదయం ఆమె జలౌన్ లోని రామ్ లఖన్ పటేల్ మహా విద్యాలయానికి వెళ్లి పరీక్ష రాసింది. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో కాలేజీ నుంచి ఇంటికి బయలుదేరింది. ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా బైక్ పై ఇద్దరు దుండగులు ఆమెను అనుసరించారు. ఓ వ్యక్తి ఉన్నట్టుండి గన్ తీసి రోహ్ని తలకు గురిపెట్టి కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

విద్యార్థిని కాల్చి చంపడాన్ని చూసిన చుట్టుపక్కల వారు దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే దుండగులు కాల్పులకు ఉపయోగించిన గన్ ను వారిపై విసిరి పరారయ్యారు. ఈ కాల్పుల ఘటన పోలీస్ స్టేషన్ కు కేవలం 200 మీటర్ల దూరంలోనే జరగడం శోచ‌నీయం. దుండగులు బైక్ పై రావడం, విద్యార్థినిని కాల్చి చంపడం వంటి దృశ్యాలు సమీపంలోని సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యాయి.

ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించింది. విద్యార్థిని మృతిప‌ట్ల కూడా బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటారా..? అని ప్రశ్నించింది. ప్రయాగ్ రాజ్ లో గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ సోదరులను దుండగులు పోలీసుల సమక్షంలోనే కాల్చి చంపి రెండు రోజులు గడవక ముందే యూపీలో మరో కాల్పుల ఘటన జరగడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. వరుస కాల్పుల ఘటనలు జరుగుతుండటంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రోహ్ని హత్యలో రాజ్ అహిర్వార్ అనే వ్యక్తి పాత్ర ఉండొచ్చని విద్యార్థిని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు.

First Published:  17 April 2023 2:07 PM GMT
Next Story